ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
యముఁడు రావణుతోఁ బోరుట
పవి ఘోరముద్గరప్రాసముల్‌ బూని
తివిరి ముందట మృత్యుదేవత నడువఁ
గాలదండము భయంకరలీల మెఱయఁ
గాలపాశము నగ్నికల్పంబునగచు
నిరుగెలంకులనొప్ప హేమముద్గరము
కరమొప్పి యుపరిభాగంబున వెలుఁగ
జగములు కంపింప సకలరాక్షసులు
తగిలిన పెనుభీతిఁ దను జూచి పాఱఁ
జనుదెంచి మదిలోనఁ జలియింపకున్న
ఘనబాహు దశకంఠుఁ గట్టల్కఁ దాఁకి
యలవున మర్మంబులంట నందంద
బలువిడి నొప్పించె బలగర్వ మడర
దానికిఁ గడునల్గి దశకంధరుండు
కీనాశుపై నగ్నికీలలు నిగుడ
శరములు వరఁగించె జముఁడు నాశరము
లురుసాయకంబుల నొగి ద్రుంచివైచి
వివిధాయుధంబుల వివశుఁ గావించె
దివిజారియును దోన (దొన???) తెలిసి మార్కొనియె
నంతకుం డటునవ్వి యకట నీ పలుకు
పంతంబు లెటవోయెఁ బఙ్క్తికంధరుఁడ
పరుషవిక్రముఁడవు బవరంబులందు
నురక మూర్ఛలఁ బొందు టుచితమే నీకు
భూతలంబున రాజపుత్రుల గెలిచి
నాతోడి యుద్ధంబునకు వచ్చితిట్లు
వారల గెలిచిన వడువున నన్ను
నేరీతి గెల్చెద వీలావు నమ్మి
యేచిన మదమున నెందైన జనక
కాచిన మృత్యువు కడకు రాఁదగునె
వరగర్వమునఁ జేసి వచ్చితివీవు
మరల లంకకుఁ బోయి మనుటలేదింక
నీకు వరంబిచ్చి నిను బెద్ద చేసె
నాకంజభవుఁడు దా నడ్డమై నిలిచి
కావు మీతని నన్నఁ గాఁతు లేకున్న
దేవారియగు నిన్నుఁ దెగటార్చివైతు
కోరి యేతెంచి కైకొన్న యీయాజిఁ
బారక నిలువుము బంటవైతేనిఁ
బ్రళయకాలమునాఁటి పావకు శక్తి
గలిగి వెల్గొందు నా కాలదండంబు
ఇది సమంత్రకముగా నే ప్రయోగింపఁ
దుదిముట్టఁజేయు నిన్‌ దురము లోపలను
ననుడు రావణుఁడు మహారోషవహ్ని
పెనఁగొన్న నందంద పేర్చి యిట్లనియె
నోరి కాలుఁడ నిన్ను నుగ్రకృత్యమున
గారవంబునఁ గర్తగా మును బ్రహ్మ
చేసిన నన్నాడి చెనక నీవశమె
భాసుర గతిఁదపఃప్రౌఢి నే మున్ను
పాశుపతాస్త్రంబు పటునిష్ఠతోడ
నీశుచేఁ బడసితినిది నిన్నుఁ గిట్టి
నీరు సేయకపోదు నేడాజిలోన
ధీరత వాటించి తిరుగకుమింక
యమదండ మదియెంత యముఁ డననెంత
యమునికి యముఁడనై యరుదెంచినాఁడ
నిజపరాక్రమమొప్ప నీతోఁడఁ బోరి
విజయంబుఁ గైకొందు వేయును నేల
నను దశాననుఁడును నాయంతకుండు
మనమున రోషసమగ్రులై కడఁగి
వివిధోరుశక్తులు వెస నింగి ముట్ట
దివిజులు వొగడంగ దివినుండి చూడ
నీభంగి నిరువురు నేడువాసరము
లాభీలగతిఁ బోర నాబ్రహ్మ యెఱిఁగి
బంధురతేజులై పరఁగు సంయములు
గంధర్వసురసిద్ధగణములుఁ గొలువఁ
జనుదెంచె నంత నాసమరంబు వారు
కనుఁగొని వెరగందగా దశాననుఁడు
దిక్కుల నందంద తిమిరంబు విరియ
నెక్కుడు వడితోడ నిషుపరంపరలు
వెక్కసమైయుండ వింట సంధించి
మిక్కిలి కిన్కతో మృత్యువుమీఁద
నారి మ్రోయించుచు నాలుగమ్ములను
..........
లక్షించి జముమీఁద లక్షబాణములు
నక్షీణగతి నేసె నంత నంతకుఁడు
మొగమునఁ గోపాగ్ని మూఁడులోకముల
నొగిఁ గాల్పఁ జాలు నట్లొదవినఁ జూచి
యమరులు??? సురలును నాశ్చర్యమంద
యముఁ గనుఁగొని మృత్యు వనియె గోపమునఁ
నీపాపకర్ముని నేనె నిర్జింతు
నేపారఁగాఁ బంపు మేనల్గినప్డు
దశకంఠుఁడన నెంత తలఁప హిరణ్య
కశిపుండు నను మీఱఁగా లేక చనియె
ననిన సంతసమంది యంతకుఁడతని
నని నేన చంపెదనని విజృంభించి
పొరిఁ గాలపాశంబు భూరిముద్గరము
నరుదార దుర్దముండై వెలుంగుచును
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )