కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
ముఖలింగము

6. ముఖలింగము

ఇది గంజాం మండలములోని ఒక మహాక్షేత్రము. పూర్వము ఇది కళింగ గాంగులకు రాజధాని. ఆరాజులే ఇచ్చటి శివాలయప్రతిష్ఠాపకులు. అనంతవర్మ చోడగంగదేవుఁడు పరాక్రమశాలి. అతని రాజ్యము గోదావరి మొదలు గంగవఱకు వ్యాపించినది. వేములవాడ భీమకవి చోడగమ్గుని నాఁటివాడే. చోళచక్రవర్తి గంగైకొండని యిద్దఱు కూతుళ్ళలో నొక్కరిత రాజమహేంద్రనగరరాజు రాజరాజునకు, రెండవయామె చోడగంగదేవు తండ్రికిని భార్యలు. ఈ వంశములో అన్యంకభీముఁడు మఱీ పరాక్రమవంతుఁడు. ముఖలింగానికి వంశధారానది మూఁడువైపుల నగడ్తవలెఁ జుట్టుకొన్నది. మేము కళింగోత్సవమునకు వెళ్ళినప్పుడు వరదలు కట్టి మమ్మ్ముఁ గదలనీయలేదు.

దేవమాతృకలు వర్ధిత హేమ కేదారఖండపుణ్యము లిందుఁ బండెనేమొ
తెలుగు కళింగరాజుల గుండె నెత్తురుల్‌ కడఁగి రక్షాదీక్షఁ గదలెనేమొ
శ్రీగంధ కస్తూరికాగురు ద్రవ్యమ్ములిట దిగంతముల వాసించెనేమొ
శూరగంగైకొండచోడుతో నీ చోటు వియ్యాల బిగువులు బిగిసెనేమొ
        దక్షవాటీపురీ కవిరాక్షసుండు
        ప్రళయవహ్ని శిఖాధూమపటల మమృత
        బిందు శైతల్య మొక వాక్కునందె యిచట
        బిట్టు మండించి శీతలింపించె నేమొ.
ఈ చోటఁ దొలినాఁడు ప్రాచీసతి ముఖాబ్జమున నెఱ్ఱకుంకుమబొట్టు దిద్ది
ఈ నేలను గళింగభూనాథశౌర్యానలజ్వాల ధూమనైల్యములు కమ్మి
ఈ పవిత్రధరిత్రి నోపి త్రైలింగరాజ్యశ్రీ సుధాప్రవర్షంబు కురిసి
కడగి యిచ్చట మంటిగడ్డలు సైతమ్ము నవమృగీమదవాసనలు విదిర్చి
        వేఁగి విషయేశ చాళుక్యవిభులతోడ
        మనసులో నన్నదమ్ములతనము నెఱపి
        మున్నిచటు తెన్గు రాణించుకొన్న చోటు
        లీలమించిన యీ ముఖలింగ ప్రతిభ.
ఆ దినాల నెంతటి నిశితానురాగ
మగు కళాశిల్పములను విద్యలను జూడఁ
బగటి వేసాలకొఱకుఁ దూర్పారపట్టెఁ
బ్రాణములను కళింగగంగ్రాజువైరి?
చిఱుత తరంగముల్‌ కలసి జీబులుకట్టిన వంశధారలోఁ
దఱుముకువచ్చె తెల్గులప్రతాపశిఖల్‌ ముఖలింగనాథు క
న్నుఱిమిన నిప్పుకల్‌ సెగల నొక్కదినాన కళింగగాంగు లే
లి రనిననాళ్ళ నేఁటికవులే పొనుపడ్డవి తెన్గు నిప్పుకల్‌.
ముఖలింగ ప్రభురాజు ముద్దునవలా ముక్కంటి క్రొన్నిప్పుకల్‌
ముఖరీభూత వియత్పథ భ్రమరితాంభో వంశధారాపయ
స్సఖ శైతల్యముచేతఁ జెమ్మగిల్లి దీక్షాసంగృహీత ప్రతా
ప ఖరాంశుల్‌ కుదియించుకొన్నయవి కావచ్చున్‌ మిథస్స్పర్శచే
ఏ పాపమునకు దానీ ఫలం బబ్బెనో అన్యంక భీమేశ్వరాలయమునఁ
దెలుఁగు కళింగరాజుల జైత్రయాత్రల గజరాజయూధముల్‌ కదలువేళ
ముందీ శివుండు నిప్పుకలు గ్రక్కెడు కంట నెదిరి సైన్యంబు ముట్టించు నంట
ఆ దేవదేవు దేవాలయంబున నేఁడు గబ్బిలంబులు తిరుగాడఁజొచ్చె
        ద్వారబంధాలపై వ్రాయఁబడిన తొంటి
        తెలుఁగులిపి పోల్చుకొని కూడఁబలుకు కొనెడు
        నా మహామాతృదేశ బద్ధానురాగు
        లెవరో నా గుండెనెత్తురు లిట్లుకదుప!
ఏ పరజన్మలోఁ గలసి యే మొక తల్లియు బిడ్డ యైతిమో
నాపయి నీ ధరాస్థలికి నాటిన ప్రేమ మదెంతయో కదా
తేపకు వంశధార పఱతెంచి నిశాఖిలమార్గరోధియై
యీ పయనమ్ము నన్నుఁ జననీయక నిల్పుకొనెన్‌ దనంతటన్‌.
కడముట్టిన కళింగ జ్యోతి యోడిన చమురు బొట్లామ్రేడితములు నెఱపి
తెలుఁగు కళింగరాజుల గుండెలో నెత్తురులకు పౌనఃపున్యములు ఘటిల్లి
తెలుఁగు పొలాలు బోదెలు త్రవ్వుకొన్న కాలువ శైవజటవారి ప్లుతముచూపి
ఈ వంశధారామహీయస్తరంగ పాథఃప్రవాహముల కధ్యాహరించి
        నా హృదయసీమలో నసృఙ్నాళగర్భ
        పథములంబడి యొరసి ప్రవాహ మేచి
        యూగి బుడగలై యుబికి వచ్చి
        నా కనుల తుట్టతుదలలో నాట్యమాడు.
పాడిన గీతమే మఱలఁ బాడెదఁ గూడినభావమే మఱిం
గూడెద నేమి సేయవలె గుండియ శోషిలి దుఃఖవేదనన్‌
గాడిన నా హృదంతరముఖంబున మా తొలినాఁటి కీర్తి రా
పాడిన నాదువాక్కు తెగఁబాఱదు నూత్నపథాల వెంబడిన్‌.
ఈ పొంగెత్తినవంశధార మఱి యిట్లే పొంగులై పొంగులై
నాప్రాణమ్ములు దేహ మీజలములోనన్‌ ముంచుకోనిమ్మ యే
యే ప్రారంభములేని యీ తెనుఁగు లిట్లే గూఢసంవర్త వే
ళాపర్యంతము నుండనిమ్ము విధి యేలా మారు మాకోసమై.
నా జాతి పూర్వప్రధా జీవరహితమై శక్తి నాడుల యందుఁ జచ్చిపోయి
నా మాతృభూమి తేజోమహశ్చ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంటగలిపి
నా మాతృభాష నానాదుష్టభాషల యౌద్ధత్యమును దల నవధరించి
నా తల్లినేల నే నాఁటి వాచారముల్‌ పై మెఱుంగులు చూచి బ్రమసిపోయి
        ఏమి మిగిలినదీ నాఁటి కిట్లుపొంగు
        లొలయు వర్షానదీ గభీరోదకముల
        దైన్యగర్భ చారిత్రముల్‌ దక్క భిన్న
        గిరిశిఖర దుర్గ పరిదీన గీతిదక్క.
ఇచటి 'నాగావళీ' ప్రచురవర్షాంభ స్తరంగముల్‌ 'వంశధారా' జలములు
తరఁగెత్తిన 'మహేంద్రతనయా' సుపాథస్సు లొకసారిగాఁ బొంగి యుబికిపోయి
'గౌతమీ కృష్ణవేణీ' తరంగములు తారాధ్వమ్మునందు నైక్యము భజించి
'గుండ్లకమ్మ' జలాల గుబురులో గుబురులై 'పెన్నా' తరంగముల్‌ పెరిగిపోయి
        తెలుఁగు నదులెల్ల పొంగెత్తి ప్రళయవారి
        కెరలిపడి తెన్గునేల ముగించనిమ్ము
        నేఁటితో నస్వతంత్రతా నియతమైన
        యీ బ్రతుకు తెన్గువారు భరించలేరు.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - mukhaliMgamu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )