| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
120. సిరిసిరి మువ్వ
| రంగము పోవటము, సొమ్ము చేరటము, రంగసాని చెలిమి చేయటము, సొమ్ము చేయి జారటమూ అయినవి. సముద్రాల కటువైపున ఉన్న చిన్నది గుర్తుకు వచ్చినది. |
|
జోడుకొయ్యల వాడ మీద - సిరిసిరి మువ్వ జోడగ్గిపెట్టె లంపినానె - సిరిసిరి మువ్వ॥ అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ నాకు తిరుగుజాబు లంపలేదె - సిరిసిరి మువ్వ॥ మూడుకొయ్యల వాడ మీద - సిరిసిరి మువ్వ నీకు ముక్కుపుడక లంపినానే - సిరిసిరి మువ్వ॥ అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ నాకు తిరుగుజాబు లంపలేదు - సిరిసిరి మువ్వ॥ నాలుగు కొయ్యలవాడ మీద - సిరిసిరి మువ్వ నీకు నానుకోడు లంపినానె - సిరిసిరి మువ్వ॥ అది అందిందొ లేదోనె - సిరిసిరి మువ్వ నాకు తిరుగుజాబు రాలేదు - సిరిసిరి మువ్వ॥ అర్ధరూపాయి డబ్బులకు - సిరిసిరి మువ్వ నువ్వాశ పడా బోకంది - సిరిసిరి మువ్వ॥ ఆసుపత్రి పాలైతే - సిరిసిరి మువ్వ నిన్నాదుకొనే వారు లేరంది - సిరిసిరి మువ్వ॥ కసరి కసరి కొడితేను - సిరిసిరి మువ్వ నే సరస మనుకున్నానే - సిరిసిరి మువ్వ॥ కంటికి కాటుక బెడితే - సిరిసిరి మువ్వ నేను కన్నె అనుకున్నానే - సిరిసిరి మువ్వ॥ పైట పావడా గడితే - సిరిసిరి మువ్వ నే పడుచు అనుకున్నానే - సిరిసిరి మువ్వ॥ పౌడరేసు కుంటేను - సిరిసిరి మువ్వ నేను బాలికనుకున్నానే - సిరిసిరి మువ్వ॥ తళుకు జూపిస్తేను - సిరిసిరి మువ్వ నా వలపులనుకున్నానే - సిరిసిరి మువ్వ॥ నీమీద వలపంటే - సిరిసిరి మువ్వ కామాలు ననుకున్నానే - సిరిసిరి మువ్వ॥ సంకురాత్రి పండుగ నాడు - సిరిసిరి మువ్వ నేను సారానీళ్ళు త్రాగబోతే - సిరిసిరి మువ్వ॥ ఒంటిగా నుంటేను - సిరిసిరి మువ్వ నా కొక్క చుక్క దిగలేదు - సిరిసిరి మువ్వ॥ కష్టపడ్డ డబ్బంత - సిరిసిరి మువ్వ ముండ కాటిమీద బెట్టినానె - సిరిసిరి మువ్వ॥ ముద్దుగుమ్మ నేడిపించి - సిరిసిరి మువ్వ పాడు ముండలకు బెట్టినానె - సిరిసిరి మువ్వ॥ సముద్రాలు దాటిపోతే - సిరిసిరి మువ్వ పైసాయైన లేకపోయె - సిరిసిరి మువ్వ॥ బుద్ధిలేక రంగమెళ్ళి - సిరిసిరి మువ్వ యీ రద్ది పాలు బడ్డానే - సిరిసిరి మువ్వ॥ |