| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
హనుమంతు చేసిన యంత కార్యంబు ధనదుఁడు సేయఁ డంతకుఁడు సేయండు విష్ణుండు సేయండు విబుధేంద్రుఁడైన జిష్ణుండు సేయండు సేయరెవ్వరును ననవుడు రఘురాముఁ డావాక్యములకు మునినాథుఁ గనుఁగొని ముదముతోఁ బలికె నితని కారణమున హితసంగమంబు వితతంబుగాఁ గంటి విజయంబుఁ గంటిఁ బడియున్న లక్ష్మణు ప్రాణముల్ మగుడఁ బడయంగఁ గంటి నా బంధులఁ గంటిఁ జాల విభీషణు సకలధర్మములు పాలింప లంకకుఁ బతిఁ జేయఁ గంటి నే నయోధ్యాపుర మేలఁగఁ గంటి జానకితోఁ గూడ సౌఖ్యంబుఁ గంటి నా కెల్లమేలు నీనగచరోత్తముఁడు గైకొని కావించెఁ గడుఁ బ్రీతితోడఁ దలపోయ నీతఁడు తప్పించి యొరుల కలవియే వైదేహి నట పోయివెదక నని పల్కి వెండియు నంజనాతనయు విను వేడ్క కుంభజు వీక్షించి పలికె వాలిన పగవారు వాలిసుగ్రీవు లోలి నెప్పుడుఁ బోరుచుండఁగా నితఁడు తృణలీల నేల నాదేవేంద్రుతనయు రణభూమిఁ గూల్పఁడా రవిసూనుఁ డలరఁ దన లావు నాఁడేల తానెఱుంగండొ తనకు నిష్టుండైన తపననందనుఁడు వాలిచేఁ గడుఁదూలి వగఁ గూఱునతని నేల యుపేక్షించె నెఱిఁగింపుమనుచు హనుమంతు మోముపై హస్తంబుఁ జేర్ప వినఁగ నగస్త్యుఁ డవ్విభునితో ననియె గతియందు మతియందు ఘనశక్తియందు నతులితుండైన యీ హనుమంతునందుఁ బరికింపఁగా నెంత పౌరుషంబైన ధరణీశ గల్గుట తథ్యంబు వినుము మునిశాపమున వీరముఖ్యుఁ డీఘనుఁడు తన లావు దెలియక తానుండుఁ గానఁ జాలంగ భుజసత్త్వసంపన్నుఁడయ్యు వాలి నాలములోన వధియింపఁడయ్యెఁ బరికింప నిమ్మహాబలుఁడు బాల్యమున నరుదారఁ జేసిన యాపరాక్రమము వినుతికెక్కెడు నీవు వినఁగోరెదేని వినిపింతు సకలంబు విశదంబుగాఁగ నిరవందఁ గనకాద్రి నీతని తండ్రి గిరిచరోత్తముఁడైన కేసరియుండు నతనికిఁ బత్నియై యంజనాదేవి సతతంబుఁ బతిభక్తి సకలంబు సేయ నతని కపత్యంబు నట్ల లేకున్న మతి విచారించి యమ్మగువ పుత్త్రార్థి పటుతరభక్తితోఁ బవనుని గూర్చి యటఁ బుంజకస్థలి నతిఘోరతపముఁ గావింప నెఱిఁగి యాగంధవహుండు వేవేగ నేతెంచి వెలఁది నీక్షించి యెలనాఁగ తపమున కెంతయు మెచ్చి తలవడ నీయిష్ట మది గోరుమనిన ననువంద నంజనయాత్మఁ బెంపొంద ననఘాత్మ నీదయ నఖిలలోకముల జనులు దేవతలును సంస్తుతి సేయ ఘనపరాక్రముఁడనఁగా విలసిల్లు తనయుని నతిబలోద్ధతుఁ గృపసేయు మనవుడుఁ గరుణించి యట్లకాకనుచు గౌరీశుఁడిచ్చిన గర్భవృత్తాంత మారామ కెఱిఁగింప నాత్మలోఁ దలఁచి |