| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
106. నాగుమయ్య
| ఇది నాగపూజను గురించిన పాట. తొలి యుగాలలో భయంకర వస్తువులన్నీ - రుద్రునివలె - దేవతాంశము కలవిగానే పరిగణించినాడు ఆదిమమానవుడు. నాటి నుండి నేటికి దిగివచ్చిన నమ్మకమున కుదాహరణ మీ పాట. |
|
ఉసిరిగ చెట్టు కింద పసరిగ పాము కూసమూడ్చీ పాము పడగ బుస్సంది పాము నన్నూ చూచీ పడగనెత్తింది పడగ లెత్తకు పాము పగవారము కామూ పడగెత్తి దూసింది నాలుకలు రెండూ నాలుకలు దూయకే నీవారము నాగూ మంచి నాగూవైతె పంచెలెట్టేము కోడె నాగూవైతె కోకలెట్టేము పడగ లెత్తకు నాగు పగవారము కామూ మాచేను పండితే చలిమిడేసేము మా నువ్వులు పండితే చిమ్మిలేసేము నాలుకలు దుయ్యకే నీవారము నాగూ మాపత్తి పగిలితే పంచెలెట్టేము మా యావులీనితే పాలు పోసేము పడగ లెత్తకు నాగు పగవారము కామూ నీపూజ చేసేము నీకు మొక్కేము |