| భాష | ఛందస్సు | ఛందోదర్పణము ప్రథమాశ్వాసము |
ఛందోదర్పణము - అనంతామాత్యుఁడు - ప్రథమాశ్వాసము
| ఇష్టదేవతా స్తుతి | ||
|
శ్రీరామా స్తనమండలీమిళిత కా-శ్మీరార్ద్ర వక్షంబుతోఁ బారావారతరంగసంగత లస-త్పర్యంక నాగంబుపైఁ గారుణ్యామృత పూరపూరిత కటా-క్షశ్రీలఁ బెంపొందు గం భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనా-భీష్టప్రదుం డయ్యెడు\న్. |
1 | |
|
అతని దశావతార విభవాతిశయంబున లోకమెల్ల శా శ్వత మగుచాడ్పున\న్ భజన సమ్యతరల్గ దశాక్షరాభిశో భితమగు వాక్ప్రపంచమది పెద్దయుఁ బ్రస్తుతి నొందనట్టిచో నతఁడును నమ్మహాక్షరచయంబు జయంబు నొసంగుఁగావుతన్. |
2 | |
| క. |
శ్రీవల్లభు యతిగణసం సేవిత పాదారవిందుఁ జింతితఫలదు\న్ భావజగురునలఘుచ్ఛం దోవినుతు ననంతశయనుఁ దోయజనాభున్. |
3 |
| క. |
ఛందోరీతిగ విమల చ్ఛందుఁ డనంతుం డొగిం బ్రశంసించి కృపా మందిరులగు శ్రీమద్గో విందగురు ప్రభులదయఁ బ్రవీణుండగుచున్. |
4 |
| ఛందః ప్రాశస్త్యము | ||
| క. |
విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వంబు మఱి కవిత్వము ఛందో వేద్యము గావునఁ జెప్పెను హృద్యంబుగఁ గవితచందమేర్పడఁ గృష్ణా! |
5 |
| సంజ్ఞా ప్రకరణము | ||
| గద్య పద్య లక్షణము | ||
| ఆ. |
పరఁగుఁ గవితగద్యఁపద్యంబు లనఁ బాద కల్పనంబువలదు గద్యమునకు పాదనియతినొప్పుఁ బద్యంబు లవియు వృ త్తములు జాతు లనఁగ నమరుఁ గృష్ణ! |
6 |
| గురు లఘు నిర్ణయము | ||
| క. |
వృత్తంబులు గణబద్ధము లుత్తమమగు జాతులెల్ల నొనరఁగ మాత్రా యత్తంబులు లఘువగుఁ బురు షోత్తమ యొక మాత్ర గురువు నొదవు ద్విమాత్రన్. |
7 |
| క. |
వివిధముగఁ జాఁపిపలికెడు నవియును మఱియూఁది పలుకునవియును గురువుల్ భువి నిలిపిపలుకు వర్ణము లవియెల్లను లఘువులయ్యె నంబుధిశయనా! |
8 |
| క. |
గురు వమరు నూర్ధ్వపుండ్రము ధరియించినరీతి, లఘువు దనరును హరియొ క్కరుఁడ పరతత్త్వ మనుచును సురుచిరముగఁ జుట్టివ్రేల జూపినమాడ్కిన్. |
9 |
| క. |
గోవిందప్రభుఁ డనిన\న్ గోవిదు లవి మూఁడుమూఁడు గురులఘువులుగా భావింతురు గురులఘువులు మోపఁగ మూఁడేసి నిక్కముగ గణములగున్. |
10 |
| గణాష్టక లక్షణము | ||
| క. |
భజన సమయరతగణములు భజన సమయరతములై సభక్తికమతిఁ బం కజనాభు నహర్నిశమును భజించు దిక్పాలగణవిభాతిఁ దనర్చున్. |
11 |
| గీ. |
గురులఘువు లోలిమూఁడేసి కూడిన మన, లాదిమధ్యావసానంబులందు గురువు లొంద భజసలు, లఘువు లట్లొంద యరత లనఁగ నయ్యష్టగణము లొప్పును ముకుంద! |
12 |
| క. |
చను మగణము 'శ్రీనాథా' యనిన, 'ముకుందా' యనంగ యగణము, రగణం బన నొప్పు 'మాధవా' యన, నొనరఁగ 'వైకుంఠ' యనఁగ నొగిఁ దగణమగున్. |
13 |
| క. |
భగణమగు 'విష్ణుఁడ'నఁగా, సగణితముగ జగణ మగు 'మురారి' యనంగా, నగణము 'విభుఁ డ'నిపలికిన, సగణము 'వరదా' యనంగ సత్కృతులందున్. |
14 |
| క. |
గురువును లఘువును లఘువును గురువును హవలగును, గలలు గురులఘుసంజ్ఞల్ వరుసను గగ లల గణముల కరయఁగ వర్ణములు ద్విగుణమై యొప్పు హరీ! |
15 |
| క. |
'శౌరి' యనిన హగణంబగుఁ, జేరి 'హరీ' యనఁగ నుల్లసిల్లును వగణం బారయఁ 'గృష్ణా' యనినను ధారుణి గగ మండ్రు, లలము దా 'హరి' యనినన్. |
16 |
| సీ. |
'కమలనాభా' నగగంబు 'కమఠరూప' - నహ 'మసురాంతక' నాఁగ సలల, 'మద్రిధర' భలంబు 'భద్రయశా' యన్న - భగురు 'వంభోజాక్ష' మగణలఘువు, 'భువనేశ్వరా' యన్న సవ 'మఘవిద్వేషి' - సహము 'పీతాంబర' సంజ్ఞ తలము, 'కైటభారి' రలంబు 'గజవరదా' యన్న - నవ 'మహిశయన' నా నలలమయ్యె |
|
| ఆ. |
రగణగురువు 'దేవరాజా'యనంగఁ 'బ ద్మావతీ' యనంగ దగణగురువు 'నరహరీ' యనంగ 'నరహరి' 'నరసింహ' నాఁగ నొప్పు నగము నలము సలము. |
17 |
| ఇంద్రచంద్రాది గణభేదములు | ||
| క. |
ద్విత్రిచతుర్గురుభవముల ధాత్రీధర రెండు మడఁపఁ దక్కినగణముల్ మిత్రేంద్రచంద్రు లనఁ జను మాత్రాదిగణంబు మొదల మాత్ర లిడంగన్. |
18 |
| క. |
గలనగణము లినుఁ; డింద్రుఁడు నలనగసలభరత, లింక నగగ నహ సలా భల భగురు మలఘు సవ సహ తల రల నవ నలల రగురు తగ లిందుఁ డజా! |
19 |
| గీ. |
ఒక్క నెలవున నెనిమిది యొకట నాల్గు వెండి లఘువెక్కినవి నాల్గు వీనిలోన నగణపునరుక్తి నొక్కటి డిగియె నౌల దొంతి పదునాల్గు నిరువదితొమ్మిదింట. |
20 |
| సంయుక్త వర్ణ గణంబులు | ||
| క. |
జగణము నలమగు గగములు భగణములగు గలము నగణభావంబుఁ గను\న్ సగము నగణ వగణములగుఁ దగణము భలమగును సంయుతముఁ దీర్చినచోన్! |
21 |
| క. |
మొగిళులు నలమగు నిటుల\న్ నగణము సగణమగు నిటు లనంగుని తండ్రీ! తగణము పాళు లనంగా భగణము వాకిళ్ళు భలము వాకిళులనఁగన్. |
22 |
| గణ ఫలములు | ||
|
నవ్యసుఖప్రదాయి భగణంబు, జకారము రుక్ప్రదంబగు\న్, ద్రవ్యముఁ జేయు నా, లయకరంబు స కారము, మా శుభంబు, యా దివ్యసువర్ణకారి, వెతఁదెచ్చును రేఫ, విభూతినిచ్చుఁ దా, గావ్యములందు నాదినిడఁ గర్తకు భర్తకు నంబుజోదరా! |
23 | |
| గణాధిదైవతములు | ||
|
భగణము నేలుఁజందురుఁడు, భానుఁడు దా జగణంబు నేలుఁ, దా నగణము నేలు నిర్జరగణంబుఁ, సమీరణుఁ డేలు నెప్పుడు\న్ సగణము, నుర్వియేలు మగణంబు, నొగిన్యగణంబుఁ దోయము\న్, రగణముఁ బావకుండుఁ, దగణంబు నభంబును నేలుఁ, గేశవా! |
24 | |
| కృత్యాది వర్జనీయ గణములు నక్షరములు | ||
| క. |
పుర, శర, రస, గిరి, రుద్రుల నరయ నకచటతప లిడుట యనుచిత మయ్య క్షరములును రసభజంబులుఁ బరిహరణీయంబు లాదిఁ బంకజనాభా! |
25 |
| క. |
మొదలును కఖజలు చఛడలు దధలును భయశక్షషసలు తగ వుపవర్ణా స్పదములు గాకుండిన మే లొదవించును స్వరములెల్ల నుత్సవకారుల్. |
26 |
| క. |
మొదల నభంబులు రెండును గదిసిన విభవంబు తభసగణసంగతి యొ ప్పదు రయముల నధికశుభం బొదవును భయములను హానినొందు నృసింహా! |
27 |
| క. |
ఒనరఁగ శుభవాచకములు ఘనతరమగు దేవవాచకంబులు నై పే ర్చినగణములు వర్ణంబులు ననింద్యములు కృతుల మొదల నహిపతిశయనా! |
28 |
| ప్రాస ప్రకరణము | ||
| క. |
ప్రాసం బగు రెండవయది వాసనగల మొదలి వ్రాయి వడి యనఁబరఁగు\న్ బ్రాసంబు లన్ని యెడలను బాసురముగ వడులు పాదపాదముల హరీ! |
29 |
| క. |
ఆదిని గురులఘువులలో నేది నిలిపె నదియె మొదల నిడి పాదము లు త్పాదింపవలయు నుపజా త్యాదుల మిశ్రములఁ దక్క నంబుధిశయనా! |
30 |
| ఆ. |
కుటిలకుంతలములు నిటలంబుపైఁ దూల నోట లేక ధేనువాటమునకు నదె యశోదపట్టి కదలెఁ బొమ్మనినఁ బ్రా సాది తేటపడుఁ బ్రమోద మొసఁగ. |
31 |
| ఆ. |
నందనుతుఁడు నాఁగ సౌందర్యనిధి యన నమరు బిందుపూర్వకము మొదలను బక్షిగమనుఁ డన నధోక్షజుఁ డన సంయు తాక్షరాది చెల్లు నసమగురువు. |
32 |
| ఆ. |
అర్ధబిందుసహిత మగువర్ణమునకుఁ బ్రా సాది యరయ నిడుదయక్కరంబు నేఁడు మనకుఁ గల్గినాఁడు లక్ష్మీనాథుఁ డేఁటి కింక నేఁడు మాట లనఁగ. |
33 |
| ఆ. |
కుఱుచమీఁదిసున్న మఱి తేల వ్రాయఁ బ్రా సద్వయాది నిట్లు జరగు నచ్యు తుఁడు సమస్తవల్లభుఁడు నాఁగ నయ్యచ్యు తుండు సకలవల్లభుండనంగ. |
34 |
| ద్వాదశవిధ ప్రాసములు | ||
| క. |
సమనామ ప్రాసము ప్రా సమైత్రి ఋత్రిలును ప్రాది సమలఘువు విక ల్పము బిందు వర్ధబింబ్వా ఖ్య ముభయ సంయుక్త సంధిగత సంజ్ఞికముల్. |
35 |
| సమ ప్రాసము | ||
| క. |
అరసున్నలు నెఱసున్నలు నొరసినవర్ణములు జడ్డయును దీర్ఘమును\న్ బెరసినచో సమవర్ణము లరసి నిలుపవలయుఁ దోయజాసనజనకా! |
36 |
| క. |
వరువడిఁ బ్రాసములు సమా క్షరసంశోభితములయినఁ, జాలును మఱి త త్స్వరవైసాదృశ్యంబులు పరిహరణీయంబు లందుఁ బంకజనాభా! |
37 |
| ఆ. |
వీఁడె కృష్ణుఁ డల్లవాఁడె ప్రలంబారి కొండ యెత్తె నితఁ డతండుద్రవ్వె నొడ్డగెడవుగాఁగ దొడ్డరా జేలెడి వీడుఁ నాఁగ బ్రాస మీడువచ్చు. |
38 |
| గీ. |
ఆయుపేంద్రుని బొడఁగాంచు టేయుపాయ మనెడు దీర్ఘాదు లచట హ్రస్వాదు లయిన నయ్యుపేంద్రుని బొడఁగాంచు టెయ్యుపాయ మన సమప్రాస మగు నూఁదఁజనదు రహల. |
39 |
| ప్రాస మైత్రి | ||
| గీ. |
లళలు రెండును నొండొంటఁగలసి వచ్చు నమరు నన్యోన్యమును ఋయుతాయుతములు బిందుపూర్వమై తమలోనఁ బొందు బమలు ప్రాసమైత్రికి నిది స్వరూపంబు దెలియ. |
40 |
| ఆ. |
నీలవర్ణు గర్భగోళంబు నందు లో కంబు లెల్ల నుండు నెమ్మితోడ శ్రీకినొడయఁ డుజ్జ్వలాకృతి యితఁ డన్నఁ బ్రాసమైత్రి యిట్లు పరంగుఁ గృష్ణ! |
41 |
| గీ. |
తగ ఋకారాన్వితంబు ద్విత్వంబు గాఁగఁ బరఁగు నచ్చపుజడ్డతోఁ బ్రాసమైత్రి యక్కృపానిధి హరిఁగని మ్రొక్కి రనఁగ సంభృతాశ్రితుఁ డతిశయోజ్జృంభుఁ డనఁగ. |
42 |
| ఋ ప్రాసము | ||
| క. |
అరయ స్వరగణ మయ్యు ఋ కారము ఋప్రాస మనఁగఁ గదియును రేఫ\న్ జేరి తనయురముఁ దన్నిన యాఋషిపాదంబుఁ బిసికె నచ్యుతుఁ డనఁగన్. |
43 |
| గీ. |
తెల్లమిగ ఋకారము యణాదేశవశత రేఫ యగుఁట బ్రాసంబయ్యె రేఫ కిట్టు లిదియె పరవర్ణయుత మయ్యెనేని ప్రాస మైత్రి యగుఁ గాని రేఫసంబంధి గాదు. |
44 |
| త్రి ప్రాసము | ||
| గీ. |
సంఖ్యఁ బలుకుత్రికారంబుఁ జనుఁ దకార సదృశమై త్రికారప్రాససంజ్ఞ గలిగి యాత్రివిక్రముఁ డభయప్రదాత యనఁగ వాక్త్రిపథగోజ్జ్వలులు విష్ణుభక్తులనఁగ. |
45 |
| గీ. |
ఈత్రి కారంబునకుఁ దీయ యెసఁగఁ గ్రింది రేఫ సంప్రసారణమున ఋత్వ మయి తృ తీయయగు నీత్రికార మర్దించి చూడ నాతకారంబునకుఁ బ్రాసమయ్యె నచట. |
46 |
| గీ. |
ఇ ఉ ఋ ఌ ల కచ్చు పరమగునేని య వ ర లాదేశ మగునట్టి య వ ర ల లకు నడరి ఇ ఉ ఋ ఌ లాదేశ మయ్యెనేని యది కృతుల సంప్రసారణ మండ్రు బుధులు. |
47 |
| ప్రాది ప్రాసము | ||
| గీ. |
ప్రాదియై యనశబ్దంబు ప్రాణ మగుటఁ బరఁగ నణలకు వేర్వేఱ ప్రాసమయ్యె క్షోణిధరుఁ డెత్తె నేనుఁగు ప్రాణ మనఁగ దానవారాతి వ్రేతలప్రాణ మనఁగ. |
48 |
| సమ లఘు ప్రాసము | ||
| గీ. |
ఓలి రేఫతోఁగూడియు నూఁదఁబడక తేలి తెలుఁగునఁ దమయట్టి వ్రాలతోన సమలఘుప్రాస మగు ఱెక్కలమరఁబట్టి విద్రిచె నసురఁ గృష్ణుఁడు దిక్కు లద్రువ ననఁగ. |
49 |
| వికల్ప ప్రాసము | ||
| గీ. |
సానునాసికలౌ వర్గహల్లులకుఁ దృ తీయములు వికల్ప ప్రాసమై యెలర్చు ప్రాఙ్నగంబుపై రవిదోచెఁ నగ్ని వోలెఁ బ్రాఙ్ముఖుండై నుతించె నీవాగ్మి యనఁగ. |
50 |
| బిందు ప్రాసము | ||
| గీ. |
వేర్చి పొల్లు నకారంబు బిందు వగుచు మీఁదనున్న ధకారంబు నూఁదఁ బ్రాస బంధమగుఁ గృష్ణుఁ డుదయించినం ధరిత్రి యంతయును నిరుపద్రవం బయ్యె ననఁగ. |
51 |
| అర్ధబిందు ప్రాసము | ||
| గీ. |
సార్ధబిందువు లై తేలినట్టి పటల కరయఁ బ్రాసంబు నిర్బిందు వైనఁ జెల్లు వీఁపు మూఁపులు మఱి తలమోపు లయ్యె మాట లేఁటికి మేటి తాఁబేఁటి కనఁగ. |
52 |
| ఉభయ ప్రాసము | ||
| క. |
చూడఁగ లకారరేఫలు గూడుడకారంబు చను నకుంఠిత గతిఁదో డ్తోడన నుభయప్రాసము జాడఁబడును సంయుత ప్రసంగతిఁ గృష్ణా! |
53 |
| ఆ. |
పాఁడి మరగి బ్రతుకువాం డ్రిల వ్రేఁతలు వాండ్ర వెన్న లేలఁ దండ్రి! యనఁటి పండు కొఱకు వింత యిండ్లకు బోకు కృ ష్ణుండ నీకు బ్రాతె పండ్లు నిచట. |
54 |
| గీ. |
రలయుతాయుత ప్రాస మార్గము దలంచి వాండ్ల లేఁ జూపు మోముఁల దీండ్లమారె ననుచు రెండును గూర్చిన ననువుఁదప్పు నండ్రు నిఖిలార్థవిదు లైన దండికవులు. |
55 |
| సంయుత ప్రాసము | ||
| ఆ. |
పాడు నూరు ప్రోలు బహువచనంబులై పరఁగుచుండు నూఁది పలుకు నపుడు తేల్చి పలుకునపుడు దీపించు సంయుత ప్రాస మిరుదెఱఁగుల బద్మనాభ! |
56 |
| ఆ. |
పాళ్ళు మనుజు లెక్క నూళ్ళు గాఁదొడఁగె న య్యూళ్ళు మిగుల బలసెఁ బ్రోళ్ళు గాఁగ భాగ్యవంతుఁ డేలుపాళులు నూళులు ప్రోళు లయ్యె బ్రాతె కూళులిచట. |
57 |
| ఆ. |
తెలుఁగునందు లేదు లలిఁ గ్రిందిసుడి గ్రుచ్చె గ్రుమ్మెనాఁగ రేఫకొమ్ము గాని ప్రాసమైత్రి చొరదు దా సంయుత ప్రాస మగును రేఫయుతము ననుసరించి. |
58 |
| క. |
ఈ క్రిందటి రేఫలుసమమై క్రాలు చుఁదేలి ప్రాసమగు సంయుక్తం బా క్రూర నక్ర భయమున, వాక్రువ్వ దె గజము భక్తవత్సలుననఁగన్. |
59 |
| క. |
ధ్రువముగ సంధిజనితరూ పవిశేషప్రాస మనఁగ బరఁగు పకారం బవిరళవకార మగు న య్య వదాఱవపా లెఱుంగ ననఁగ ముకుందా! |
60 |
| వ. | అది యెట్లనిన. | 61 |
| క. |
ప్రథమాంత విభక్తులపైఁ గథితములగు కచటతపలు గసడదవలగు\న్ బృథివి నివి గజడదబలగుఁ బ్రథమపు సున్న లగునాంత పదములమీఁదన్. |
62 |
| గీ. |
వాఁడు గనువాఁడు నేకొనువాఁడు డెక్కు లాఁడు వాఁడు దపోనిధి వాఁడు వెద్ద చిక్కెఁ గరి మ్రొక్కెఁజెలి వాక్కుఁడక్కు వెట్టె శౌరిఁ దలఁచేని\న్ బిలిచె నాసంధు లిట్లు. |
63 |
| ఆ. |
ఆయచేత సద్వితీయ దా నిజరూప మయ్యు నుండుఁ బ్రథమయట్టు లుండుఁ గ్రతువు గాచె దాశరథి కృష్ణుఁ డొకపర్వ తమును గొడుగు భంగిఁ దాల్చెననఁగ |
64 |
| గీ. |
అచ్చుమీఁదచ్చున యకార మాయజుండు కొమ్ము గలహల్లు ప్రథమైనఁ గ్రుంకు నచ్చు గురుఁడుపేంద్రుండు పెఱచోటఁ గ్రుంకు నొండెఁ జను నకారంబు జనులందు జనులయందు. |
65 |
| గీ. |
ఓలిఁ గర్మధారయ షష్ఠు లుత్వములుగ నచ్చు తుద నుండ టనుములౌ నాంధ్ర సంధిఁ గఱుకుటగచరు ల్గట్టి రక్కజపుటుదధి వితతయశుఁ డైన రాజునానతి ననంగ. |
66 |
| గీ. |
నుఱులురులు పొల్లు లౌను దెనుంగు నందు హేమ మిది పదాఱ్వన్నె నల్మోము లతఁడు ప్రబలి హరిఁ గొల్చియున్న వా ర్పరమ మునులు గోటిలో నొప్పు సతికిఁ గన్గొన లనంగ. |
67 |
| గీ. |
ద్విత్వమున కాదివర్ణములు తెనుఁగునందు నూఁదకుండును వలసిన నూఁదియుండు జానకీ వల్లభుఁడు క్షమాశాలి యనఁగ దశరథాత్మజుఁడు స్వామి ధాత్రి కనఁగ. |
68 |
| వ. | మఱియు శబ్దాలంకారవిశేషంబులు ప్రాసంబులు నెట్టి వనిన. | 69 |
| షడ్విధ ప్రాసములు | ||
| క. |
అమరఁ గడుదుష్కరము ద్వం ద్వము త్రి చతుష్ప్రాసములును దగ నంత్యప్రా సమును ననుప్రాసము ననఁ గ్రమమున షడ్విధము లయ్యెఁ గంసవిదారీ! |
70 |
| దుష్కరప్రాసము | ||
| క. |
దోఃకీలితమణి కటక యు రః కలిత రమాభి రామ రంజిత సుజనాం తః కరణ ఖండితారాశి రః కందుక యనఁగ దుష్కరప్రాసమగును. |
71 |
| ద్వంద్వప్రాసము | ||
| క. |
కంజనయన భవభీతివి భంజన శుకశౌనకాది బహుమునిచేతో రంజన ద్వంద్వప్రాస మ నంజను నిప్యాటఁ బల్కిన గృతు లందున్. |
72 |
| త్రిప్రాసము | ||
| క. |
తానవనీత ప్రియుఁ డన దానవనిర్మూల నైకతత్పరుఁ డన స న్మౌనివినుతుఁ డన నతసుర ధేనువనం గృతులయందు ద్రిప్రాసమగున్. |
73 |
| చతుష్ప్రాసము | ||
| క. |
వారణవరద నిశాటవి దారణ వీరావతార ధరణీవలయో ద్ధారణ విరచిత సత్యవ ధూరణవిజయ యనఁ దగి చతుష్ప్రాసమగున్. |
74 |
| అంత్యప్రాసము | ||
| క. |
అగణితవిభస్ఫూర్తీ నిగమాగమసతతవినుత నిర్మల మూర్తీ జగదభిరక్షణవర్తీ యగు నంత్యప్రాస మి ట్లుదంచితకీర్తీ! |
75 |
| క. |
మొదలిటిప్రాసమె కానీ యిది యంత్యప్రాస మనఁగ నేదటకానీ కదియింపవలయుఁ దానీ పదనెఱిఁగిన బుధుఁడు కృతులఁ బరమజ్ఞానీ! |
76 |
| అనుప్రాసము | ||
| క. |
విప్రప్రకరమునిప్రీ తిప్రద సుప్రభవ యప్రతిమదోఃప్రభవా విప్రణుత సుప్రసన్నయ నుప్రాసప్రణవ మిది మనుప్రియచరితా! |
77 |
| యతి ప్రకరణము | ||
| యతి సంజ్ఞలు | ||
| క. |
విరతులు విశ్రాంతులు మఱి విరామములు విశ్రమములు విశ్రామంబుల్ విరమంబులు యతు లనఁగా విరమణములు నాఁగ వళ్ళు వెలయు మురారీ! |
78 |
| యతి పంచకము | ||
| క. |
స్వరయతులు వర్గయతులును సరసయతు ల్ప్రకటమైన సంయుక్త యతుల్ పొరిఁ బ్రత్యేకయతులు ననఁ బరఁగును యతి పంచకంబు పంకజనాభా! |
79 |
| యతిపంచక భేదములు | ||
| క. |
స్వరయతులు ప్రాది కాకు స్వరనిత్యసమానయతులు వర్గయతులు ని ద్ధరఁ బోలికవడి సంయుత విరతి యనుస్వారయతులు వెలయు ముకుందా! |
80 |
| క. |
ప్రభునామాంతవిరతియన విభాగవిరమణము భిన్నశ్రమమును గౌ స్తుభధర! వికల్పయతి యన నభేదవిరమణ మనంగ నైదు తెఱంగుల్. |
81 |
| స్వరయతులు | ||
| ఆ. |
అగు నకారమునకు నైత్వౌత్వములు వడి ఈకి ఋత్వమునకు నేత్వ మమరు నుత్వమునకు నోత్వ మొనరు నీగతి స్వర యతులు విస్తరిల్లు నబ్జనాభ! |
82 |
| క. |
స్వరములు దీర్ఘము హ్రస్వము నరయఁగ నొక్కవిధ మెన్న యతులకు సంధ్య క్షరము లగునచ్చులందు సు చరితా! హ్రస్వములు లేవు సంస్కృతభాషన్. |
83 |
| క. |
అలఘుచతుస్సంధ్యక్షర ములలో నై యౌలు దక్క మొదలిటిరెంట\న్ దెలుఁగునను హ్రస్వదీర్ఘము లొలయును నెఏలనంగ నొఓ లనఁగన్. |
84 |
| క. |
క్రియ నై యౌలకు హ్రస్వ ద్వయము లమరు నాంధ్రభాషితప్రకరలో నయిదనఁ దగు నైదనుచో జయకీర్తీ! యవు ననంగఁ జను నౌ ననుచోన్. |
85 |
| గూఢస్వరయతి | ||
| గీ. |
స్వరముతుద నుండి లుప్తవిసర్గకోత్వ మైనస్వరవిరామంబు దాసోఽహ మనగ నచ్యుతాశ్రితు లుర్వి నన్యోన్యమిత్రు లనఁగ నమ్ముకుందుండు యశోఽర్థి యనఁగ. |
86 |
| ఋకారస్వరూపయతి | ||
| గీ. |
క్షిత ఋకారరూపస్వరయతులు పరఁగు ఋగ్యజుస్సామవినుతుండు కృష్ణుఁ డనఁగ వృష్ణికులజుండు కరుణాసమృద్ధుఁ డనఁగ హేమపీతాంబరుఁడు దేవవృషభుఁ డనఁగ. |
87 |
| రీ విరమము | ||
| క. |
విలన ద్రికారమునువ ట్రిల రీవిరమంబు శౌరి ఋషులకు శశ్వ త్సులభుఁ డనఁగ నీయేలకుఁ దలఁపఁగ రీతోడి విరతి తలకొన దెందున్. |
88 |
| గీ. |
తెల్లముగ ఋకారము యణాదేశశక్తిఁ గలుగు రేఫయిత్వమునందుఁ గదిసి యతికి నట్టిరీకి నీయేలతో నన్వయించు నట్టిసత్త్వంబులే దది హల్లుగాన. |
89 |
| ఌకారవిరతి | ||
| గీ. |
మును ఋకార మీ యేలతో నొనరినట్లు చేర దొకట యణాదేశకారణమున ఘనలకారంబ యగును ఌకారవిరతి కౢప్తి లేదు శౌరిగుణావళికి ననంగ. |
90 |
| క. |
స్వరములు కాదుల నొందిన నరుదుగ స్వరయతులు దగును బ్రాదులు గాకు స్వరమును నిత్యసమాసా క్షరసంధులు రెండు నగు భుజంగమ శయనా! |
91 |
| గీ. |
ప్రాదినిత్య సమాసశబ్దములు గాక పెరపదంబుల పైనచ్చు బెరసినప్పు డన్నియును స్వరయతులగు సాంబగురుఁడు శ్రీశుఁ డమరాన్వయాబ్ధి పూర్ణేందుఁ డనఁగ. |
92 |
| ప్రాదియతి | ||
| క. |
ధర నుపసర్గలు ప్రాన్వప దురపాభిప్రతిసువిన్యు దుపపర్యధిసమ్ నిరతిపరాజపులిరువది వరాజవులు చొరవు తెలుగు బాసను నెందున్. |
93 |
|
ప్రాంతనిరంతరాన్విత దురంతసమస్తపరాక్రమంబున త్యంతమదాప్తిశోభన మపాయ ముపాయము వీక్షణంబు ప్ర త్యంత మభీష్టమధ్యయము స్వాంతము నీత ముదంచితంబుప ర్యంతమనంగ సంధిలుఁ దిరంబుగ రెంటను బ్రాదులచ్యుతా! |
94 | |
| కాకు స్వరయతి | ||
| క. |
కాకుస్వరయతి యగు నితఁ డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ బ్ర శ్నా కలితదీర్ఘ మగు నితఁ డే కవ్వడి రథముఁ గడపె నిమ్ముల ననఁగన్. |
95 |
| ఆ. |
వలదు కృష్ణ యెఱుఁగవా మున్ను నన్ను నీ వా విరుద్ధభాష లాడ నేల లోన నెట్టియలుకలో నాఁగఁ గాకుస్వ రోక్తి రెంటఁ జెల్లు నొగి ధరిత్రి. |
96 |
| గీ. |
వరుసదీర్ఘాంతసంబుద్ధి వచనయతుల కమరుఁ గాకుస్వరంబు పరమసహస్ర నామశోభిత గోపకృష్ణాయనంగ నమరవందిత గోపకృష్ణా యనంగ |
97 |
| నిత్యసమాసయతి | ||
| గీ. |
పదము విభజించి చెప్పఁ జొప్పడని యవియు నన్యశబ్దంబుఁగొని విగ్రహంబుఁ జెప్పు నవియు నిత్యసమాసమై యతిశయిల్లు నట్టిసంధుల నచ్చు హల్లైన విరతి. |
98 |
| ఆ. |
నాస్తియనక మహి ననంతసంపదలు నా రాయణుం డొసంగు రమ్యమగుర సాయనంబు బుధుల కతఁ డన్న నిత్యస మాసయతుల రెంట నంటియుండు. |
99 |
| వ. | ఈ నిత్యసమాసయతి పేరఖండయతి. | 100 |
| గీ. |
అఱయనంగను బోవుట కర్థమైన సంధి నిత్యసమాసోక్తి జరగు రెంట నసురవీరుల నెల్ల నుక్కఱ వధించె భానుకులుఁడు రావణుని నేపఱిచె ననఁగ. |
101 |
| వ. | అట్లు మఱియును. | 102 |
| నిత్యయతి | ||
| ఆ. |
ఏని యనుపదంబుతో నాదిపద మంది సంధి నిత్యయతుల జరగుచుండు నెట్టి క్రూరకర్ముఁడేని సద్గతి నొందు నిన్ను నాత్మఁ దలఁచె నేని కృష్ణ! |
103 |
| ఆ. |
కదియు వడులు స్వరము కైవడిఁ గాదులు ఋత్వమునకు నెత్వమెనయు చోటఁ గృష్ణుఁ డాజిఁ గంసు గెడపె నండ్రార్యులు కూర్మరూప విమలకోమలాంగ! |
104 |
| వర్గయతి | ||
| క. |
తలకొని కచటతపంబులు తలనొక్కొకవ్రాయి తొలఁగఁ దమతమ నాల్గు\న్ విలసిల్లు వర్గయతు లనఁ గలికల్మషతిమిరతపన ఘననిభవర్ణా! |
105 |
| పోలికవడి | ||
| క. |
వెలసిన పు ఫు బు భు వర్ణం బులు పోలికవడి ముకారముగ నిడఁ దగు ని మ్ముల హరిచరణసరోరుహ ములు నాహృత్సరసియందుఁ బొదలు ననంగన్. |
106 |
| సరసయతి | ||
| ఆ. |
ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి నయహ లమరియుండు హస్తివరద శషస లొందు నండ్రు చఛజఝంబులతోడ సరసయతు లనంగ జలధిశయన! |
107 |
| సంయుక్తయతులు | ||
| క. |
ఏ నిను వేఁడెద లక్ష్మీ క్ష్మానాయక నీవు నన్నుఁ గైకొని యిష్టం బైనవి యొసఁగుము శుభల క్ష్మా! నీవాఁడ నన నొప్పు సంయుక్తయతుల్. |
108 |
| క. |
ఒక్కడుగున విశ్రాంతులు పెక్కగుచో సంయుతములు పెనుపకమును జ డ్డక్కరమునఁ దానెత్తిన యక్కరమే యునపవలయు నన్నిటఁ గృష్ణా! |
109 |
| క. |
వడినెలవులలోఁ జేరువ యెడ నొకసంయుతము నౌలయెడ నొకటినిఁ దా రిడిరేని కవులు తప్పుట యొడఁబడదు పృథగ్యతిప్రయోగముల హరీ! |
110 |
| ద్విరదగతి రగడ. |
క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి మహిమ దలపోయ నక్కజ మనుచు నిట్లనక క్ష్మావలయ మంతయు విషాణమున నెత్తుకిటి సత్త్వ మరు దన నొప్పు సంయుక్తయతి చెడక. |
111 |
| రగడ. |
ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపుని వక్షము నృసింహుఁ డని రాయువడి సొరదు కృతి ఱంపమున వ్రచ్చుగతి వ్రచ్చె నఖముల రిపును రంబు నరసింహుఁ డనఁ గ్రాలు సంయుక్తయతి. |
112 |
| తద్భవవ్యాజయతి | ||
| గీ. |
అప్రసిద్ధముల్ ఙఞలు శబ్దాదియందు ఞాజసంయుక్తి తద్భవవ్యాజమునను నణలతోఁ బొందు విరతి యాజ్ఞప్తి యనఁగ జలరుహోదరాశ్రితులు సుజ్ఞాను లనఁగ. |
113 |
| ఆ. |
యజ్ఞమునకు జన్న మాజ్ఞప్తి కానతి యాజ్ఞ కాన సంజ్ఞ కరయ సన్న విన్నపంబు వెండి విజ్ఞాపనమునకు జ్ఞాకుఁ దద్భవంబు నా ధరిత్రి. |
114 |
| రేఫయతి | ||
| గీ. |
ఆంధ్రలిపిఁ జొప్పడదు ఋకారాన్వితంబు క్రొత్తగాదు కృష్ణుని వెన్న మ్రుచ్చి మనఁగ స్రుక్కఁ డతఁ డాజి నెట్టి విరోధి నైనఁ గ్రుమ్ము నన రేఫయుతయతి గూడుఁ గాన. |
115 |
| అనుస్వారయతి | ||
| గీ. |
భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ! నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక! మాకు నిటనాల్గు చెల్లు సంపదలరాజ! |
116 |
| మకారయతి | ||
| గీ. |
యరలవలు శషసహలు నాదిబిందు యుతములై మకారవిరామయుక్తిఁ దనరు మారుతాత్మజుఁ డరిదిసంయమి యనంగ మదనజనకుఁడు దనుజసంహరుఁ డనంగ. |
117 |
| ఎక్కటియతి | ||
| క. |
ధర నెక్కటివళ్లైతగు ళరమఱవలు వానిలోఁ (జెలంగును) లాకు\న్ సరి ళా యన విశ్రమవే ళ రమాధిప రెండునుం గలసి వర్తించున్. |
118 |
| ఆ. |
మరునితండ్రి లోకమహితుండు యాదవ రాజసింహ మూర్తి రక్షకుండు ఱాఁగ వేలుపనఁగ ఱంపిల్లు నెక్కటి వళ్ళు నాఁగ నిట్లు వనజనాభ! |
119 |
| ప్రత్యేకయతులు | ||
| ప్రభునామాంతయతి | ||
| గీ. |
ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక ద్వివిధ మగుఁ బ్రభునామాంతరవిరమణంబు మహి నయోధ్యకు రాజు రామన యనంగ నతనిపట్టపుదేవి సీతమ యనంగ. |
120 |
| విభాగయతి | ||
| గీ. |
సంఖ్యకుం బరిమాణసంజ్ఞకుఁ దనర్చు శబ్దములపై విభాగోక్తి సరణి సంఘ టించినప్పుడు యతులు రెండేసియగు ను పేంద్రుఁ డిచ్చునర్థము మోపెఁడేసి యనఁగ. |
121 |
| భిన్నయతి | ||
| క. |
అంచితతిలకము శౌరి ధ రించె ననఁగ జగణమధ్య రేఫవిరతి యౌ నంచితతిలకము హరి ధరి యించె ననఁగ భిన్న విరతి నిత్వమువచ్చెన్. |
122 |
| గీ. |
అట ఇకారాంతపదముమీఁదటి దికార మది యనంగ నవ్వల భిన్న యతికిఁ జెల్లు దివిజవిభవంబు శౌరిచేతిది యనంగ నసురనాశంబు హరిచేతియది యనంగ. |
123 |
| వికల్పయతి | ||
| గీ. |
హయుతమై పొల్లుల వికల్పయతులు చెల్లు దేవకీనందనుఁడు జగద్ధితుఁ డనంగ హలధరుఁడు సంగరాంగణోద్ధతుఁ డనంగ నవని మోచినయవి కకుబ్భన్తులనఁగ. |
124 |
| యుక్తవికల్పయతి | ||
| గీ. |
నలిఁ గకారహ ల్లితరానునాసికాఖ్యఁ గదిసి తత్పంచమముగా వికల్పవిరతిఁ గలుగుఁ జక్రి వల్లవసుదృజ్మధుఁ డనంగఁ గమలనేత్రుండు సకలదిఙ్మహితుఁ డనఁగ. |
125 |
| అభేదయతి | ||
| క. |
ప్రకట పకార వకార ద్వికమునకుం జను నభేదవిరతి నిశాట ప్రకర మెరిసె రామునిపా వకశరమున జనకసుత నెపంబున ననఁగన్. |
126 |
| గీ. |
చెల్లుబడివళ్ళు ప్రాసము ల్చెప్పఁబడియె నిందుఁ బూర్వప్రయోగంబు లెఱిఁగి యెవ్వి బహుళమై తోఁచెనవి యొనర్పంగవలయు నవ్యకావ్యప్రియోక్తుల నలిననాభ! |
127 |
| క. |
వరగణవర్ణము దీర్ఘ స్వరమగుచో గణయుగంబు చను యతుల సుధా కరకరగుణగతి శరరుచి గిరిగజరుద్రాదిసంజ్ఞ కేశవనాథా! |
128 |
| క. |
ఎన్నిట యతి రావలె నని రన్నిట సంస్కృతమునందు నగు విచ్ఛేదం బెన్నిట యతిరావలె నని రన్నిటఁ దెలుఁగునకు మొదలియక్షర మమరున్. |
129 |
| గద్యము. |
ఇది శ్రీవాణీప్రసాద లబ్ధవాగ్విభవ తిక్కనామాత్య తనూభవ సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతంబైన ఛందోదర్పణమునందు గద్యపద్యాది కావ్యలక్షణంబును గురులఘునిర్ణయంబును గణనిరూపణంబును బ్రాసయతి విశేషంబులును బరిగణనసంజ్ఞయు నన్నది ప్రథమాశ్వాసము. |
|