ఇతిహాసములు ఉత్తరరామాయణము దశముఖుఁడు తన పరివారంతో లంకంబ్రవేశించి పాలించుట
దశముఖుఁడు తన పరివారంతో లంకంబ్రవేశించి పాలించుట
ఉ.అంతఁ బ్రహస్తుఁడుం జని దశాస్యున కెంతయు వేడ్క నంత వృ
త్తాంతము విన్నవింప దరహాసముతో సభవారిఁ జూచినన్‌
వింతయె నీ భుజామహిమ! వీఱిఁడియే పగఁబూన రాజరా
జింతకు గాసిగాఁడె పుర మీయకయుండిన నంచు వా రనన్‌
258
కం.అది నిజ మౌనని పలుకుచు
మదిలోన ముదంబు వొదల మంచి ముహూర్తం
బిది యని భార్గవనందను
లదురుగడన్‌ వచ్చి తెలుప నద్దశముఖుఁడున్‌
259
సీ.తన పురోవీథి మాతామహుల్‌ మదమత్త - మాతంగములమీఁదఁ బ్రీతిఁజనఁగఁ
దమ తల్లి కైకసీధవళాక్షి ముత్యాల - పల్లకిపై వారి పజ్జ నరుగఁ
దన యిరుదెసల నిద్దఱు దమ్ము లపరిమి - తానీకినీయుక్తులగుచుఁ గొలువఁ
దన వెంబడిన ప్రహస్తమహోదర సుపార్శ్వ - మారీచముఖ మంత్రిమణులు నడువ
 
గీ.దివ్యరథమెక్కి శంఖవాదిత్రవేణు
కాహళాదుల రవము లాకాశమొరయ
ఛత్రచామరకేతనచ్ఛాయ లొలయ
వింశతిభుజుండు లంకఁ బ్రవేశమయ్యె.
260
మ.అరుసం బొందుచు మాల్యవత్ప్రముఖపూర్వాదిత్యు లవ్వేళ బం
గరు పీఠంబునఁ బంక్తికంఠు నిడి లంకాపట్టణాధ్యాసివై
పరిపాలింపుము దైత్యపాళి ననుచుం బట్టాభిషేకం బొన
ర్చిరి శుక్రాత్మజదత్తలగ్నమున భేరీశంఖముల్‌ మ్రోయఁగన్‌
261
శా.ఆ పౌలస్త్యకులేశ్వరుం డిటుల లంకాధీశ్వరుండై హిత
వ్యాపారజ్ఞుల బంధులన్‌ సఖుల మిత్రామాత్యులన్‌ మాన్యభా
షాపూర్వంబుగఁ దత్తదర్హపదవీ సంభావ్యులన్‌ జేసి వి
ద్యాపాండిత్య తపోబలాన్వయ వయో-హంకారముల్‌ మీఱఁగన్‌
262
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju