| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (తమ పిల్లలని నిద్రబుచ్చుతూ - అదే సమయంలో - పాపమీదవుండే గారాబాలను - అందచందాలనూ - తలుచుకుని దిష్టితగిలిందనీ, ఏడుస్తూంటే దడుసుకున్నాడనీ అనుకోవడం అలవాటు - అలాగే ఈ నిదురపాటలోనూ) |
| 076. జోల పాట |
|
హాయి హాయనగాను ఆపతలు గడచు చిన్నవారలగాచు శ్రీ వెంకటేశ రావే రావే పిట్టా రత్నాల పిట్టా కర్రదేవే పిట్టా కనకడిని కొట్టా వాసాల మీదదీ మీసాల పిల్లీ అబ్బాయి చేతిదీ హంసల్ల గిలకా జోల పాపడికి జోడుంగరాలు చిన్న నా బిడ్డకు పమిడుంగరాలు చిన్నారి పొన్నారి చిరుతడవు నీవు పొన్న మానూ మీది చిన్న కృష్ణుడవు ఆడితే ముద్దమ్మ పాడితే ముద్దు అందరికి అబ్బాయి అల్లారు ముద్దు ఏకుల రాట్నము ఇంటి కందమ్ము మా చిన్ని అబ్బాయి మాకు అందమ్ము ఉసిరికాయల తోట ఊరి కందమ్ము ఉత్తముడు అబ్బాయి మాకు అందమ్ము చిన్నారి పొన్నారి చిలుకవే నీవు గున్నమామిడి మీద చిన్న కోకిలవే జోలల్లు పాడితే బాలలకు నిద్ర నాగస్వరం వింటే నాగులకు నిద్ర జోలలకు జొన్నకూడు బాలలకు వరికూడు ఏడ్చేటి అబ్బాయికి ఎల్లావుల పాలు ఆ యింటి సందులో యీ ఇంటి సందులో అల చందపూవలే మెరసే నబ్బాయి ఏడువకు ఏడువకు వెర్రి అబ్బాయి ఏడిస్తే నీకండ్లు నీలాలు కారు నీలాలు కారితే నే నోర్వలేను పాలైన కారవే బంగారు కనుల ఊరెల్ల తిరిగేటి ఓ ఊరుబిల్లా ఊరుకున్న అబ్బాయికి ఉగ్గెట్టి పోవే పాడెల్ల తిరిగేటి ఓ పల్లగాడిదే పండుకున్న పాపనికి పాలిచ్చి పోవే రాకాసి రావణుని తాను అబ్బాయి రాజును కొట్టేసి తా రాజ్య మేలు |