| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నిక్కంబు చెప్పితి నీవు మాంధాత నెక్కడ నతడుండు నెఱిఁగింపుమనిన సర్వభూములు గెల్చి సత్కీర్తి దెసలఁ బర్వ నయోధ్యకుఁ బతియైన యతఁడు జనలోకవినుతుఁడై చనుదెంచు నిటకు ననఁగఁ గాంచనమయంబగు విమానమునఁ దొడవులు మణిగణిద్యుతులతో నింపు లడరించు దివ్యమాల్యానులేపములు దిక్కుల వాసింప దృష్టిజాలములఁ జిక్కింపఁ జాలిన చెలువంబు మిగిలి మాంధాత చనుదెంచె మహిమతోఁ బఙ్క్తి కంధరుఁడును వరగర్వితుండగుచుఁ గదిసి భూవర నాకుఁ గయ్యమీవలయు మదవృత్తిననుటయు మాంధాత నవ్వి బ్రదుకనొల్లకయున్న పౌలస్త్య నీవు కదనంబు నాతోడఁ గావింతుగాక మాటలేటికినన్న మాంధాత పలుకు పాటిసేయక నవ్వి పఙ్త్కికంధరుఁడు మనుజేంద్ర వరుణుని మది లెక్క సేయ ధనదుఁ గైకొన దండధరుని నే నెఱుఁగ నాకనాయకు మెచ్చ నరుఁడైన నిన్నుఁ గైకొందునే యంచుఁ గనలు కోపమున సమరదుర్మదులైన సచివులఁ బనుప నమితవిక్రములైన యానిశాచరులు శరవృష్టి గురిసి రాజననాయకుండు నరిది బాణములు ప్రహస్తునిమీఁద జవమార శుకుమీఁద సారణుమీఁద నవిరళోద్ధతి విరూపాక్షునిమీఁద నొగి మహోదరుమీఁద నుద్దామబాహుఁ డగు నకంపనుమీఁద నందంద వఱసి తగిలిన కిన్కతోఁ దనమీఁద మఱియు నొగిఁ బ్రహస్తుం డేయు నుగ్రబాణములు పెల్లుగా వెస మింటఁ బెనుమంట లెసఁగ భల్లంబు లడరించి బలువిడిఁ ద్రుంచి కార్చిర్చు మిడుతల గమి నేర్చు కరణిఁ బేర్చి తోమరములు భిందివాలములు శక్తులు లోనుగా సకలాయుధముల రక్తధారలతోడ రాక్షసుల్ గూలఁ గర ముగ్రగతివైచి కడిమిమై క్రౌంచ గిరి నఱకిన కార్తికేయు చందమున నలుక రావణు వక్షమట యుచ్చి పార బలువిడితో నైదుబాణంబు లేసి కనలు ముద్గరమెత్తి కడువడిఁ ద్రిప్పి వినువీథి కెగయంగ వెస వైచుటయును వెస దానిపాటున వివశుఁడై వ్రాలి ముసరి యాహా రవంబులతోడి తన్నుఁ గనుఁగొని రాక్షసుల్ గడుభీతిఁ బొంది మనములఁ జింతింప మఱపుతో నుండి యొక్కింత దడవున కొయ్యనఁ దెలిసి యక్కజంబుగ నిల్చి యాదశాననుఁడు పెక్కుబాణములేసి భీతిల్లఁ జేసి చిక్కించి యాతేరు చెక్కలు చేసి చక్కాడి హయములఁ జంపి కోపమున వెక్కసంబుగ నిట్లు విక్రమించుటయు విరథుఁడై మాంధాత విపులరోషమున నురుతరరోచుల నొప్పారు శక్తి ఘంటికాఘణఘణత్కారముల్ చెలఁగ మంట లర్కాంశుల మారుమగ్గింప నంకించి వైచిన యతులశూలమున లంకాధిపతి దాని లఘులీలఁ ద్రుంచె నంతకాకృతి నేచి యలుకతోఁ జూచి యంతకు చేఁగొన్న యమ్ము సంధించి వింతకన్మూఁతతో వివశుఁడై యొఱుగ నెంతయు వడి నన్నరేంద్రుని వైచె నంత రావణుమంత్రు లందఱు నార్వ నంతలో నతఁడును నామూర్ఛఁ దెలిసి యంతకంతకు దట్టమై దిగంతముల నంతరిక్షమునఁ బెల్లడరులు చెదరఁ బొరి పొరి పుంఖానుపుంఖముల్ గాఁగ శరసంఘముల నిశాచరునిపైఁ బఱప సర్వదిక్కులు నిండఁ జండకాండముల మౌర్వీరవంబుల మార్గణధ్వనులఁ గలఁగిన వారాసి గతి గానఁబడఁగఁ జలియించి రావణు సైన్యంబు గలఁగ లలి నంత మనుజేశ లంకేశు లంత బలువిడి నన్యోన్యబాహుదర్పములు సరిఁ జెల్ల నిరువురు జయకాంక్షులగుచు బెరసి యొండొరుమీఁదఁ బెక్కు బాణములు గరిగరి దాఁకంగఁ గడువీఁకఁ బఱసి నెరిఁ బరస్పరబాణనిష్ఠురహతుల నరుదార జర్ఝరితాంగులైరపుడు పరుషరోషంబునఁ బఙ్త్కికంధరుఁడు వెలుఁగు రౌద్రాస్త్రంబు వెస నేయ దాని నిలిపి భూపాలుఁ డాగ్నేయబాణమున గంధర్వబాణంబుఁ గడఁకతో వింట సంధించి యానిశాచరు నేయుటయును వడి మానవేంద్రుండు వారుణాస్త్రమున నెడలించి బ్రహ్మాస్త్రమెత్తె నెత్తుటయు నాచందమంతయు నాత్మయోగమునఁ జూచి యప్పుడు పులస్త్యుఁడు గాలవుండు నచటికి నేతెంచి యని మాన్చి వారి నుచితవాక్యమ్ముల నొక్కటిఁ జేసి రయమునఁ జనిరంత రజనీచరేంద్రుఁ డయుతయోజనమాత్ర మటు మీఁది కెగసి |