ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
మార్గమధ్యంబున వాల్మీకి శత్రుఘ్నునకు పూర్వరాజగు మిత్రసహుని చరిత్ర చెప్పుట
వసుధీశతనయ మీవంశంబునందు
వసుధ సుధాంశుడన్‌ వాఁడు వర్తించు
మహితతేజుండు మతిమంతుండు మిత్ర
సహుఁడన నితనికి జనియించెఁ గొడుకు
మృగయావినోదంబు మెయినుండి యతఁడు
మృగముల నందంద మ్రింగు రక్క సుల
ఘోరకోపాధుల క్రూరవర్తనుల
దారుణాకృతుల గాంతారమధ్యమున
నిరువురఁ బొడగాంచి యచ్చోట మృగము
లరుదార వీరిచే నడఁగె నంచలిగి
క్రొవ్వాడిబాణంబు గొనుచు నందొకని
దవ్వులఁ బడనేయ దక్కినవాఁడు
యామిత్రసహుఁ జూచి యనపరాధంబు
నామిత్రుఁ జంపితి నరనాథ నీవు
మఱువకు నాచేయు మా ఱెగ్గునిట్టి
తెఱఁగు సుమ్మనుచు నదృశ్యుఁడై చనియె
నంత నారాజు నీయాశ్రమవనము
చెంత నధ్వరభూమి చెలువొందఁ దీర్చి
సకలదానక్రియాసామగ్రితోడ
నకలంకమగుచున్న యశ్వమేధంబు
బహుకాలవర్తియు బహుమంత్రయుతము
బహుదానదక్షిణాస్పదమునై వెలుఁగ
నమరులు గావించు నధ్వరమునకు
సమమగుచున్న యాజన్నంబు నిండ
గావించుచున్నెడఁ గపటవసిష్ఠుఁ
డై వచ్చి యలనాఁటి యారక్కసుండు
తన పూర్వవైరంబు దలఁచి చిత్తమున
కనలెడు చందంబు గానరాకుండ
నానరేంద్రుని జూచి యవనీశ నాకు
మానసంబలరంగ మాంసభోజనము
బెట్టింపు మనవుడు ప్రియమైనఁ జాలు
నట్లు సేయించెదనని వేట్కతోడ
నట బాలు బిలుపింప నటపోయి వాఁడు
యట బాలుఁడై వచ్చి యచట నిలుచుటయు
నీ చేతి నేర్పార నేఁడు మాంసంబు
పాచకోత్తమ నీవు పక్వంబు చేసి
వే నీవు దెమ్మన్న విని వాడు నలరి
మానసి??? జంపి యా మాంసంబు వలయు
బరికరంబులతోడ పసనుగా వండి
నరనాథ తెఁచ్చితినా నతఁడలరి
తన దేవియును దాను తగ వసిష్ఠునకు
ననురాగమున దెచ్చి యామాంసమిడిన
నమ్మునిపుంగవుం డాతెఱంగెల్ల
గ్రమ్మర బరికించి కడునల్గి పలికె
భూనాథ సాహసంబున నాకభోజ్య
మైన మాంసంబు బెట్టి తౌనుగాదనకఁ
హింసజేయుచు భూతహితబుద్ధి లేక
మాంసభక్షకుఁడవై మహి నీవునుండు
మని శాపమిచ్చిన నావాక్యమునకు
వనితాసమేతుఁడై వణకుచుఁ బలికె
ననఘాత్మ మును మాంసమడిగితి వీవ
చనునె యివ్విధమున శపియింప ననిన
నారసి మదిలోన నతిపాపుఁడైన
యారక్కసుని చేతలని విచారించి
ధరణీశ నాపల్కు తప్ప దీశాప
మరయబండ్రెండేండ్ల యందాక ననిన
జననాథుఁడును మారు శపియింపఁ దలఁచి
కనలి చే శాపోదకము లందుకొనిన
నారాజుదేవియ నవనీశుజూచి
యోరాజ యిది నీకు యుచితంబుగాదు
జననాథ యొడయఁడీ సంయమీశ్వరుఁడు
మనకెన్ని విధముల మాననీయుండు
దేవతాసదృశుఁ డీతేజోధనుండు
భావింప మనచేతఁ బడువాఁడుగాడు
విడువు మీకోపంబు వెరవు గాదనుచు
నుడివిన చేతి విల్లొయ్యన వదల
నానీటి చిచ్చున యడుగులు మాడి
యైన కల్మషమున నామిత్రసహుఁడు
బ్రాతిగా కల్మాషపాదుడన్‌ పేర
నాతతగతినొప్పె నదిమొదల్‌ గాఁగ
నటమీఁద నారాజు యాగంబు నడగె
నటు గాని యిది నాటి యజ్ఞవాటంబు
యనుచు నావృత్తాంత మంతయుఁ జెప్ప
విని మనంబున జాల విస్మితుండగుచు
మునినాథునకు మ్రొక్కి ముదమొప్ప వచ్చె
దన పర్ణశాలకు దశరథాత్ముజుఁడు
నాలోన సీతయు నర్కేందుయశుల
బోలంగ నిరువురు పుత్రులుగన్న
పరతెంచి యా మేలుపల్కు వాల్మీకి
కెఱిగించి మునినాథ యీకుమారకులు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )