ఇతిహాసములు ఉత్తరరామాయణము కైకసి విశ్రవోబ్రహ్మవలన దశగ్రీవాదులఁ గనుట
కైకసి విశ్రవోబ్రహ్మవలన దశగ్రీవాదులఁ గనుట
మ.కలకంఠీమణి! నీ మనోరథము నేఁగంటిన్‌ సుతాపేక్ష నిం
దులకున్‌ వచ్చితి వైన సంజకడ నన్నుం జేరి మాటాడుటన్‌
ఖలులౌ రాక్షసు లుద్భవించెదరు నీ గర్భంబునన్‌ నావుడుం
జెలి భీతిల్లి వినీతిమ్రొక్కి వచియించెన్‌ విశ్రవోబ్రహ్మతోన్‌
133
మ.అనఘా! మూఁడవ బ్రహ్మవై విబుధలోకారాధ్యశీలుండవై
మను నీ తేజమునన్‌ జనించిన సుతుల్‌ మాంసాశులై దుష్టవ
ర్తనులై సాధు విరోధులై మెలఁగు టర్హంబే? గుణస్ఫూర్తిచే
నినుఁబోల్పందగు సత్కుమారకుల మన్నింపంగదే నావుడున్‌
134
మ.అల పౌలస్త్యుఁడు గ్రమ్మఱం బలికెఁ గన్యన్‌ - కాలదోషంబు పె
ద్దలకే కాదు విధాతకైన వశమే తప్పింప? నింకేల చిం
తిల? నీ పుత్రలయందు మేటియనఁగా దీపించు విద్యాగరి
ష్ఠులలో శ్రేష్ఠుడు బ్రహ్మనిష్ఠుఁడు గనిష్ఠుం డిందుబింబాననా!
135
కం.ననుఁబోలు బ్రహ్మనిష్ఠల
నినుఁబోలుఁబ్రతాపరుచుల నెనయు వినీతిన్‌
నినుఁబోలు నక్కుమారుఁడు
మనునాతని వలనఁగులము మనికితమేలా?
136
వ.అని భవిష్యదర్థంబు వివరించి, విరించి పౌత్త్రుండు - పుత్రకాంక్ష లావరించి తను వరించి మరులునం దీవరించిన యక్కన్యకు గర్భాదానంబు ప్రసాదించిన137
సీ.మేరుశృంగములపై మేఘముల్‌ డిగురేఖ - నాతి చూచుకములు నల్లనయ్యె
దౌహృదశ్రీ నిల్చు ధవళాంబుజము పోల్కిఁ - దెలిగింటి నెమ్మోము దెల్లనయ్యెఁ
గృశదైత్యజాతి వర్ధిలు నిట్టులనురీతిఁ - గలకంఠి లేఁగౌను బలితమయ్యె
గర్భగార్భక తనూకాంతి బైలగు లీల - విమలాంటి నూగారు విపులమయ్యె
 
గీ.నలరుబోఁడికి నొకయడు గామడయ్యెఁ
గీరవాణికిఁ జిట్టుముల్‌ దోరమయ్యె
నబ్జపాణికి మంటిపై నాసయయ్యె
సైకతశ్రోణికిఁబ్రసూతి సమయమయ్యె.
138
కం.భువనములు దలఁక మునులును
దివిజు లడల ధనుదుగుండె దిగ్గుమనఁగ రా
హువు శని మొదలగు దుర్గ్రహ
నివహము వికటస్థలమున నిలిచినవేళన్‌.
139
సీ.పిడుగుఁజప్పుడుతోడ బెడఁగు జేగురు నిండు - చాయదేఱెడు దశాస్యములతోడ
నిడుదకోఱలతోడ నెరయఁగాటుక రాసి - యైనట్టు గనుపట్టు మేనితోడఁ
జుఱుకుఁజూపులతోడ జ్యోతిర్లతారుణా - రుణములౌ కఱకు వెండ్రుకలతోడఁ
దామ్రోష్ఠములతోడ దారుణాహుల లీల - వెలయు వింశతి భుజార్గళుల తోడ
 
గీ.భయము భీభత్సమొలయు రూపంబుతోడఁ
గైకసీభామినీమణి గర్భమున మ
హోగ్రుఁడగు రాక్షసుం డొకఁ డుదయమయ్యె!
గాలకూటంబు వారాశిఁ గలిగినటుల
140
శా.ఆ రక్షోవరుఁ డుద్భవించునెడ గృధ్రారావముల్‌ మించె మే
దో రక్తంబులు మేఘముల్‌ గురిసె నందోళించె భూతావళుల్‌
భీరుత్వం బెనసెన్‌ సురౌఘములు గంపించన్‌ సృగాలచ్ఛటల్‌
భూరిజ్వాలలు వాంతిసేసె రవిదీప్తుల్‌మాసె మ్రోసెన్‌ దిశల్‌
141
కం.ఆ వేళఁ బుత్రజన్మము
భావించి పులస్త్యసుతుఁడు పఱతెంచి దశ
గ్రీవుండను పేరతనికిఁ
గావించి యథోచితంబుగా నున్నయెడన్‌
142
ఉ.వెండియు విశ్రవస్‌ స్ఖలితవీర్యమునన్‌ బలు చూలుఁ దాల్చి బ్ర
హ్మాండ విఖండనోద్భటతరార్భటి మీఱెడు వానిఁ గుంభక
ర్ణుండను పుత్రునిన్‌ సురవరుల్‌ బెగడొందఁగఁ గాంచె నంత న
య్యండజయాన శూర్పణఖయన్‌ దనయం గనియెం గ్రమంబునన్‌
143
వ.తదనంతరంబ144
మ.గుణరత్నాకరుఁ డింద్రియార్థ మరుదంకూరాహివన్యాశుశు
క్షణి విద్యానిధి విశ్రవఃకులహితాచరాశ్రయుం డార్యపో
షణ చింతామణి సర్వభూతకరుణా సంగాత్మకుండౌ విభీ
షణుఁడుం గైకసి గర్భవార్ధిఁబొడమెన్‌ సంపూర్ణచంద్రాకృతిన్‌
145
తే.గీ.ఆ కుమారత్రయంబున కాగమోక్త
మార్గమునఁ దండ్రి జాతకర్మంబు నామ
కరణమును మున్నుగాఁగల కర్మతతులు
క్రమమున నొనర్చి యుపనయనములు సేసె
146
వ.ఇత్తెఱుంగున నవ్విశ్రవస్తనూజాతు లుపనీతు లయి తండ్రి వలన నఖిల విద్యావిశేషంబు లెఱింగి చిత్రభానుత్రయసమానులును దినదిన ప్రవర్ధమానులునునై వెలయుచుండి రయ్యవసరంబున147
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju