| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
ప్రథమయుగంబున బ్రహ్మణ్యమగుచు పృథుశక్తి మధువను పేరి రక్కసుఁడు మతిమంతుఁడై దాను మహితుఁడై దేవ హితుఁడై చరింపుచు నిందుశేఖరుని చండతపోనిష్ఠ సంతుష్టుఁ జేయ నిండారు కరుణ నానిఖిలైకవిభుఁడు సునిశితంబగు తన శూలంబువలన ఘనశూలమొక్కటి కడఁగి నిర్మించి యిది నీకు వరముగా నిచ్చెద దీని పదిలంబుగా నీవు పట్టి భరింపు తిరముగా దేవభూదేవతాభక్తి గరమొప్ప నెందాక గలుగు నందాక బనిసేయు నిది సురబ్రాహ్మణద్వేష మొనరింపుడును ద్రుంచు నొగి నీకులంబు పైవచ్చు బగవారిపై వైవ నతని వావిరి దునుమాఁడి వచ్చు నీకడకు ననవుడు నా వరం బద్దేవువలన మనమారఁ గైకొని మధువు గేల్మొగిచి యెలమి మాకులమునకెల్ల నీవరము గలుగంగ పరమేశ గరుణింపుమనిన నీ వెన్క శూలంబు నీ తనూజునకు నా వెన్క బనిసేయ దన్యులెవ్వరికి శూలంబు దాల్చిన శూరుఁడెందాక వాలు నందాక నవధ్యుఁడై మెలఁగు నని చెప్పి గౌరీశుఁ డఱుగంగ నచట నొనరఁగ మధుపురం బొకటి నిర్మించి యనఘాత్ముఁ డగుచున్న యావిశ్రవసువు తనయ గుంభీనస దశకంఠు ననుజ నిమ్ముల సాహస మెచ్చంగఁ దెచ్చి గ్రమ్మర యట పత్ని గాఁగ వరించి కొంతకాలమున కాకొమ్మయం దెలమి సంతానకాముఁడై చరియింపుచుండ లవణుండునా నొక్క లఘుచరిత్రుండు భువనకంటకుఁడైన పుత్రుఁడు బుట్టె నారాక్షసుండంత నాపుత్రుఁ జూచి ఘోరపాపుఁడు వీఁడు కొడుకయ్యెననుచు చిత్తంబులో చాల చింతించి యతఁడు చిత్తజాంతకుచేత చెన్నారఁ గన్న ఘనశూలమిచ్చి యాకథయు నీచంద మని చెప్పి వరుణాలయంబున కఱిగె నదిమొదలుగా నాతఁ డాశూలమహిమ నొదవు దర్పముతోడ నుగ్రుఁడై మండి మూఁడులోకంబులు మొగి నేలుచున్న వాఁ డుగ్రకర్ముఁడై వారింపఁబడక మానక గారించు మము విశేషించి వాని బాధలు పెద్ద వసుధలో నధిప యఱయంగ నాశూల యతులప్రభావ మఱుదు లోకములోన నతని విక్రమము పరగ మాచే వాని బాధలు వినియు ధరణీశు లెవ్వరుఁ దలలెత్తరైరి మాకు శరణ్యులు మరి మీరె కాన గైకొని మునిరక్ష గావింపవలయు పౌలస్త్యకులముఖ్యుఁ బరుషప్రతాపు త్రైలోక్యకంటకు దశకంఠు నలఁగి యనిలోన పుత్రమిత్రాదులతోడ దునుమాడి జగముల దుఃఖంబు లుడిపి విచ్చేయుటంతయు వినివిని బాధ లచ్చుగా నెఱిఁగింప నని యేము రాక యనుడు నావాక్యంబు లతిభక్తి తోడ విని పల్కె నారఘువిభుఁడు కేల్మొగిచి |