| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | అని యడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుం డిట్లనియెఁ దృతీయంబైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచరవసువు వీర్యంబున జన్మించి వాసవి నాఁ దగు సత్యవతి యందుఁ బరాశరునికి హరికళం జేసి విజ్ఞాని యయిన వేదవ్యాసుండు జన్మించి, యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీ జలంబుల స్నానాదికర్మంబులం దీర్చి శుచియై పరులు లేని చోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయ వేళ నతీతానాగతవర్తమానజ్ఞుం డయిన యా ఋషి వ్యక్తంబు గాని వేగంబు గల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు. యుగయుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నం బగుఁ, బురుషులు నిస్సత్త్వులు ధైర్యశూన్యులు మందప్రజ్ఞు లల్పాయువులు దుర్బలులు నయ్యెద రని తన దివ్య దృష్టిం జూచి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయం దలంచి నలువురు హోతలచేత ననుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబులయిన వైదిక కర్మంబులగు యజ్ఞంబు లెడతెగకుండు కొఱకు నేకంబైన వేదంబు ఋగ్యజుస్సామాథర్వణంబులను నాలుగు నామంబుల విభాగించి యితిహాసపురాణంబు లన్నియుఁ బంచమ వేదంబని పల్కెనందు. | 82 |
| సీ. |
పైలుండు ఋగ్వేదపఠనంబు దొరఁకొనె సామంబు జైమిని సదువుచుండె యజువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ దుది నథర్వము సుమంతుఁడు పఠించె నఖిలపురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ దమతమ వేద మా తపసులు భాగించి శిష్యసంఘములకుఁ జెప్పిరంత |
|
| తే. |
శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల, కంత బహుమార్గములు చెప్పి యనుమతింపఁ బెక్కు శాఖలు గలిగి యీ పృథివిలోన, నిగమ మొప్పారె భూసురనివహమందు. |
83 |
| వ. | ఇట్లు మేధావిహీనులయిన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపం బడుచున్నవి. మఱియు దీనవత్సలుం డయిన వ్యాసుండు స్త్రీశూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులు గావు. కావున మూఢుల కెల్ల మేలగు నని భారతాఖ్యానంబు చేసియు న మ్ముని భూతహితంబునందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటినుండి హేతువు వితర్కించుచుఁ దనలో నిట్లనియె. | 84 |
| సీ. |
వ్రతధారినై వేద వహ్నిగురుశ్రేణి మన్నింతు విహితకర్మములఁ గొఱఁత పడకుండ నడపుదు భారతమిషమునఁ బలికితి వేదార్థభావ మెల్ల మునుకొని స్త్రీశూద్రముఖ్యధర్మము లందుఁ దెలిపితి నేఁ జెల్ల దీనఁ జేసి యాత్మ సంతస మంద దాత్మలో నీశుండు సంతసింపక యున్న జాడ దోఁచె |
|
| ఆ. |
హరికి యోగివరుల కభిలషితంబైన, భాగవత విధంబుఁ బలుకనైతి మోసమయ్యెఁ దెలివి మొనయదు మఱచితి, ననుచు వగచుచున్న యవసరమున. |
85 |