ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
లంకాదహనము
“క్రోఁతులకెల్లను గుఱుతు వాలంబు
బ్రాఁతిగా; నటుగాన ప్రజలెల్లఁజూడ
వీని వాలముఁగాల్చి వీథులఁద్రిప్పి
పోనిండు.” నావుడుఁబొదివి రాక్షసులు
బలుమ్రోఁకు లొగిఁదెచ్చి పవనజుఁబట్టి
బలిమిఁజేతులుఁగాళ్లు బంధించి తెచ్చి
“మనవారిఁబెక్కండ్ర మడియించినట్టి
చెనఁటికీటము లెస్సచిక్కెరా.”యనుచుఁ
బురవీథులందుఁద్రిప్పుచు నంతనంత
వరుసఁదూర్యంబులు వాయించికొనుచు
నెల్లందు మెలఁగ నయ్యెడ వాయుసుతుఁడు
కల్లరిదనుజులఁగలయఁ గ్రేఁగంటఁ
గనుగొంచు మఱియు లంకాపురంబెల్లఁ
గనుఁగొనుతలఁపున గాసికి నోర్చి
హీనసత్త్వుఁడు వోలె నిటునటు దిరుగ
నానా విధంబుల నగుచుఁ గేరుచును
నా బాలగోపాల మతని వెన్‌ తగిలి
నా189బూమెలకుఁ బుణ్యులాత్మలో వగవఁ
దలకొని యంతఁగొందఱు దైత్యవరులు
చలమునఁ జీర లసంఖ్యముల్‌ దెచ్చి
కాలసర్పాకృతుల్‌గా తిరుల్‌ దాల్చి
లోలత నవి నూనెలోఁదోఁచితోఁచి:
“యిది యశోకారామమెల్ల ఖండించె;
నిది దానవేశుల నిందఱఁజంపె;
దీనికిఁ దగుశాస్తి దేవారి వెట్టె;
దీనిఁగాల్త.”మటంచుఁదెగువ నొండొండ
నొదవిన లంకలో నుత్పాత కేతు
వుదయించె ననఁ190బేర్చుచున్న వాలమున
నచ్చలంబునఁజీరలన్నియుఁజుట్టి
చిచ్చు దగిల్చి రచ్చెరువుగా మండ.
దనుజులు సింహనాదములు సేయుచును
వెనువెంటఁదగుల నా వృత్తాంతమెల్లఁ
దప్పక దనుజకాంతలు సూచి పోయి
చెప్పిన నప్పుడు సీత శోకించి:
“యక్కటా! పుణ్యాత్ముఁడైన నీ కిట్టి
యిక్కుపాటును గల్గెనే తండ్రి!”యనుచు
జలముల ముట్టి సుస్థలమున నిలిచి
చెలువొప్ప నగ్నికిఁజేతులు మొగిచి:
“యా రామవిభుఁడు ధర్మాత్ముఁడౌనేని
వారిధి నాకుఁగా వడి దాటునేని
యీ రావణుని రాముఁడిలఁగూల్చునేని
వారక యేఁ బతివ్రత నౌదునేని
జనకభూపతి సర్వసముఁడగునేని
తనరువేదములు సత్యము లగునేని
పవమానమిత్ర! యోపరమపవిత్ర!
సవకేకిశరద! దోషాహ్రదద్విరద!
వరద! వైశ్వానర! వానరోత్తమునిఁ
బరమశీతలుఁడవై పాలింపుమయ్య!”
యని సీత ప్రార్థింప ననిలసూనునకు
ఘలవాల మనుపేరి కాలాహితలను
గనుపట్టు మాణిక్యకళిక నా మెఱసి
యనలుండు గడుఁజల్లనై యుండె. నంత
నా విధంబునకుఁ దా నాశ్చర్యమంది
పావని: “తన తండ్రి పావకసఖుఁడు
గావున నన్నగ్ని గరుణించె నొక్కొ!
దేవతలెల్లఁ బ్రార్థించిరో! రామ
దేవు విక్రమమొ! యేదియుఁగాదు; సీత
దీవన.”యంచును దెలివిమై నుండెఁ
బ్రవిమల తత్త్వైకపరులైన 191నరుల
భవపాశములు వీడు భావంబు దోప
బ్రహ్మమంత్రములు దప్పక యుచ్చరింప
బ్రహ్మపాశము లూడెఁబవనసూనునకు.
నంత నా హనుమంతుఁడసురేశులంక
నంతయుఁగాల్పంగ ననువు సింతించి:
“యలవడఁ192దనకునై యగ్ని సూక్తములు
జలములలోఁగ్రుంకి జపియింపవలయు”.
నని పోయి మునిఁగిన ట్లపరాంబురాశి
నినుఁడస్తమించిన నేచి వాయుజుఁడు
కనక మహీధరాకారమై యొప్పు
తన మేను డించి బంధములెల్లఁద్రెంచి
కీడాచరించుచుఁ గేలిసేయుచును
వేడుకతోఁ దన వెనువెంట వచ్చు
దనుజుల 193నిర్జించి తనదువాలమున
ఘనమైన మేడ కుత్కట194ముగా నెగసి
తన వాలవహ్ను లంతట దరికొల్పఁ
దనరి యంతంత కుదగ్రంబు లగుచు[వా.రా. సర్గ 53]
బుగులనఁ195బొగవుట్టెఁ; బొగలకు మున్నె
నిగిడి పెన్మంటల నిండె నాకసము;
నాకసంబున మంట లడరకమున్నె
పైకొని యందంద పర్వె నుల్కములు;
నడరి యా యుల్కల కటమున్నె తొలఁగి
వడి దిక్కులకుఁబాఱె వరవిమానములు.
నప్పుడు హనుమంతుఁడడరి యొండొండ
కుప్పించి మఱి కొల్వుఁగూటముల్‌ గాల్చి
వరశస్త్రశాలలు వడి నీఱుసేసి
196పరగ భాండాగారపంక్తులు గాల్చి
పరువడి సౌధముల్‌ భస్మంబు సేసి
సొరిది చప్పరములు చూర్ణంబు సేసి
మణిచంద్రశాలలు మసిగా నొనర్చి
ప్రణుతశయ్యాగేహపటలి దహించి
రమణీయగజ వాజి రథశాల లోలిఁ
గమలించి దగ్ధముల్‌గాఁజేసె. నప్పు
డెడపక యెగసిన యెఱమంట తునుక
లుడుగక యుడువీథి నొండొంటఁబర్వె
ఖచరోరగామరగణవిమానములు
ప్రచురవిభాగైక పరతఁ జరింప.
సొరిదిమై రావణాసురుచేటుదెల్పఁ
దొరుగునుల్కములట్లు దోచె నుల్కములు;
రాజన్యనిధిరఘురామభూపాలుఁ
డోజమై దండెత్త నుద్యుక్తుఁడగుచుఁ
బలువిడి లంకలోపలఁబ్రతాపాగ్ని
నెలమిమై నిర్గమమిడియెనో యనఁగ
దహనుండు నిర్భరధ్వనుల బ్రహ్మాండ
కుహరంబు నిండ మిక్కుటముగాఁబర్వె
రావణుఁడట ఘోరరణకళాకేళిఁ
గావలుండగుచు దిక్పాలురనెల్లఁ
బఱచిన తొల్లిటిభంగముల్‌ మాఱు
పఱపక పోవనుభంగిఁ బెల్లెగసి
బలసి విభీషణుభవనమొక్కటియ
వెలిగాఁగఁ బురమెల్ల వ్రేల్మిడిలోన
దరికొని మండె. నత్తఱి దైత్యవరులు
కరము భయభ్రాంతిఁగంపించువారుఁ;
దలలును జీరలు దరికొని మండ
బలువిడి నల్గడఁ బాఱెడువారుఁ;
దమతమ వారలుఁ దమ బంధుజనులుఁ
గమరుట చూచి శోకమునందువారు;
హాహానినాదంబు లడరించువారు;
నా హనుమంతుపై నలిగెడువారు;
197 నా విష్ణుఁడారాముఁ; డతనికి నెగ్గు
198గావించె నీ పాపకర్ముఁ.”డన్వారు;
199నట్టి కీడొనరించినట్టిరావణుని
200కిట్టియాపద వింతయే!”యనువారు;
నగుచుండ నెంతయు నత్యుగ్రుఁడగుచు
నగచరవీరుండు నలిఁజెలరేఁగి
యొకచోటు దప్పకయుండ నా లంక
సకలంబుఁగాల్చి యుత్సవకేళిఁదేలి
చనఁజన నా యగచరనాథు వాల
ఘనతరదీప్తాగ్ని కడు నేపు మిగుల
నెడపక పై రాలునెఱమంటతునుక
లుడుగక త్రోయుచు నొగిఁదూలి తూలి
సోలి సురాపానసుఖసుప్తి మునిఁగి
కాలుట యెఱుఁగక కాలెడువారు;
నా యెడ మృదులశయ్యలయందు నిదుర
పోయినట్టులెయుండి బొందులు కమలఁ
దెలివికి నెడమీక తీవ్రాగ్నిశిఖల
మిలమిల మిడుకుచు మృతినొందువారుఁ;
దమతమబంధులఁ దమ వధూజనులఁ
దమతమబిడ్డలఁదమప్రాణసఖులఁ
దమతమవారలందఱఁదోడుకొనుచు
గుమురులు గట్టి యేఁగుచు మ్రగ్గువారుఁ
దెగి యిండ్లసరకులు దిగిచి తేఁబోయి
మగుడి రానేరక మ్రందెడువారు;
సతులఁగౌఁగిటఁజేర్చి సరిఁదెచ్చి తెచ్చి
ధృతిదూలి వాకిండ్లఁ ద్రెళ్లెడివారు;
నై లంక ఘూర్ణిల్ల నంతంతఁగదియ
నా లోకభయదంబులై మీఱిమీఱి
యురుసింహములఁబోలి యుగ్రత మిగిలి
కరికుంభవిదళనగతి మండిమండి
యోజఁబెంపారు రాహుతులచందమున
వాజులమీఁదికి వడి దాటిదాటి
తగ నించువరవిటోత్తముల చందమున
మొగిఁగామినీకుచంబులు ప్రాఁకిప్రాఁకి
భావించి యన్యులఁబ్రహసించువారి
కైవడి నాలుకల్‌ కడుఁగ్రోసి క్రోసి
తగిలి సంతసమునఁదలకొన్న వారు
మిగిలియుబ్బెడిగతి మిన్నంది యంది
పెలుకుఱి పఱతెంచు భీతులపగిదిఁ
దొలఁగక నిగుడి గొందులు దూరి తూరి
వాలుచు నిబ్భంగి వాయునందనుని
వాలాగ్ను లొగి లంక వడిఁ201జుట్టి కాల్చెఁ.
గాల్చిన నుబ్బి దిక్పతులు దేవతలు
“మేల్చుట్టమితఁ.”డంచు మెచ్చి తన్‌బొగడ[వా.రా. సర్గ 54]
హనుమంతుఁడంతట నంతరంగమున
జనకజమరణంబు శంకించి బెదరి:
“యీ లంకతోఁగూడ నినవంశుదేవిఁ
గాలిచితిని గన్నుగానక క్రొవ్వి;
యే నింక రఘురాము నేమనికాంతు?
జానకిసేమ మేసరణిఁబల్కుదును?
దప్పెఁగార్య.”మటంచుఁదల్లడంబంది
యప్పుడు దనమది నట వివేకించి
“యే తల్లిదీవన నీ ఘోరవహ్ని
నా తోఁక రోమమైనఁగమర్ప వెఱచె.
నట్టి యా దేవికి నగ్నిచే భయము
వుట్టునే? యిది యేటిబుద్ధి?”యటంచు
ధరణిజమదిలోని తాపాగ్ను లార్చు
వెరవున వాలాగ్ని విషధిలో నార్చి[వా.రా. సర్గ 55]
వెస నశోకారామవీథికిఁబోయి
యసురకాంతలు భయంబంది వీక్షింప
దనుజకాంతలచేతఁ దన సేమమెల్ల
విని మున్నె సంతోషవివశయై యున్న
జనకపుత్త్రికి మ్రొక్కి సన్నిధి నిల్చి
తన పౌరుషములెల్లఁ దగ విన్నవించి:
“యిదె పోయి తెచ్చెద నినకులేశ్వరుని,
మదిలోన 202నీకు నుమ్మలికంబు దీర.”
నని:“యింకఁబనివిందు.”ననుచు సీతకును
వినయంబుతో మ్రొక్కి వీడ్కొని కదలి
తడయక పశ్చిమద్వారంబునందు
వెడలుచుఁబావని వెస నేపుమిగిలి
తలుపులు వడఁదన్నఁదలుపులు విఱిగి
యిలఁగూలె రాక్షసులెల్ల భీతిల్ల.

  1. బాములకు
  2. బెర్గు
  3. వారి
  4. దానునయ్య
  5. ఁజంపి యా దశకంఠుఁ(దనుజేశుఁ) డున్న
  6. శక్తి
  7. బొగలుపైఁబొలయకమున్న
  8. యిరవొంద బండారపిండ్లును గాల్చి
  9. నాదిదేవుఁడు
  10. గాఁదలఁచెను
  11. యంత
  12. కింతవింతలు పెద్దలే
  13. బేర్చి
  14. నింక, ఁగల్గు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )