ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
పంపాసరోవర వర్ణనము
శ్రీరాముఁడయ్యెడ శీతలవారి
వారిజోత్పలకైరవంబుల నొప్పు[వా.రా. సర్గ 1]
పంపయు మధుమాస1ఫలిత తత్తీర
చంపకసహకారచారుకాంతార
సంపదయును జూచి జానకీవిరహ
కంపితుఁడగుచు లక్ష్మణున కిట్లనియె:
“సౌమిత్రి! యీ పంప సకలనిలింప
కామినుల్‌ జలకేళి కరము2గాంక్షింప
నొప్పు; నీ సరసితో నుపమాన మరసి
చెప్పంగ శక్యమే శేషునికైన?
ననుకూలమలయానిలాహతి దీన
జనియించుఁబో బిందుసరము లెన్నైన!
దీని మహత్త్వంబు దెలిసినచోట
మానసంబును నణుమాత్రంబె కాదె?
పావనజీవనాస్పదమైన దీని
కా వేల్పుడిగ్గియయైన సమంబె?
యున్నాళవిస్ఫురితోరుకర్ణికలఁ
దిన్నగా విరిసిన తెల్లనెత్తమ్మి
మరకతస్తంభనిర్మలహేమకుంభ
భరితాతపత్రమై పార్శ్వద్వయమునఁ
దేఁటిఱెక్కలఁగ్రమ్ముతెమ్మెరవలన
నూఁటాడుతరగల నుయ్యాలలూఁగు
విప్పారుఱెక్కల 3వెలయురాయంచ
లొప్పారఁగా వైచు నుభయచామ 4రము
లే పొంద నీ పంప యీక్షింప నొప్పె
శ్రీపూర్ణపట్టాభిషిక్తునికరణి.
నామని జవ్వనంబలరిన రుచుల
చే మించుచిన్నారిచిగురుమానికపు
సొమ్ములు దాల్చి నల్‌ చుట్టును గ్రమ్మి
కొమ్మలీ నిద్దంపుఁగొలఁకుటద్దమున
నిక్కి నీడలు చూచి నిజవిలాసముల
కొక్కింత యౌఁదల లూఁచుచందమునఁ
5గొండొక గాలిసోఁకులఁదుదల్‌ గదల
నొండొరుఁబొగడుచు నున్నచందమునఁ
గీరశారిక లర్థిఁ6గెలయు నిచ్చోటి
తీర 7వనీవాటి దృష్టింప నిపుడు
తాపంబు మరునిప్రతాపంబు కరణి
దీపించె నా మేన ధృతి నటుగాన,
సౌమిత్రి! యిది వనస్థలి గాదు; చూడఁ
గాముని యాయుధాగారంబుగాని;
చింతింప నివి మావిచిగురులు గావు
కంతుని క్రొవ్వాఁడికత్తులుగాని;
భావింప నివి పూవుబంతులు గావు
భావజాతుని 8బాణపంక్తులుగాని;
యే యెడ భృంగఝంకృతు లివిగావు
డాయు మారుని చాపటంకృతుల్‌ గాని;
వర్ణింప నివి పికధ్వనులు గావతను
కర్ణకఠోర హుంకారముల్‌ గాని.
యటుగాన నావంటి యంగనారహితు
లెటువలె వేగింతు రీ కాననమునఁ?
గలకంఠకలకుహూకారనిస్స్వనముఁ
జెలఁగించువనము గర్జిలుఘనాఘనము
కులుకుపుప్పొడి మించుక్రొక్కారుమించు;
తలిరుఁగొమ్మలు శక్రధనువులయనువు,
వసుధ రాలెడు విరుల్‌ వర్షోపలములు,
ముసరు తేనియసోన ముంచినవాన
గా నొప్పుచు వసంతకాలంబు చూడ
వానకాలముఁ9బోలి వసుధ నొప్పియును
జిగురాకుశిఖలతోఁజిట్టాడుతేఁటి
పొగలతోఁబొగడపుప్పొడిబూదితోడ
బూరుగుపూవునిప్పుకలతో నెగడి
యారయ విరహుల కగ్నియై నిగుడి
కంతుప్రతాపాగ్ని కరణిఁగడంగి
యెంతేని నా చిత్త మెరియింపఁదొడఁగె.
రామాశిరోమణి రాజబింబాస్య
నే మార్గమునఁగొని యేఁగెనో యసుర?
వనజాక్షి యెచ్చట వసియించినదియొ?
కని విని యెఱుఁగ మిక్కార్యంబులెల్ల.
నేమిచేయుదు నింక? నెట్లువేగింతుఁ?
గామినీమణి సీతఁగాంతు నెన్నఁటికిఁ?
బంపాసరోవరప్రాంతకాంతార
సంపదతోడ వసంతంబు గూడఁ
10గలిగినగతి జనకజతోడఁగూడఁ
గలుగునే నాకు నొకానొకనాఁడు?
ఈ పంపలోఁదమ్ము లేఁజూచినట్లు
భూపుత్త్రివదన మెప్పుడు 11చూతునొక్కొ
ఇందు మీనవిహార మీక్షించినట్టు
లిందు వదనచూపులెప్పుడు చూతు?
జలపక్షులిచ్చట జతగూడినట్లు
జలజాక్షి నెన్నఁడు జతగూడువాడఁ?
దేఁటి యిచ్చటఁదమ్మితేనె గ్రోల్‌కరణి
బోటికెమ్మోవి యెప్పుడు గ్రోలువాఁడ?
నెక్కడి తలపోఁత? లెక్కడి సీత?
యెక్కడి వెడసేఁత? లివి యెట్లు పొసఁగుఁ?
దమ్ముఁడా! నీ వయోధ్యకుఁజనుమింక;
12నిమ్మెయిఁబ్రాణంబు లిఁక నిల్పఁజాల.”
నని యనాథుని క్రియ నందంద వగవ
విని లక్ష్మణుఁడు రామవిభుని బోధించి:
“యిది యేమి రఘురామ! యెల్లలోకములు
ముదలింపఁబురుషోత్తముఁడవైన నీవు
ఈ మోహశోకంబు లేల తాల్చెదవు?
కామిని వంచనఁ గైకొనిచనిన
రావణుఁజంప నారంభంబు సేయు
మీ.”వని తెలుపుచు హితగోష్ఠి నుండె.

  1. ఫలతరుతీర
  2. గావింప
  3. విరి
  4. రలు! దీపింప నీ పంపదృష్టింప
  5. కొండుక
  6. గెరలు
  7. వనాటవి
  8. వాఁడిబాణముల్‌
  9. నాఁటివడువుదోచియును
  10. గలసిన
  11. చూచువాఁని
  12. నిమ్మేనఁ, నిమ్ములఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )