| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| శా. |
శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర క్షైకారంభకు, భక్తపాలనకళా సంరంభకున్, దానవో ద్రేకస్తంభకుఁ, గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా నాకంజాతభవాండకుంభకు, మహానందాంగనా డింభకున్. |
1 |
| ఉ. |
వాలిన భక్తి మ్రొక్కెద నవారితతాండవకేళికిన్ దయా శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథగర్వపర్వతో న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాళికిన్. |
2 |
| ఉ. |
ఆతత సేవఁ జేసెద సమస్తచరాచరభూతసృష్టి వి జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని ర్ణేతకు దేవతానికర నేతకుఁ గల్మషజేతకున్ నత త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోకశుభప్రదాతకున్. |
3 |
| వ. | అని నిఖిలభువన ప్రధానదేవతావందనంబు సేసి. | 4 |
| ఉ. |
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా చ్ఛేదికి, మంజువాదికి, నశేషజగజ్జననందవేదికిన్ మోదకఖాదికిన్, సమదమూషక సాదికి, సుప్రసాదికిన్. |
5 |
| ఉ. |
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితామర శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్ వాణికి నక్షదామశుకవారిజపుస్తకరమ్యపాణికిన్. |
6 |
| శా. |
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ! యో యమ్మ! మేల్ పట్టున్ నాకగుమమ్మ! నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ! |
7 |
| ఉ. |
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ! |
8 |
| ఉ. |
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా వాంబరవీథి విశ్రుత విహారిణి, నన్ గృపఁజూడు భారతీ! |
9 |
| ఉ. |
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. |
10 |
| మ. |
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁ బెన్నిక్క, చం దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తోనాడు పూఁబోఁడి, తా మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్. |
11 |
| వ. | అని యిష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి, హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కథా సుధారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి; మృదుమధురవచనరచనపల్లవితస్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోకసమ్మోదితసూరు మయూరు నభినందించి, మహా కావ్యకరణ కళావిలాసుం గాళిదాసుం గొనియాడి, కవికమలవిసరరవిన్ భారవిన్ బొగడి విదళితాఘు మాఘు వినుతించి, యాంధ్ర కవితాగౌరవ జనమనోహారి నన్నయసూరిం గైవారంబు సేసి, హరిహర చరణారవింద వందనాభిలాషిం దిక్కనమనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు పలికి, భావికవుల బహూకరించి, యుభయ కావ్యకరణదక్షుండనై. | 12 |