ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
అత్ర్యాశ్రమ గమనము
1శ్రీచిత్రకూటమౌ చిత్రకూటాద్రి
వాచంయమశ్రేణి వర్ణింప నుండి
యంత రాముఁడు భరతాగమనంబు
చింతించి ‘యిచట వసింపరా’దనియు,
‘నిచ్చట నే నున్న నెల్లపౌరులును
ముచ్చటపడి దినంబును వత్తు’రనియు,
‘దంతిరథాశ్వపదాతి వర్గముల
నెంతయుఁగాసిల్లు నీ వనం’బనియు,
‘ఖరదూషణాదిరాక్షసకోటిబాధ
పరిహరింపు’మటంచుఁబరమసంయములు
చెంతలఁజేరి సూచించినా రనియుఁ
జింతించి మఱునాఁడు చిత్రకూటాద్రి
మునుల వీడ్కొని యత్రిమునియాశ్రమమున
కనురాగమున నేఁగ నమ్మహామౌని
తన శిష్యులును దానుఁదగ నెదుర్వచ్చి
కొనిపోయి పలుదెఱంగులఁబూజసేసె.
నమ్మునిపత్నియు ననసూయ ప్రీతి
నమ్మహీతనయకు నాతిథ్య మొసగి
తెఱఁగొప్పఁగొన్ని పతివ్రతాగుణము
లెఱిఁగించి, రఘురాము నెడఁబాయలేక
తన బంధుజనులనందఱ నెఁడబాసి
వనముల కా సీత వచ్చుట పొగడి
పిమ్మట ననసూయ ప్రీతిదానముగ
నమ్మహీతనయకు నంగరాగములు
వాడని విరుల చెల్వపుదండతోడఁ
గూడ మాయనిమడుంగులను దా నొసగి:
“రమణి! నిన్ను స్వయంవరమున రాఘవుఁడు
క్రమమొప్పఁగైకొన్న కథదెల్పు.”మనిన,
జిలిబిలిసిగ్గును జిఱునవ్వుఁదొలఁకఁ
బలికె జానకి దన పతిని వీక్షించి:
“వినవమ్మ! మిథిలకు విభుఁడైన యట్టి
జనకుఁడొక్కెడ యాగశాల దున్నింపఁ
గలిగితి నే; నది గారణంబునను
కలిత సీతానామకమున నొప్పితిని;
అనపత్యుఁడౌట నయ్యవనిపాలకుఁడు
దనయఁగా నన్ను మోదంబునఁబెనిచె.
నంత యౌవనవతినగు నన్నుఁజూచి
చింతించి:“తన యింటి శివునిచాపంబు
నెక్కువెట్టినవాని కెలమి పెంపొంద
నిక్కన్యకామణి నిత్తునే.”ననుచు
వరబుద్ధిమై స్వయంవరము సాటింప
ధరణినాయకులు మొత్తంబులై వచ్చి
శైలజరమణుని చాపమెత్తంగఁ
జాలక, మోపెట్టఁ జాలక చనిరి.
అంతరాఘవుఁడు విశ్వామిత్రుఁగొలిచి
కొంత గాలంబునకును నటవచ్చి
కరి యిక్షుకాండంబు ఖండించునట్లు
హరువిల్లు విఱిచి చయ్యన నన్‌ వరించె.”
నని తన పెండ్లివృత్తాంతమంతయును
వినిపింప ననసూయ విని ముదమందె.
నప్పుడు రవి పశ్చిమాంబుధి మునుఁగఁ
దప్పక సాంధ్యకృత్యములెల్లఁ దీర్చి
శ్రీరాముఁడత్రి పూజింప సద్గోష్ఠి
నా రాత్రి 2గడపి కాల్యక్రియల్‌ దీర్చి
ముదమొప్ప నయ్యత్రిముని వీడుకొల్పఁ
గదలి యమ్మఱునాఁడు కాకుత్స్థకులుఁడు[వా.రా. సర్గ 1]

  1. అత్రి వృత్తాంతము మూలమునను, భాస్కరరామాయణమునను అయోధ్యాకాండాంతమున ఁగలదు
  2. గడపియు నమ్మఱునాఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )