ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
రావణుఁడు మఱల మారీచు కడ కేఁగుట
ననిన రావణుఁడు కామాతురబుద్ధి
మును నకంపనుమాట ముదితమాటయును
విననొక్క తెఱఁగంచు విస్మయంబంది
గొనకొన్న వేడ్కతోఁగొలువు సాలించి[వా.రా. సర్గ 35]
తనపాలివిధి తన్నుఁదగిలి ప్రేరేపఁ
జని యేకతంబున సారథిఁబిలిచి
“యరదంబుఁదె”మ్మన నతఁడట్ల సేయ
ఖరకరసదృశంబుఁగామచారంబు
ననుపమాయుధపూర్ణమగు రథంబెక్కి
దినకరకోటిసందీప్తుఁడై మెఱసి
గగనమార్గమున సాగరమధ్యసీమఁ
దగిలి వస్తువిశేషతతులు సూచుచును
తమకించి వడి సముద్రము దాటిపోయి
క్రముక మరీచికాగరు నారికేళ
సాల తక్కోల రసాల విశాల
వేలావనంబులు వేడ్కఁగన్గొనుచు
గరుడుఁడు మును సుధాకలశంబు దేరఁ
గరమర్థిఁ బోవుచో గజకచ్ఛపముల
భక్షించుకొఱకునై పద మూఁదినట్టి
వృక్షంబు పక్షీంద్రకృతలక్షణంబు
శతయోజనాయతశాఖంబు మౌని
వృతము 205సుభద్రాఖ్య వెలయువటంబు
సుముఖుఁడై కనుఁగొంచు సురుచిర మహిమ
నమరిన యా సుచంద్రాశ్రమభూమిఁ
గ్రమమొప్ప జడలు వల్కలములుఁ దాల్చి
సమచిత్తుఁడై కడుసౌమ్యభావమున
భూరితపోనిష్ఠఁ బొలుపొందుచున్న
మారీచుఁ జేరి సన్మానంబు వడసి
యతిదీనవదనుఁడై యా పంక్తికంఠుఁ
డతనితోఁదనదుకార్యము సెప్పఁదొడఁగె:
“మారీచ! నీవాప్తమంత్రివి గాన
వారక మఱియును వచ్చితి మిటకుఁ;[వా.రా. సర్గ 36]
దరణివంశ్యుఁడు రామధరణీశ్వరుండు
ధరణి యేలఁగనీక తండ్రి వొమ్మనిన
ననుజన్ముఁడును దాను నతివయుఁగూడి
వనములఁదపసులై వర్తింప వచ్చి
తన206సత్త్వమునపేర్మి దండకారణ్య
మునులకు నభయమిమ్ముల నిచ్చి నిల్చి
207నడుఁకక మనశూర్పణఖ ముక్కుఁజెవులుఁ
గడునల్గి కోసె నక్కడ నకారణము;
ఖరదూషణాది రాక్షసుల వధించెఁ;
దరమిడి మఱి చతుర్దశ సహస్రముల
తెగినబంధులకుఁబ్రతీకార మేను
నెగడి చేయకయున్న నెంజిలి వోదు.
నీవు మున్‌ గఱపిన నీతి నట్లున్న
నావల నభిమానహాని గాకున్నె.?
తగ నటుగాన యాతనిదేవి మాయఁ
బొగడొందఁగొనితేరఁబోవుచు నుండి
యలవడ నొక యుపాయముఁగంటి; నీవు
దలకొన్న నది నాకుఁ దగిలి సిద్ధించు:
నడరెడు కడఁకతో నా పర్ణశాల
కడ కేఁగి మాయామృగంబవై నీవు
చెలఁగుచు వర్తింప సీత నిన్‌ జూచి
మెలుపొంద రామసౌమిత్రులఁ 208బిలిచి
నినుఁబట్టి తెమ్మన్న నీవును వారిఁ
గొనిపోయి మృగవృత్తిఁగుశలత మెఱసి
పోయి దుర్గాంతరంబులఁగాడుపఱచి
మాయమై నీ యాశ్రమము వచ్చి చొరుము.
ఏనును జానకి నిట లంకలోని
కూనినవేడుక నొగిఁదెచ్చుకొందు.
నా రాముఁడును విరహాగ్నిచే మ్రందఁ
గోరి యేనును గోర్కి గొనసాగ నుందు.
నిది యిట్లు గావింపు; మేను నా రాజ్య
పదమున సగపాలు పంచి నీ కిత్తు.”

  1. సత్యమున
  2. నడుకంగ
  3. జూచి
  4. సవ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )