కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
మాధవవర్మ

4. మాధవవర్మ
(క్రీ. శ. 350)

ఇతఁడు పల్లవరాజు. నేఁటి బెజవాడ రాజధాని. ఇతఁడు బృహత్పలాయనులకు పూర్వుఁడు. శివస్కంధవర్మాదుల కాలమువాఁడు కావచ్చును. ఈ కథ ఒక శాసనము లోనిది. అతని ధర్మమునకు మెచ్చి దేవతలు రెండు ఘడియల కాలము విజయవాటికా పట్టణములో కనకవర్షము కురిపించిరఁట.

విజయవాటిక కోటవీధిలో నాఁడు సం-రంభంబు పొందుచు రాజభటులు
ప్రజ నొత్తుచున్నారు ప్రక్కప్రక్కలకు, భూ - మీజాని యేకతనూజుఁడతఁడు
పదివేల దివ్యసువర్ణమ్ముల నొసంగి - శ్వేత మత్తాశ్వముల్‌ విలిచినాఁడు
అవి పూన్చిన రథంబు నారోహణచేసి - అతఁడు పురంబు వాహ్యాళిపోవు
        రాజపుత్త్రుఁడు కొన్న తురంగము లవి
        బహుళభద్రచిహ్నములు, శుంభన్మహాగ్ని
        వమ దమోఘ నాసాపుట భ్రమితసాంద్ర
        ఫేనములు, ఖురఘట్టితోర్వీతలములు.
గ్రీష్మవేళానిరాకృతి మేఘ గర్భఘూ - ర్ణితవైఖరీ నేమినిస్వనములు
చలిత శైలాగ్రనిర్ఝరిణీవిధా భద్ర - జాత్యశ్వ దివ్య హేషాస్వనములు
కుద్దాలశాతోగ్ర ఖురవిఘట్టితధరా - చటులోద్ధత పరాగసంచయములు
మత్తక్రుద్ధాహి సంరావత్కశాగ్ర సం-చాలనోద్భూత నిస్వానకములు
        మెఱుములుఱుములై వచ్చి నిమేషమంద
        దాటిపోయె రాసుతుని స్యందనము కదలి,
        పుడమిఁ దచ్చక్రఘట్టితాంగుఁడయి నెత్తు
        రోడికలుకట్ట నటఁబడియుండె నొకఁడు.
పరుగెత్తురథమువెంబడిఁ ప్రజల్‌ మూఁకలై - పెద్దయుఁ బరువులు వెట్టినారు
ఎచటఁబ్రజల్‌ మూఁగి రచట కేగిరి పోను - మఱి రాజభటులు సమ్మర్ద మెడప
అరదంబు వెనువెంట ననుసరింపక యేండ్లు - మీఱినవారు భూమీతలాన
ధూళిధూసరిత మై వ్రాలిపోయినయట్టి - శవమును గనుఁగొని జాలిపడిరి,
        అంతలో లోకబాంధవుఁ డస్తమించె
        అస్తగిరిగహ్వరాంత నిత్యస్థితాంధ
        కార కృష్ణవర్ణాహిసంచారభయద
        మై కకుప్పులు శ్యామలమ్మై తనర్చె.
పొడుపుమల వెల్గునెత్తాల పొడిచి దివ్య
కాంతి దిక్కుల వెదఁజల్లెఁ గర్మసాక్షి,
ఉర్వి నేల ధర్మాసనంబుండె నతఁడు
పల్లవేంద్రుండు మాధవవర్మనృపతి.
మృదుల కపోలపత్రముల మీఁదికి నుబ్బెడు కుండలమ్ములన్‌
పొదిగిన రత్నదీధితులు మోసులు దాటి ప్రభాతనీరజా
భ్యుదయములైన దివ్యనయనోజ్వలదీప్తులు దాటి శీతరు
గ్వదనముదాటి ధర్మమయొకండు తదాస్యమునందుఁ దోఁచెడిన్‌.
కాబోలు నీమె శోకంబుకట్టినమూర్తి - అతిభూమిదుఃఖభారానతాంగి
కాబోలు నీదుఃఖగత నిరాశాదేవి - పతితోర్థ్వపక్ష్మల బాష్మనేత్ర
కాబోలునీమె యేకతనూజవిరహిత - అతిదూషిత శరీరగతనిరాస్థ
కాబోలు నీ వృద్ధకాంత నాయార్థిని - బహుళక్రుధాభుగ్నఫాలభాగ
        అనఁగ, నొకవృద్ధ పేదరా లరుగుదెంచి,
        నెత్తు రట్టలుకట్టిన నిజకుమారు
        శవము దిగఁజార్చి, చేతులుచాచి శవము
        వైపు తన దృష్టి భూపతివైపు త్రిప్పి
"ఓయి నృపాల! యీ బుడుత యొక్కడు నాదుకులంబు తేప, నీ
వో అతిధర్మరాజ వయయో! ఇదియేమిటయా! గతాసువై
యీ యనుఁ గేఁగెఁబో తినుట కే మిఁకనున్నది, నాకునేమి నేఁ
డే యిదె వీని వెంటఁబడి యేగెద, కోడలి కేమికావలెన్‌?
ఇంతకు మించి యాపద లిఁ కేమనికల్గు, రథంబుచేతఁద్రొ
క్కింతురటయ్య భూప్రజల, నెంతగనున్న సిరుల్‌ భుజింత్రు పా
లింతురు, రాజులైన నదలింతురు, తప్పులుకల్గినన్‌ విచా
రింతురు కాక, చంపుట సరే ప్రజ నిట్టు లకారణంబుగన్‌?"
అని "నీయిష్టము న్యాయమో మఱియునన్యాయంబొ నీచేతిమీఁ
దనె కాని మ్మిదె పోవుచుంటి" నని బాధాపూర్ణ నేత్రద్వయం
బున నేవో వికృతస్వరూపఘటనంబుల్‌ గల్గి యా వృద్ధ యం
తన నచ్చోట గతాసువై పడియెఁ బుత్రాయల్ల కాయాసయై.
ఆ సమయంబునన్‌ నృపుని యాననసీమ ప్రశాంతిచిహ్నముల్‌
భాసురముల్‌ వెలార్చె నరపాలునితత్సభలోనివార లా
హా సముదీర్ణ వక్త్రులు దృగంతవినిశ్చలవృత్తు లంతలో
నైశితదీప్తి వొల్చె నరనాథు విశాలవిలోచనంబులన్‌.
అధికృతులఁ బ్రాడ్వివాకులఁ
బ్రధానసచివులను జూచి వాక్పతినిభుఁడా
పృథివీపతి ధర్మోన్నతి
విధావినిర్ణయము చేయు విధి పనివెట్టెన్‌.
ప్రాడ్వివాకులను దీర్ఘముగ యోజించి స-మర్పించి రఖిలమ్ము నధికృతులకు
మత్తాశ్వములుపూన్చి మనుజనాథసుతుఁడు - పురవీధులందునఁ బోవరాదు
పసిపాప లుందురు పంగ్వంధు లుందురు - ప్రాణమ్ము ప్రాణమ్ము బదులుగోరు
స్మృతికి భూమీజానిసుతుఁ డని కాదని - లేదు, నీతికి దయలేదటంచుఁ
        ప్రాడ్వివాకులు పడు నభిప్రాయము పడి
        రధికృతులు తీర్పు వినిపించి రవనిపతికి,
        తీర్పు వినినంతసేపు ధాత్రిపతిమోము
        కనుతుదలనైనఁ గదలిక కాంచలేము.
ఆకాశమధ్య సౌధాగ్రమ్మునను జేరె - నప్పుడే తీక్ష్ణమార్తాండమూర్తి
బ్రధ్నాంశు తప్తవాఃపథి కృష్ణవేణిక - ఇంద్రకూటపుటొడ్డు లెగచి మొరసె
కడగి మధ్యాహ్న శంఖధ్వనుల్‌ పల్లవ - క్ష్మాతలేంద్రుల మొగసాల మ్రోఁగె
నాఁటికి ధర్మాసనంబు చాలించె మా - ధవవర్మ ఆంధ్రపల్లవ నృపాలుఁ
        డాసనమ్మున నృపతి యున్నంతవఱకు
        నెంత గంభీరుఁడో డిగి యంత దుఃఖ
        దళితచేతస్కుఁడైఁన, బ్రధానసఖులు
        రాజుఁగొనితెచ్చి రంతఃపురంబునకును.
సచివులు పుత్రశోకభర సంజ్వరు భూపతిఁజూచి వారు తీ
రిచినది తీర్పు రాజు సవరించను వచ్చునటంచుఁ జెప్ప న
య్యుచితవివేకి "పుత్రవిరహోగ్రభరాత్ముఁడఁగాని న్యాయకా
ర్యచరణభారదుఃఖవివశాత్ముఁడఁ గా"నని పల్కె వెండియున్‌.
అసువులు పోవునంతవఱ కా పతి యేగెనుగాని పాప మే
కసుతవియోగదుఃఖితుఁడు, క్ష్మాపతిదేహము భూప్రజార్థమై
యసువుల నిల్పె, నాఁటి దివసాంతమునన్‌ యువరాజుమేనిలో
నసృగుదితప్రవాహవలయంబులలో మలుసంజ వొల్చెఁబో!
నటశివ సాయంసంధ్యా
చ్ఛటాఘటానూపురమణిసంభవకాంతి
స్ఫుట 'చిట చిట చిట' నినదో
ద్భటకనకము విజయవాటి వర్షము కురిసెన్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - maadhavavarma Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )