| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
139. సిన్నోడు - సిన్నది
| వస్తువు కొంచెము భేదమైనప్పటికిన్నీ ఈ సంవాదము కూడా చిత్రముగానే నడుస్తున్నది. |
|
కొండలో వుండే సిన్నోడా నీకు కూరేడ కద్దురో సిన్నోడా? కుమ్మరోనింటిలో కుండమ్మా కుండగిండమ్మ నాకంత కూరమ్మా కూడు గలిగీన సిన్నోడా నీకు పప్పేడ కద్దురో సిన్నోడా? అప్పడాలమ్మే కుప్పమ్మా కొప్పు తిప్పితే నాకంత పప్పమ్మా పప్పులు గలిగిన సిన్నోడా నీకు చారేడ కద్దురా సిన్నోడా? సీమతో పోయే యేరన్నా ఏరు పెరికితే నాకంత చారన్నా చారు గలిగినా చిన్నోడా నీకు నెయ్యేడ కద్దురో సిన్నోడా? కుక్కను కొట్టే కొయ్యమ్మా కొయ్యగియ్యమ్మ నాకంత నెయ్యమ్మా నెయ్యి గల్గినా సిన్నోడా నీకు పెరుగేడ కద్దురో సిన్నోడా? ఆ యింటి యీ యింటి పెరుగమ్మా పెరుగు గిరుగమ్మ నాకంత పెరుగమ్మా పెరుగు గల్గినా సిన్నోడా నీకు పాలేడ కద్దురో సిన్నోడా? ఆవులా మేపే బాలన్నా బాల గీలన్న నాకంత పాలన్నా పాలు గలిగినా సిన్నోడా నీకు వక్కేడ కద్దురా సిన్నోడా? అడవిలో పొయ్యే నక్కన్నా నక్కగిక్కన్న నాకంత వక్కన్నా వక్క గలిగినా సిన్నోడా నీకు ఆకేడ కద్దురా సిన్నోడా? ఆకసాన పొయ్యే కాకమ్మా కాకినేకమ్మ నాకంత ఆకమ్మా ఆకు గల్గినా సిన్నోడా నీకు సున్నమేడ కద్దురా సిన్నోడా? ఆ యింటి యీ యింటి సూరమ్మా సూరగీరమ్మ నాకంత సున్నమ్మా సున్నమూ గల్గినా సిన్నోడా నీకు పొవ్వాకు ఏదిరా సిన్నోడా? సెట్టుమీదా వుండె పిట్టన్నా పిట్టగిట్టన్న నాకంత మట్టన్నా |