ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
అగస్త్య వృత్తాంతము
52నిందు నగస్త్యమునీశ్వరుఁడుండు
నందు;53రెందొక్కొ తదాశ్రమభూమి
తెలుపవే.”యనిన సుతీక్ష్ణుండు గుఱుతు
లలవడఁ దన్మార్గమంతయుఁ దెలిపి
దీవించి యనుప గాదిలితమ్ముతోడ
దేవితో దక్షిణదిక్కుకై నడచి
చనిచని నాల్గుయోజనములు గడచి
వనములు శైలముల్‌ వాహినుల్‌ పెక్కు
గనుఁగొంచు నేఁగి యగస్త్యానుజన్ము
ననఘాశ్రమంబున కరిగి సంప్రీతి
నా యతీశ్వరచంద్రు నడుగుల కెఱఁగి
యా యాశ్రమంబున నా రాత్రి నిలిచి
మునితోడ సుఖగోష్ఠి మొగిఁ54జేయుచుండి
యినకులాధీశ్వరుం డిట్లని పలికె.
“నయ్య! యగస్త్యమహాముని తొల్లి
యియ్యెడ వాతాపి నెబ్భంగిఁజంపె?”
ననిన నమ్మునిచంద్రుఁడారామచంద్రుఁ
గనుఁగొని యా పుణ్యకథసెప్పఁదొడఁగె.
“నురు55తాపి వాతాపియును నిల్వలుండు
ధరణిపై నిర్వురుద్దండ రాక్షసులు
గల;రందు వాతాపి ఘనమేషమూర్తి
56యిల నిల్వలుఁడు నొక్క ఋషియునై నిలిచి
యిచ్చటఁబెనుత్రోవ కెదురేఁగి మిగులఁ
దచ్చనఁదమయింటఁ దద్దినంబనుచు
మునుల నిమంత్రించి ముదమొప్ప దెచ్చి
యెనయ నమ్మేషంబు నేర్పడఁజంపి
ప్రీతిఁ గూరలు సేసిపెట్టి 57భుజింప
“వాతాపి ర.”మ్మని వడిఁ బేరఁజీఱఁ
దడయక యపుడు వాతాపి యమ్మునుల
కడుపులు వ్రయ్య నగ్గలికతో వెడలు.
నీ రీతి మునుల ననేకులఁ జంపి
యా రాక్షసాధము లడరియుండుదురు.
కొనకొని యొకనాఁడు కుంభసంభవుడు
చనుదేరఁ గపటభోజన మొప్పఁబెట్టి
వాతాపిఁబిల్వ నిల్వలుఁజూచి నగుచు:
“వాతాపి58యెందుండి వచ్చు! జీర్ణించె.”
నని యగస్త్యుడు వల్క నా యిల్వలుండు
కనలి59రాక్షసుఁడయికదియ వచ్చుటయుఁ
గలశసంభవుఁడు హుంకారమాత్రమున
బలియు నిల్వలు బిట్టు భస్మీకరించి
మునులకునెల్లఁ బ్రమోదంబు సేసె.
విను మదియునుఁగాక వింధ్యంబడంచె;
సరి60గాఁగ దక్షిణాశాస్థలి నిలిచె.
నరుదుగా నంబుధి నాపోశనించెఁ;
బెనుబాముగాఁగ శపించె నానహుషు.
మునిమాత్రుఁడే పుణ్యమూర్తి కుంభజుఁడు
మునివేషమున నున్న ముక్కంటిగాక!”
యన విని రఘురాముఁడానందమంది
మఱునాఁడు మునిపతి మార్గంబు సూపి
తెఱఁగొప్పఁబూజించి దీవింప వెడలి
చనిచని యొక్కయోజనముత్తరించి
పనస, దాడిమ, శమీ, బదరికాశ్వత్థ,
సాల, ప్రియాళు, రసాల, తమాల,
మాలూర, ఖర్జూర, మందార 61తరుల,
తరులఁగ్రిక్కిరిసిన తావిక్రొవ్విరుల,
విరుల తేనియలాని వెలయుతుమ్మెదల,
మెదలనింపగునట్టి మేటిపూఁబొదల,
పొదలలోఁబగ లేక పొదలుమృగముల,
కలకంఠకలకుహూకార నాదముల,
విలసిల్లు బహుశాస్త్ర వేదనాదముల,
62పొలుచుననేక తపోవినోదముల
కలిమి దీపించునగస్త్యునాశ్రమముఁ

  1. నందు
  2. బోవలయు
  3. జెల్లుచుండ - ని
  4. శక్తి
  5. నిలువ నిల్వలుఁడును నియతితో
  6. కుడ్చుటయు
  7. యిఁకనెట్లు
  8. రక్కసుఁడయికదియ
  9. గాక
  10. వకుళ
  11. చెలఁగుచుఁగిన్నరసిద్ధగానముల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )