| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (దంపుళ్ళపాటలు - దంపు పదాలు అనుపేర ఒకటా, రెండా లక్షలకొలది ప్రచారంలో వున్నాయి - ఈ దంపులలో వెటకారం వినిపిస్తుంది - శృంగారం పలకరిస్తుంది, ఆచారాలు ప్రత్యక్షమౌతాయి, అలసటలు తీరతాయి - నాటి ఎన్నో పాతవిషయాలు మనకు మరీవింతగా చెవులు మెలిపెట్టి వినిపించడం మరీ వింత. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి పాటలుగా ప్రచారంలో వినిపించినా - దంపుకు తాళం మాత్రం, మాత్రల నియమం మాత్రం మారదు - పోతే దంపు, విసురు లాటి పదాలు ఒకేలా వినిపిస్తాయి - చదవడానికి మరీను - కాని - తేడా వుంది) |
| 039. దంపుళ్ళ పాట |
|
దంపు దంపనగానె - దంపెంతసేపు ధాన్య రాసులమీద చేయివేసి నట్లు వంట వంటనగానె - వంటెంతసేపు వదినె మరదళ్ళు - వాదించినట్లు అత్త పోసినగంజి - సత్తూవలేదు అల్లూడు సిరిపురపు - గట్టెక్కలేడు. కొయ్యతోటకూర - కొయ్యకా చెడెను కొండంత కాపురం - కొండేల చెడెను కొడుకుల కననివాళ్ళ - కడుపేమి కడుపు కులముద్ధరించని - కొడుకేమి కొడుకు చిచ్చమ్మ చినగాలి - పెట్టు పెద గాలి అయోధ్య వీధుల్లో - అణగనే గాలి పిడికెడు విత్తనాలు - మడికెల్ల జాలు ఒక్కడే కొడుకైన - వంశాన జాలు. కొత్తచింతాపండు - గోనెల్ల చివుకు గొడ్రాలి వస్త్రాలు - పెట్టెల్ల చివుకు దేవదారూ చెక్క - చెట్టున్న చివుకు దేవుడి వస్త్రాలు - గుళ్ళోన చివుకు రావి చెట్టూ చెక్క - రంపాన చివుకు రంభ చక్కాదనము - దుఃఖాన చివుకు నాచేతి రోకళ్ళు - నల్లరోకళ్ళు నేపాడిని అన్నల్లు - రామలక్ష్మణులు రామలక్ష్మణులార - రక్షపతులార మీరెక్కిన గుఱ్ఱాలు - నీలమేఘాలు మీచేతి కత్తులూ - చంద్రాయుధాలు సువ్వి సువ్వన్న - సొగసు మల్లన్న దమ్మిడీ కాసన్న - ధగధగ మెఱుపన్న మెఱుపున వలపన్న - వఱపున సలుపన్న బీరపాదుకీ - పిందెలందమ్ము మావారి ముక్కుకీ - పొక్కు లందమ్ము కాకర పాదుకీ - కాయలందమ్ము బిడ్డ లున్న వారికీ - ముద్దులందమ్ము పొట్ల పాదుకీ - పువ్వులందమ్ము కాట్లకుక్క మగడు - కాంత కందమ్ము తోట కూరకంబమూ - దొడ్డికందమ్ము మావారి శిగజుట్టూ - నాకు అందమ్ము మాట్లాడ నేర్పుటే - మగువ కందమ్ము వగలాడి మగువకు - ముసలివా డందమ్ము పుట్టింటి యునికియే - పొలతి కందమ్ము అత్త మామలు చస్తే - అతివ కందమ్ము కాటుక యుంటేనె - కనుల కందమ్ము వెనుక దిక్కు లేకుంటే - వెలది కందమ్ము దొంగ దూడకు గుది - కఱ్ఱ యందమ్ము దొంగ మగనికి పెంకి - పెండ్లా మందమ్ము |