| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
చూడవచ్చిన మహీశుల్ మొదలు గాగ వేడుక సరయూప్రవేశంబు చేసి దివ్యరూపంబులఁ దేజంబు లెసఁగ దివ్యయానములెక్కి తెరగొప్ప వెలువ నురమున గౌస్తుభ మొప్పార నాభి పరమేష్ఠి గాంచిన పంకజం బమర గరుడాధిరూఢుఁడై కరపంకజముల సరి సుదర్శన పాంచజన్యంబు లమర ననిమిష గంధర్వ యక్ష సిద్ధాదు లనురాగమును బొంది యందంద మ్రొక్క నరవిందభవుఁ జూచి యారమావిభుఁడు కరుణార్ద్రచిత్తుఁడై కడుఁ బ్రీతిఁ బలికె పరమేష్ఠి నాకు నీ ప్రజలు ప్రాణములు కరములు ప్రియమున గదలి నావెనుక శాశ్వతస్థితి గోరి చనుదెంచినారు పశ్వాదులును వచ్చె బంధముల్ బాసి యొగిఁ బుణ్యలోకంబు లొసఁగు నీవనిన తగ విచారించి యాధాత చిత్తమున నొనర నాలోకంబు నుపరిభాగమున దనరుచునున్న సంతానలోకమున నిమ్ముల జరియింపనిండంచుఁ బలికె సమ్మదం బలర నాజలజసంభవుఁడు తరుచరాదులతోటి తనుమూర్తు లమర సరి నేగి రయ్యై నిజస్థానములకు ననిమిషావలినెల్ల నంత వీట్కొలిపి దనుజారి వేంచేసెఁ దన లోకమునకు. రాజన్యవిభుఁడైన రాము తేజమున రాజిల్లుచున్న యీ రామాయణంబు నెవ్వరు పఠియించి రెవ్వరు వినిరి యెవ్వరు వ్రాయించి రెవ్వరు వ్రాసి రెవ్వరు పూజించి రెవ్వరు దలఁచి రెవ్వ రానందించి రెలమిఁ జిత్తముల నత్యంతశుద్ధాత్ములై వారు బ్రహ్మ హత్యాదులైన మహాపాతకములు నొదవిన గోవధాద్యుపపాతకములు మొదలుగాఁ గల పాపపుంజంబుఁ బాసి పితృదేవతా గురుప్రియతార్పణములు నతిథిపూజలు మహాయాగకర్మములు బహుతీర్థములు వేదపారాయణములు విహితవ్రతంబులు వివిధదానములు జపములు దపములు సత్యశౌచములు నుపవాసనియతులు నొదవు పుణ్యములు సతతంబు నొప్పార సంతోష మెసఁగ సతులు బుత్రులు హితుల్ సకలబాంధవులు ధనధాన్యములు గల్గి ధర్మముల్ గల్గి వినుతకీర్తులు గల్గి విజయంబు గల్గి యారోగ్యములు గల్గి యాయువుల్ గల్గి శూరత్వములు గల్గి శుభములు గల్గి సౌభాగ్యములు గల్గి సంపదల్ గల్గి వైభవంబులు గల్గి వర్ధిష్ణులగుచు నిలలోన సుఖియించి యింద్రలోకమున వలయు భోగంబులు వారు భోగించి వసుధఁ గ్రమ్మఱఁ జక్రవర్తులై పుట్టి రసికులై గైకొంద్రు రాజ్యసంపదలు యని చంద్రచందనహారనీహార ఘనసారసన్నిభ ఘనకీర్తిధనులు భూనుతుఁడగు కోన బుద్ధభూవిభుని సూను లుదారులు సుగుణభూషణులు ఘనుఁడు మీసరగండ కాచభూవిభుఁడు వినుతపుణ్యుండగు విఠ్ఠభూపతియు రచియించి రుత్తర రామాయణంబు రుచిరమై నిత్యమై రూఢిఁ బెంపెసఁగ నాచక్రవాళశైలావనియందు నాచంద్రతారార్కమై యొప్పుగాక. శ్రీరామచంద్రార్పణమస్తు. సంపూర్ణము. |