ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
కుశలవులు రాముని చెంత రామాయణము పాడుట
డని పల్క వారలు నారాత్రి వేగ
ఘననిష్ఠ దమ నిత్యకర్మముల్‌ దీర్చి
మరునాఁడు మఖవాట మధ్యరంగమున
నెరయంగ మునులతో నెమ్మి కొల్వున్న
మనుజేంద్రు ముందట మధురనాదముల
నొనగూడుకొని వీణె యొప్పుగా మ్రోయ
జదువంగ దొణగిన జనలోకనాథుఁ
డది తన చరితమై యనవద్యమగుచు
పద్యబంధముగల్గి పావనార్థముల
హృద్యంబు గావున నింపార వినుచు
మదిలోన వెఱగంది మధురప్రసన్న
వదనుఁడై చేసన్న వారి వారించి
సముచితానుష్ఠాన సమయజ్ఞుఁడగుచు
నమరంగ నేమంబు లన్నియు దీర్చి
యెలమిమై గొలువిచ్చి యెల్లసంయముల
బొలుచు భూపతులను బుధులనేకులను
పౌరాణికుల శబ్దపారీణులైన
వారలనెల్లను వరుస తోడుతను
రప్పించి యాకుమారకులఁ బిల్పించె
తప్పక సభవారు తగ వారిఁ జూచి
నారచీరలు జడల్‌ నవభంగిగాని
వీరు రామునియట్ల విలసితాకృతులు
నడుపు గాంతియు జూపు నవ్వును నెలుగు
నొడలి చందముజూడ నొక్కరూపనఁగ
చతురులై యారామచంద్రుని యెదుర
ప్రతిబింబయుగళంబు భంగి గూర్చుండి
సన్ను తవిజ్ఞానసరణి నారదుఁడు
మున్నుఁ జెప్పిన సర్గ మొదలుగా దొణఁగి
సరి నొప్పు నిరువది సర్గల లెక్క
సరసంబుగాఁ గూడి చదువుచునుండ
పరగ సువర్ణముల్‌ పదివేలు మఱియు
కరమొప్పఁ బేర్కొన్న కామితార్థములు
భరతు నిమ్మని పల్కిఁ బనుపంగ వారు
దరహసితాస్యులై ధరణీశుఁ జూచి
యనఘాత్మ కందమూలాహారనియతి
వనముల నియతిమై వర్తించు మాకు
హేమప్రతిగ్రహ మిదియేటికనిన
నామహీనాయకుం డావాక్యములకు
నల్లన నవ్వుతో నాసభాసదుల
నెల్ల గనుంగొని యెలమితోఁ బలికె
నెవ్వరి చరితమై యీ కావ్యమమరు
నెవ్వరు జేసినా రిది యెంతఁ గలదు
పేరేమి దీనికిఁ బ్రియమార నాకు
నారసి యెఱిగింపుడని వారినడుగ
యిది నీదు చరితమిది యుర్వి మున్‌ సర్వ
విదుఁడైన వాల్మీకి విరచించె దీని
నేనూరు సర్గల నిదియెల్ల నాఁడు
మానుగా బరగు రామాయణంబనఁగ
విను మీకుఁ బ్రియమైన విందుగాకనిన
వినియెదమని వారి వీడుకొల్పుచును
మనుజాధిపతి యజ్ఞమంటపంబునకు
మునిజనంబులతోడ ముదమార నరిగె
ప్రతిదినంబును నిట్లుఁ బరిపాటితోడ
కత పెక్కుదినములు కడుఁ బ్రీతి వినుచు
వీరు సీతాసుతుల్‌ వీరినామంబు
లారయ గుశలవులని యప్పుడెఱిఁగి
తనలోన నొక్కింత తడవు చింతించి
జనలోకనాథుఁ డాశత్రుఘ్నుఁ జూచి
యీసమీరణి యీసుషేణుండు
యీవిభీషణుఁడును నెలమి నల్గురును
వాల్మీకి కడకేగి వైదేహి విగత
కల్మషయగునేని గనుగొంటి నేఁడు
నీలోకజనులకు నెల్ల తెల్లముగ
బోల విశ్వాసంబు బుట్టంగవలయు
జనకరాజాత్మజ చాలినమాట
వినివచ్చి చెప్పుఁడా విధము నాకనిన
నగుగాక యని వాఁడు నటపోయి మ్రొక్కి
జగతీశు మాటలా సంయమీంద్రునకు
వినుపింప నప్పుడు విని సంతసిల్లి
మనుజేంద్రుమాటలు మాననీయములు
భావింప సతులకు పతియ దైవంబు
కావింప తనపల్కు గావింపవలయు
చనుఁడన్న వారు నాజననాథుకడకు
చనుదెంచి చెప్పి రాసత్యవాక్యములు
వారి మాటలు విని వసుమతివిభుఁడు
మీరెల్ల నెల్లి వాల్మీకి యెదుర
శుద్ధిగా వైదేహి శోధింపుఁడనుచు
నిద్ధవాక్యంబుల నేర్పడఁ బలికి
సంతోషమున సభాసతుల వీట్కొలిపె
నంత భానుఁడు గ్రుంక నారాత్రి చనిన
మరునాఁడు కొలువుండి మహితతేజమున
వరలు వసిష్ఠుని వామదేవునిని
నోలిఁ బర్వతు బులహుని శతానందు
గాలవు కశ్యపు గార్గ్యు దూర్వాసు
చ్యవను మౌద్గల్యు విశ్వామిత్రుఁ గలశ
భవు నక్షపాదుని భార్గవు గణ్వు
సుమతి మార్కండేయు సువ్రతు శక్తి
నమరర్షిపుంగవుఁడైన నారదుని
సకలమునీంద్రుల సకలభూపతుల
సకలవానరులను సకలరాక్షసుల
వరుస జన్నమునకు వచ్చి మున్నున్న
పరదేశములవారిఁ బౌరులఁ బ్రజల
వీరువారన కెల్లవిధములవారి
నారంగ రప్పించె నాస్థానమునకు
నప్పుడు తలవాంచి హస్తముల్‌ మొగిచి
కప్పు శోకమున గద్గదకంఠుఁడగుచు
జనకజ వెనక రా సభకు వాల్మీకి
జనుదెంచె నట శిష్యసహితుఁడై యంత
సభవారు వైదేహి చనుదేరఁ జూచి
యభిమానవతికి నిట్లయ్యెనే యనుచు
శోకింపఁ గొందఱు జూచి యాసీత
లోకైకపావని లోకంబులోన
గంభీరులాడెడు కలుషవాక్యములు
సంభావితములె? యీసాధ్వికి ననఁగ
నిందకోడనివాఁడు నిర్జీవియనుచు
గొంద ఱారాముని గొనియాడుచుండ
జగతీశు ధైర్యంబు జానకి తెంపు
తగచూచి కొందఱు తలలూచి మెచ్చి
మేలుగావలయు భూమిజకునా గొప్ప???
కోలాహలంబయ్యె కొలువులోనపుడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )