ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శత్రుఘ్ను డన్నలతో లవణాసుర వధ వృత్తాంతము చెప్పుట
పాదపద్మములకు ప్రణుతుఁడై నిలచి
మేదురద్యుతులతో మించు రత్నములు
కానుకగా నిచ్చి కరములు మొగిచి
యేను మీయానతి నేగి యాలవణు
ననిలోన సమయించి యతఁడేలు పురము
పనిబడి యక్కించి పరిపూర్ణమైన
దేవదేవుని బాసి దీర్ఘకాలంబు
గావున మిముచూడగా వేడి రాక
యీయేటితోఁ గూడ నేడులు మనుజ
నాయక బండ్రెండునగు మీరు బనిచి
యావు బాసినయట్టి యాక్రేపు పగిది
భూవర మిముఁ బాసిఁ బోయి నాయునికి
నావుడు జిరునవ్వు నవ్వి యోవత్స
నీవు బాలుఁడవు నిన్నెడబాయగలమె
మక్కువ నీమీద మాకు నమ్మలకు
నిక్కువ మటుగాన నిడివిగానేల
తలపైన యపుడెల్ల తగ నీవయోధ్య
కెలమితో వచ్చి మమ్మెల్ల గన్గొనుము
ప్రజల బాలింపుట పరగ రాజుల
నిజధర్మమని కాదె నిను బంపవలసె
పరిపాలనక్లేశభాజనుల్‌ గాగ
పరికింప నేసఖుల్‌ పార్థివోత్తములు
యమ్మల వగ పేద నైదునాళ్ళుండి
యిమ్ముల నీపురికేగు నీవనిన
ధరణీశు నానతి తగ బూని వినుచు
భరతలక్ష్మణులకు పరిపాటి మ్రొక్కి
పయినంపుదినమున పార్థివేశ్వరుఁడు
ప్రియమార వీట్కొల్ప బెంపొంద వెడలి
బరువడి తల్లుల భరతలక్ష్మణుల
పరిపాటి వీట్కొని భరతలక్ష్మణులు
తగుసేనతో గూడ తన్నంపరాగ
మగుడించి యతఁడేగె మధుపురంబునకు
నంత నిక్కడ రాముఁ డవనీతలంబు
సంతసంబున నేలు సమయంబునందు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )