| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
శ్రీలీల దశరథోర్వీపాలుఁ డవనిఁ బాలించుచుండి చొప్పడ నొక్కనాఁడు:[వా.రా. సర్గ 1] సుతులు నల్వురలోన శుభతరమూర్తి నతులయశోనిధి యగుచున్నవాని, నురుసత్యమును యుక్తియుక్తంబు మితముఁ బరహితంబునుగాఁగఁబలికెడువానిఁ, బన్నుగాఁదనబహిఃప్రాణంబులనఁగ సన్నుతి గైకొంచుఁజరియించువాని, ననుదినంబును బెద్దలగువారినెల్ల మనముల ముదమంద మన్నించువాని, హితబుద్ధియగువాని, నెల్లభూతముల హితమునఁగరుణ నన్వేషించువానిఁ, బోలఁజతుర్విధపురుషార్థ గతుల నోలిఁజిత్తంబున నూహించువాని, ననిశంబు సంతుష్టుఁడైయుండువాని, వినుత విచారుఁడై విలసిల్లువాని, వెరవరియగువాని, విహితకార్యంబు లరయ ననాలస్యుఁడై చేయువాని, గాఢవిచారంబు గలవానిఁ,బరమ గూఢమంత్రంబునఁగొమరొందువానిఁ దప్పనికోపంబుఁ దగు ప్రసాదంబు నొప్పగుప్రభుశక్తి యొనరెడువాని, నని సురాసురులకు నవిజేయుఁడగుచు ఘనభుజబలమునఁగడువాలువాని, గజహయారోహణక్షముఁడైనవాని, విజయలక్ష్మీసమన్వితుఁడైనవాని, మాననిరోషంబు మది లేనివాని, మానుగా భృత్యుల మన్నించువాని, నతిరథుఁడగువాని, ననసూయవృత్తిఁ బ్రతిదినంబును బుద్ధిఁబాటించువానిఁ, గుముదబాంధవుభంగిఁగొమరొందువాని, నమితప్రజానంద మలరించువానిఁ, గరుణాసముద్రుఁడై కడు మించువానిఁ, బరులగుణంబులు పాటించువాని, బుద్ధి బృహస్పతిఁబురుడించువాని, నిద్ధతేజంబున నినుఁ బోలువాని, వెలయు ధనుర్వేద వేదశాస్త్రముల వలయువిద్యలయందు వలనొప్పువాని, న్యాయమార్గంబున నర్థార్జనంబు పాయక చేయనేర్పరి యగువాని, సైరణ ధరతోడ సరివచ్చువాని, భూరిగుణంబులఁబొలుపారువాని, శ్రీరాముఁ బట్టాభిషేకంబు సేసి ధారుణి యేలింపఁదలపోసి చూచి తలకొన్నకడఁకతో దశరథేశ్వరుఁడు గొలువుకూటమునకుఁగొమరొప్ప వచ్చి యందు వసిష్ఠాదులగు పురోహితుల నందు సుమంత్రాదులగు మంత్రివరులఁ జేరువనృపతులఁజెలులఁజుట్టములఁ బౌరవర్యుల జానపదుల నాశ్రితుల ధారుణీదివిజుల దండనాయకుల ధీరుల రాజనీతిజ్ఞుల నెల్ల వారల రావించి వారిద నినద చారుగంభీర సుస్వరమునఁబలికె: “మాపెద్ద లిక్ష్వాకుమనుజేశ ముఖ్యు లీ పృథివీతలం బేలి రింపెసగ;[వా.రా. సర్గ 2] వారలరీతి నవారిత నీతి నీ రాజ్యమంతయు నే నోపినట్లు నిజకులాగతధర్మనిరతుండ నగుచుఁ బ్రజల నేలితిని మీ ప్రాపునఁజేసి; యిదియంతయును మీర లెఱిఁగినయదియ; విదితంబుగా నింక వినుఁడొక్కమాట: యఱువదివేలేఁడు లవనిఁబాలించి నెఱి సితచ్ఛత్రంబునీడన యుండి ముదిసితి భూభారమునకంటె ఘనతఁ బొదలు జరాభారమును దాల్చుకతన; నా మేను వికసిత నలినషండంబు గౌముదిచేఁ బోలె గర్వంబు దక్కెఁ. రమణీయగుణముల రామచంద్రునకు సములు లే;రధికులు నర్చింపఁగలరె? తలఁప నీతఁడు దల్లిదండ్రు లర్భకుల నలరించుగతి మిమ్ము నలరింపఁగలఁడు; ప్రజలెల్ల రామునిపట్టంబునకును నిజముగా సురలకు నిష్ఠ మ్రొక్కుదురు; జనమనోరథములు సఫలంబు లగుచు ననుపమసుఖలీల నలరుఁగావుతమ; కావున నిఁక రాముఁగల్యాణనాము దేవతాహితకాము ధీగుణస్తోము నిందీవరశ్యాము నినకోటిధాము సౌందర్యజితకాము జగదభిరాముఁ బ్రజలఁబాలింపంగఁబట్టంబుగట్టి సుజనులు గొనియాడ సుఖకరంబైన యూరట గోరుచు నున్నాఁడ;మీకు నీ రీతి సమ్మతంబే.”యంచుఁబలుక; ఘనగర్జితంబు లాకర్ణించి యలరు వనమయూ1రంబుల వడువు వహించి మొగిఁగలకలశబ్దముఖరితాశాంతు లగుచు భూసురముఖ్యులగు భూమిప్రజలు దమలోనఁదారు మంతనమాడి కూడి కమలాప్తకులున కుత్కంఠ నిట్లనిరి: “మీ రానతిచ్చిన మేలిమిమాట వారువీరన కెల్లవారికి హితము, హృదయరంజకము, నభీష్టదంబయ్యె; నదిగాక సకలప్రజానందకరుని, రాజనీతిజ్ఞు, నిర్మలధర్మనిపుణుఁ, దేజోజగద్బంధు, దీనైక బంధు, సత్యసంధుఁ, బ్రసన్నుఁ, శాంతిసంపన్ను, నిత్యవిప్రార్చనానిరతు, సచ్చరితు, నీతియుఁబ్రీతియు నేర్పును నోర్పు ఖ్యాతియు భూతియుఁగాంతియు దాంతి శాంతియు మొదలైన సద్గుణావళుల నెంతయు నీకన్న నెక్కుడై యున్న రాముని, లోకాభిరాముని నీవు భూమికి రాజుగాఁబూన్చుట దగదె? త్రైలోక్యమైన నాతండేలఁజాలు నీ లోకమేలుటదెంతమాత్రంబు? నీ సుతాగ్రణి రాజ్యనిరతుఁడౌనేని భూసతి సేసిన పుణ్యంబు గాదె? కావునఁబట్టంబు గట్టు మీ వతని; కే వేళ మేమును నిదియె కోరుదుము.” అనుచు బద్ధాంజలులై విన్నవింప విని తన మదిలోన వేడ్క రెట్టింప[వా.రా. సర్గ 3] భూమీశుఁడప్పు డుప్పొంగి వసిష్ఠ వామదేవులఁజూచి వలనొప్పఁబలికె: “నీ మధుమాసంబభీష్టదంబగుట రాముని సకల సామ్రాజ్యలక్ష్మికిని రాజుఁజేయుదము; దద్ద్రవ్యవస్తువులు యోజించి తెప్పింపుఁడుచితవైఖరిని.” నని పల్క వారు నయ్యభిషేకయోగ్య ఘనవస్తువులు గూర్పఁగాఁబంచి.రంత, నాదిత్యకుల గురుండగు వసిష్ఠుండు మేదినీపతియాజ్ఞ మెయికొని యపుడు పరిచారకులఁజూచి పలికె:“మీ రింకఁ బొరి సువర్ణంబులుఁబొలుచు రత్నములు నెల్ల యోషధులును నెసగుగంధంబు తెల్లఁబుష్పంబులుఁదేనియఘృతము లాజలు నూతన లలితవస్త్రములు రాజయోగ్యంబగు రథవరేణ్యమును మణికాంచ2నాంచితమహితాయుధములుఁ బ్రణుతలక్షణమైన భద్రసామజము నవదాతహయమును నాలవట్టములు ధవళాతపత్రంబుఁ దగుచామరములు ఘనకేతనము హేమకలశముల్ నూఱుఁ గనకశృంగంబులు గలవృషోత్తమము వఱలుసమంచితవ్యాఘ్రచర్మంబు మఱియును వలసిన మహితవస్తువులు నొగిఁదెండు మీ రగ్నిహోత్రశాలకును; నగరివాకిండ్లును నగరవీథులును బురగోపురంబులుఁబొరి నొప్పుసేయుఁ డరుదార శిల్పంబు లందంద మెఱయఁ; గలువడంబులుఁబతాకలుఁదోరణములు గలయంగఁబురలక్ష్మి గైసేయుఁడెలమి; 3నోలి భూసురులకు నొక లక్షకైనఁ 4బోలనన్నంబు లొప్పుగఁజేయుఁడెలమి; దక్షిణార్థంబైన ద్రవ్యంబులెల్ల 5నక్షీణముగఁగూర్పుఁ6 డఖిలయత్నముల; నందఱుఁబూజోపహారాది విధులఁ బొందుగాఁగొలువుఁడు 7పురదేవతలను; వారాంగనలు వీరు వారన కెల్ల వారును గైసేసి వారక నగరి రెండవవాకిట రీతితో వచ్చి యుండుఁడు; నగరి భటోత్తముల్ గొలువ నెఱిఁగింపు”డనిన వారెల్ల కార్యములు మఱవక కావించి మది ముదం8బొదవ నా వసిష్ఠునితోడ నంతయుఁ జెప్పఁ గా విని దశరథక్ష్మాపాలుఁ డపుడు క్ష్మావల్లభుండు సుమంత్రాది9మంత్ర కోవిదులను బంధుకోటిఁబేర్వేర రావించి చెప్పి వారలు సమ్మతింప వేవేగ రఘురామవిభుని రప్పించి తన చూపులను సుధాధారలు దొరుగ జననాథుఁడారామచంద్రుతో ననియెఁ: “బెనుపొందఁగడిమిమైఁబెద్దగాలంబు జనులెల్లఁబొగడ రాజ్యము సేసి యేను దానముల్ ధర్మముల్ దనరుయాగములు నూనిననిష్ఠతో నొగిఁ బెక్కు సేసి కడపట నీ యట్టి కల్యాణశీలుఁ గొడుకుఁగాఁ బడసితిఁగోర్కి దీపింప. నే నింక భూభార మిట మోవఁజాలఁ; గాన నిన్ బట్టంబు గట్టెదఁబ్రీతిఁ. జెలువారఁబట్టాభిషేకంబు సేయ లలిత10మై యొప్పెడు లగ్న మెల్లుండి. యొనర సీతయు నీవు నుపవాసముండుఁ డెనసిన భక్తితో నెల్లి సంప్రీతి.” నని పల్కుటయు రాముఁడవనీశుఁజూచి వినయధైర్యంబులు వెలయ నిట్లనియె: “జననాథ!నాకు మీ చరణపద్మములు గొనకొన్నభక్తితోఁ గొలుచుటకంటెఁ గడచినకార్యంబు గలదె లోకమున? నుడుగుఁడీ పలుకులయోగ్యంబు.”లనుడు “ననఘచారిత్రుఁడ!వతి11పుణ్యధనుఁడ! వినకులరత్నంబ; వీవు దక్కంగఁ దగువార లెవ్వరు ధరణి12వాలింపఁ? దగిలి13కైకొను మిఁక ధాత్ర్యేకవీర.” యని పల్కుటయు రాముఁ“డట్లకా.”కనుచు దన నగరికిఁబోయెఁ. దదనంతరంబ, పౌరుల రాజుల బంధులనెల్ల వారల వీడ్కొల్పి వనజాప్తకులుఁడు[వా.రా. సర్గ 4] అంతఃపురంబున కరిగి శ్రీరాముఁ జెంతనున్న సుమంత్రుచేఁబిలిపించి తన సమీపమున నా తనయుఁగూర్చుండఁ బనిచి యానందబాష్పము లుప్పతిలఁగ: “నాపాలిభాగ్యంబ, నా నిధానంబ నా పుణ్యసారంబ, నా తపఃఫలమ, నా పుత్త్రరత్నంబ, నా కలలందు దీపించె నశుభవర్ధితనిమిత్తములు; ఘనదుర్గ్రహములు నుల్కాపాతములును గనుఁగొంటి; మనసు వైకల్యంబు నొందెఁ; గావునఁబుష్య14యోగంబున నిపుడు నీవు పట్టముఁబూన నిండు నా కోర్కి. యాలస్యమేల? నీ యభ్యుదయమున కీ లోకమంతయు నెపుడుఁగాంక్షించు.” నన విని దశరథునానతి నీయ కొని మ్రొక్కి తండ్రి వీడ్కొని రాఘవుండు తన తల్లికిని సుమిత్రకు నట్టివార్త జనకనందనకు లక్ష్మణునకుఁజెప్పి వారల సంతోషవార్ధిఁ దేలించి యా రామవిభుఁడు శీతాంశు సన్నిభుఁడు తన నగరికివచ్చెఁ దాను సీతయును ఘనమైనహృదయ వికాసంబు తోడ. నంత వసిష్ఠుతో ననియె భూవరుఁడు: “సంతోషమెసగంగఁ జని రామచంద్రు[వా.రా. సర్గ 5] మునినాథ! యుపవాసమునకు సంకల్ప మొనరింపఁజేయుము యుక్తమార్గమున. ననవుడు బ్రహ్మరథారూఢుఁడగుచుఁ జని వసిష్ఠుఁడు రామచంద్రుని నగరి యమ్మూఁడువాకిండ్ల యందాఁకఁబోవ నిమ్ముల రాముఁడు నెదురేఁగుదెంచి 15యవరోహణంబుదా నమరఁజేయించి యవతీర్ణరథుఁడైన యతనికి మ్రొక్కి లోనికిఁదెచ్చి యా లోకవంద్యునకు మానుగా సత్కృతుల్ మనసారఁజేయఁ బుణ్యాహవాచనంబును నుపవాస పుణ్యసంకల్పంబుఁబొసఁగఁ జేయించి వెలయ రాముఁడు పదివేలధేనువుల నెలమి దక్షిణగాఁగ నిచ్చినఁ గొనుచు వచ్చి వసిష్ఠుఁడు వసుమతీపతికి నచ్చుగాఁజెప్పి గృహంబున కరుగ నంతఃపురంబున కరిగె భూవిభుఁడు. నంత నక్కడ రాముఁడానంద 16మొదవ[వా.రా. సర్గ 6] జానకితోఁగృతస్నానుఁడై విష్ణు మానుగాఁ17గూర్చి హోమంబు గావించి యాహవిశ్శేషంబు నమరఁబ్రాశించి యూహ విష్ణుధ్యాన మొనరఁజేయుచును విశదనిశ్చయబుద్ధి విష్ణుగేహమునఁ గుశశయ్యపైఁబొల్చి కులగురుండైన యావసిష్ఠుఁడు సెప్పినట్టిచందమున ధీవరిష్ఠుఁడు రామదేవుండు నిష్ఠ నుపవాసముండె. నయోధ్యలో నంత విపులసమ్మదమున విలసిల్లువారు, గలయంగఁగస్తూరి కలయంపిఁజల్లి కొలఁదిముత్తెముల మ్రుగ్గులు వెట్టువారు, నరుదార నుత్తుంగ హర్మ్యంబులందు సరినొప్పుదేవతా సదనంబులందు విపణిమార్గములందు వివిధచిత్రముల విపులపతాకలు వెస నెత్తువారుఁ, జెలువార గృహములు సిత్రించువారు, నలిమీఱ మణితోరణము లెత్తువారు, విరులచప్పరములు విరచించువారుఁ, బురవీథిఁగేతనంబులు నిల్పువారుఁ, గలువడంబులు డంబుగాఁగట్టువారుఁ, గలిమి నొండొరు లర్థిఁగైసేయువారు, బెరయంగ నిస్సాణ భేరీ మృదంగ మురజశంఖాదులు మొరయించువారుఁ బొలుచుదివ్యసుగంధపుష్పాక్షతములు వెలయంగఁగైకొని విలసిల్లువారు; నభిషేకసుముహూర్తమరయించువారు, విభుఁడైనదశరథు వినుతించువారు, నిలువేల్పులకుఁబూజ లిచ్చెడువారుఁ, గలకొద్దిదానముల్ గావించువారుఁ, బురరాజవీథి గుంపులు గూడువారు, సరసకథాగోష్ఠిఁ జరపెడువారు, రాముఁడే 18రాజుగాఁబ్రార్థించువారు, రామునిఁగొలువ సంభ్రమపడువారు, రామకీర్తనముల రాగిల్లువారు నై మహోత్సవకోటు 19లలరించుచుండ; |