| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
విజయంబు గైకొని వెస నింద్రుపట్టి భుజబలాటోపంబు పొలివోవఁ గట్టి తన సేనలోనికి దర్పంబుతోడఁ గొనిపోవ నది గనుంగొని దివౌకసులు తేరు గానఁగవచ్చు తేరుపై నెన్న శూరుఁ గానఁగరాదు సురల కెవ్వరికి నీమహారథుఁ గాన నెబ్భంగి వచ్చు నేమి సేయుదుమింక నిదిదైవవశము అనుచున్న మాయావియగు నింద్రజిత్తు జెనయ శక్తులుగాక చింతించి చూచి శక్రుచే విడివడి చాల లజ్జించి విక్రమక్రీడకు విముఖుఁడైయున్న దశకంఠు బలువిడి దాఁకి నొప్పించి రశనిసంకాశములైన బాణముల నప్పు డీరణకేళి నలసిన తండ్రిఁ దప్పక చూచి యాదశకంఠు సుతుఁడు విజయంబు గైకొని విచ్చేయు దేవ నిజమైన నా గెల్పు నీ గెల్పుగాదె యనుడు దశగ్రీవుఁ డాయగ్రతనయు వినయధీరోక్తులు విని సమ్మదమున మరలె లంకకుఁ దమ మందిరమునకు నరిగిరి హీనులై యఖిలదేవతలు లంకాభిముఖుఁడైన లంకాధిపతియు సంకులధ్వనులతో సామజంబులును వడి రథంబులు హరుల్ వరవీరభటులు నడుచునప్పుడు మేఘనాదు నీక్షించి పౌలస్త్యకులవార్ధిపరిపూర్ణచంద్ర నీ లావుబలిమిచే నిఖిలదేవతల దేవేంద్రు గెలిచితిఁ దృణలీల నింద్రు నీవేగమున గెల్వ నేవీరుఁ డోపు భూరివిక్రమ నీవు భువనంబులందు శూరోత్తముఁడవంచు సుతు గారవించి యాతుధానులు గొల్వ నమరేంద్రుఁ గొనుచు నీ తేరుముందట నీవు వోనిమ్ము బలముతో మంత్రులు బలసి యేతేర నెలమి నేతెంచెద నేను నీవెనుక నని నియోగించిన నమ్మహాబలుఁడు జనకు వాక్యములకు సంతోషమంది నానాజయధ్వనుల్ నభమంది మెఱయ సేనాముఖంబున జెలరేఁగి నడచె నంత దశగ్రీవుఁడటులంకఁ జొచ్చి సంతోషముననున్న సమయంబునందు సురసమూహముతోడ సురవైరిపురికిఁ బరమప్రియంబునఁ బరమేష్ఠి వచ్చి |