| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 29. లక్ష్మీ - విష్ణు సంవాదం |
|
కలికి కవాటము బంధన చేసిన కారణమేమే లక్ష్మీ - నీకు కారణమేమే లక్ష్మీ. కారణ మేమని అడిగెవు నీమది తెలియలేద ధవలాక్షా - మరి తెలియలేద ధవళాక్షా. తెలిసీ తెలియక చెంతను చేరితి పంతమేలనే లక్ష్మీ - నీకు పంతమేలనే లక్ష్మీ. కొంచపు జాతని చెంచిత సవతని చింతదీరెనో సామీ - నాకు చింతదీరెనో సామీ. జిలుగుపు టేదల చీరలు తెస్తిని చెంత చేరవే లక్ష్మీ - నా చెంత చేరవే లక్ష్మీ. జిలుగుపు టేదల చీరలు తెస్తే చెంచీత చేరును పోవోయ్ - నీవు చెంచీత చేరును పోవోయ్. చేపట్టు చేల్వ బంగారు రవికలు తెస్తినే జాగుచేయకే ధవలాక్షీ - ననూ చేరనీయవే కమలాక్షీ. జాల్వరు బంగారు రవికలు చెంచీత కిచ్చిన ఏలును స్వామీ - నీ విచ్చిన ఏలును స్వామీ. ఇప్పపు బంతులు ఇంపుగ దెస్తిని ఇంపుగ యేలవె లక్ష్మీ - నను ఇంపుగ యేలవె లక్ష్మీ. ఇప్పపు బంతులు ఇంతి చెంచితకి ఇస్తే యేలును స్వామీ - నిను ఇస్తే యేలును స్వామీ. మల్లెపు బంతులు మగువరొ తెస్తిని మన్నించేలవే లక్ష్మీ - నన్ మన్నించేలవే లక్ష్మీ. మల్లెపు బంతులు మగువ చెంచీతకిస్తే మన్నించేలును స్వామీ - నిను మన్నించేలును స్వామీ. రవ్వలు చెక్కిన రాగిడి తెస్తిని రానియ్యవె ఓలక్ష్మీ - నను రానియ్యవె ఓలక్ష్మీ. రవ్వలు చెక్కిన రాగిడి తెస్తే చెంచీత కివ్వగదోయీ - నీవు చెంచీత కివ్వగదోయీ. గరిమిష్టమ్మున గండభేరుండంబులు గాసి పొందితినే భామా - మేను గాసి పొందితినే భామా. గండభేరుండంబులు గాసి బొందితే చెంచిత యేలునుస్వామీ - నిను చెంచిత యేలునుస్వామీ. శరణే శ్రీహరి శరణే లక్ష్మీ శరణంటిని గైకొనవే -లక్ష్మీ శరణంటిని గైకొనవే. కొత్త పెళ్ళికొడుకై నీవూ వర్థిల్లుము వసుదేవా - స్వామీ వర్థిల్లుము - స్వామీ. పద్మగంధి నీ పాదములాకూ వందనములు పదివేలే - లక్ష్మీ వందనములు పదివేలే. నవ్వుతు శ్రీ లక్ష్మి వాకిలి తీసెను గడియతీసె వరలక్ష్మీ అపుడే గడియతీసె వరలక్ష్మీ. మదనజనక తన మగువని తోడుకొ మందిరముల కేతెంచెన్ - లక్ష్మి మందిరముల కేతెంచెన్. |