| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
027. జాజారమ్మ తోట
| లయబద్ధములైన పదములకు లయబద్ధమైన పాటలతో మైత్రి చక్కగా కుదురును. ఈ పాట "కిటతక కిటతక" అన్న ఎనిమిది అక్షరాల ఆవృతాలు నాలుగేసి చేరి ఏర్పడిన పాదాలది. మొక్కలను గానీ, నీటి కుండలను గానీ, వరుసగా నిల్చి ఒకరి నుంచి ఇంకొకరికి అందించుకునే జట్లు ఈ పాట పాడుతారు. మొదటి ఆవృతము కుండనందుకోటానికీ తరువాతది కుండను పక్కవారికి అందించటానికీ ఊత అవుతుంది. |
|
నాటేరమ్మా నాటేరూ, ఏమి మొక్క నాటేరు జాజారమ్మా పూలతోటలో, జాజీమొక్క నాటేరు సాగేనమ్మా సాగేను, ఏమి తీగ సాగేను జాజారమ్మా పూలతోటలో, సన్నాజాజీ సాగేను యేసేనమ్మా యేసేను, యేమిసిగురు యేసేను జాజారమ్మా తోటలోను, చేమంతులు సిగురేసేను తొడిగేనమ్మా తొడిగేను, ఏమి మొగ్గలు తొడిగేను జాజారమ్మా తోటలోను, రోజా మొగ్గలు తొడిగేను విచ్చేనమ్మా విచ్చేను, ఏమి పూలు విచ్చేను జాజారమ్మా పూలతోటలో, సంపెంగలూ విచ్చేను ॥ |
| పూలతోట పనిలోనే కాదు, ఇటికెలు అందించుకుంటు గుట్ట వేసేటప్పుడు కూడా ఈ పాట పాడడము కద్దు. |