| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యందంద రుచిజాల మడరంగ వెలుఁగు చందురుఁ జూచు నాసమయంబునందు రోలంబకులనీలరుచిఁ బొల్చు కచము బాలచంద్రుని బోలు ఫాలరేఖయును సోముఁడు కామారిసూడు సాధింపఁ గాము నమ్ములు విల్లుఁ గైకొన్న కరణి మురిపెంబు నిండారు ముఖమండలమున సొరిది చెన్నగు వాఁడి చూపులు బొమలు యవిరళరేఖమై నమరంగఁ బొల్చు నవకుందకళికల నవ్వుదంతములు పానాభిరతిఁ దన్నుఁ బట్టినవారి మానుపఁ జాలని మధురాధరంబు కందుసుధాధారఁ గడిగిన వెలుఁగు నిందుబింబముతోడ నెనవచ్చు మోము కంబుసన్నిభమైన కంఠంబు పసిఁడి పంబిన??? జిగిమించు బాహుమూలములుఁ గరమొప్పు నవపుష్పకాంతిఁ జెన్నారు కరపల్లవంబులు గల బాహులతలు నిండారు పెంపున నిక్కి క్రిక్కిఱిసి యొండొంటితో రాయు నురుకుచద్వయము నారు చెన్నారుట నాస్తివాదమున కారంగ నవకాశమైన నెన్నడుము రోమావళీధూమరుచిరమై కాము హోమకుండముక్రియ నొప్పు నాభియును మదను జయోత్సవమహిమ సూచించు కదళికాయుగళంబు గతి యూరుయుగము రతిరాజవర తపోరాశినాఁ దనరు నతిదీర్ఘమేఘలంబగు నితంబమును భావజు వాటించు పసిఁడితూణికల కైవడి చిత్తంబుఁ గలఁచు జంఘలును జిత్తంబు లలరంగ జిగుళుల గడచు మెత్తని యడుగులు మెఱుపారు నడుపు కనకరేఖాకాంతి గడగడ పఱచు తనువల్లికయు వీణఁ దలఁపించు నెలుఁగు చెన్నారు నప్సరస్త్రీలలోనెల్ల మున్నెన్నఁదగు జగన్మోహనస్ఫురణ చారులక్షణకళాసౌభాగ్యవతుల కార యనుపమాన మగుచున్న రంభ యున్నత స్తనకుంభయుగళభారమున నన్నువు కౌఁదీగె యసి యాటకులికి చెలువున సేమంబు చింతించెననఁగ గొలఁది భూషణములు కొమరారఁ బూని కొన్నియు విరులొప్పఁ గొప్పునఁ దుఱిమి సన్నపు నునుబూఁత చదునుగాఁ బూసి కట్టిన పుట్టంబు కప్పు దన్గప్ప మెట్టుచో మట్టియల్ మెలపునఁ దాఁక మనసిజమంత్రంబు మఱవక లోన మునికినట్లందియల్ మొగినొయ్య మొఱయ నవిరళగతిఁ గాముఁ డమరించు కోలు దివిరి యాకెంగెలు దీప్తి రాగిల్ల వలనొప్ప మన్మథధ్వజ మీనరుచుల గెలిచి దృష్టులు భీతి గెలఁకులఁ బొలయఁ దాలిమి దూలించి తావి లేజెఁమట .......... తరళభావంబగు తమకంబుతోడ నరుగంగఁ బొడఁగని యడ్డ మేతెంచి నలినసంకోచంబునకు మ్రోయు మధుప వలయంబు గతి రత్న వలయంబు మెఱయ బిగియాఱఁ గెంగేలు పెనుగేలఁ బొదివి మొగము దప్పక చూచి ముదముతోఁ బలికె నీగతి రంభ నీ వెవ్వనికడకు భోగింపఁ జనియెదు పుణ్యుఁడెవ్వాఁడు కలికికన్నులు నల్లగల్వల నవ్వు పొలఁతి పున్న మచంద్రుఁ బోలు నీ మోము అధరామృతము నింద్రుఁ డమరంగఁ గ్రోలు విధమునఁ గ్రోలెడు విటవీరుఁడెవఁడు పాఠీనలోచన పసిఁడికుంభముల కాఠిన్యకాంతులఁ గడుఁ గీడుపఱపఁ జాలు నీవట్రువచన్ను లేధన్యుఁ డాలింగము సేయ నర్హుఁ డెవ్వాఁడు కాంచనచక్రంబు గతినొప్పి రత్న కాంచిఁ జెన్నారు నీ ఘననితంబమున నెయ్యంబు సలిపెడి నేర్పరి యెవ్వఁ డియ్యొప్పుగల నీకు నెవ్వఁడు కోర్కి జగదేకశుభగుండ చతురుఁడ ఘనుఁడఁ దగునె కామిని నన్ను దాఁటి నీవరుగఁ దనుమధ్య యీశిలాతలమధ్య మొప్పు ననురక్తినిందు నన్నలరింపఁదగుదు సకలలోకంబులు శంకిప లంక నకలంకగతి నేలునట్టి రావణుఁడ వెడనింటివానికి వెఱచి నిన్నభయ మడుగఁగ ముకుళితహస్తుఁడైనాఁడఁ గైకొని రతికేళిఁ గాంతు గాకనిన నాకంపమునుబొంది యతనితో ననియె నాకు మామవు నీవు నక్తంచరేంద్ర నీకుఁ గోడల ముట్ట నీతియె తలఁప భయము నాకొండెడఁ బాటిల్లకుండ దయతోడ రక్షింపఁ దగియెడు నీవ విరసంబుగా నిట్లు వీనులు చొరని పరుసంపు పాపముల్ పలికితివనుచు విన్ననై వదనారవిందంబు సాఁచి యున్న యద్దశకంఠుఁ డుత్కంఠ మిగుల నెక్కడి కోడల వేపుత్రునాల వెక్కడి మామ నే నెలనాఁగ నీకు నీకేల బొంకన్న నీయన్న ధనదుఁ డాకుబేరుని పుత్రుఁడగు గుణోజ్జ్వలుఁడు నలకూబరుఁడు నాకు నాథుండు గాఁడె .......... యతనికి నేగూర్తు నాతఁడు నన్ను మతి ననురక్తుఁడై మన్నించియుండు గైసేసి యాతనికడకు నేఁ జనఁగ దోసంబుఁ దలఁతు వే దోషాచరేంద్ర యిదియేల తడసెనో యింత ప్రొద్దనుచు నెదురుచూచుచునుండు నింతకుఁ బ్రియుఁడు ప్రొద్దువోయెను నన్నుఁ బొమ్మను నీవు పెద్దలు నడచిన పెనుత్రోవ నడువు మారయ నధికుండవైనను నీవు నీరు వట్టైనచో నేయి ద్రావెదవె యనుడు నప్పౌలస్త్యుఁ డనియె నీదిట్ట తనము వేశ్యలకెందు ధర్మంబుగాదు వెలయాలుఁ జెలమయు వీథియు వనముఁ జలిపందిరయు సర్వజనులకు సమము లంజ యెవ్వని యాలు లలన యీ మేర కంజనేటికి నీకు నప్సరాంగనలు కాముదీమంబుల కరణి కాముకుల తామసంబున ముంచి తమకంబు పెంచి వలరాజు వలకు దీవలఁతురుగాక వలఁతురె మదిలోన వారకామినులు కుటిలంపుఁ గనుబొమల్ కొమరారు విండ్లు పటుకటాక్షంబులు బాణజాణములు భామినిపలుకులు బాణమంత్రములు కాముకచిత్తముల్ ఘనశరవ్యములు గా లీలమెలఁగు నిన్గనుగొన్న మీఁదఁ దాలిమి గలుగునె తనుమధ్య యనుచు లాఁతి మించుల చూపు లలిత కక్షములుఁ బ్రాఁతి చన్నులు దోఁపఁ బయ్యెద దొలఁగఁ బలువిడి నంటఁగఁ బట్టి పూఁగొమ్మ నలఁచి నట్లాలింగనంబుఁ గావించి కుంభికుంభస్థల గురునితంబమును రంభానిభోరులు రణితమేఖలయు గంభీరనాభియుఁ గడుకాంక్షఁ బెనచి సంభోగ మిమ్ముల జరపి పొమ్మనియె నంత నారంభయు నంభోజసరసి దంతి సొచ్చిన చొప్పుఁ దనకు వాటిలిన చింతాపరంపరల్ చిత్తంబులోన నంతకంతకు దట్టమై గడల్కొనఁగఁ దలఁకుచుఁ గొంకుచుఁ దనలోనఁ దాను బలుకుచుఁ బులిబారిఁ బడి విడివడిన |