| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| క. |
ఖేదమున నింద్రసూనుఁడు, యాదవ పురినుండి వచ్చి యగ్రజుఁ గని త త్పాదముల నయన సలిలో, త్పాదకుఁడై పడియె దీను భంగి నరేంద్రా! |
345 |
| క. |
పల్లటిలిన యుల్లముతోఁ, దల్లడపడుచున్న పిన్నతమ్మునిఁ గని వె ల్వెల్ల నగు మొగముతో జను, లెల్లను విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్. |
346 |
| సీ. |
మాతామహుండైన మన శూరుఁ డున్నాడె? మంగళమే మన మాతులునకు ? మోదమే నలుగురు ముగురు మేనత్తల? కానందమే వారి యాత్మజులకు? నక్రూర కృతవర్మ లాయుస్సమేతులే? జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు? కల్యాణయుక్తులే గద సారణాదులు? మాధవుతమ్ములు మానధనులు? |
|
| తే. |
నందమే మన సత్యకనందనునకు? భద్రమే శంబరాసురభంజనునకుఁ? గుశలమే బాణదనుజేంద్రు కూఁతుపతికి? హర్షమే పార్థ! ముసలికి, హలికి, బలికి? |
347 |
| వ. | మఱియు నంధక మధు భోజ దశార్హ వృష్ణి సాత్వతులు మొదలయిన యదువంశ వీరులును, హరికుమారులైన సాంబ సుషేణ ప్రముఖులును, నారాయణానుచరులైన యుద్ధవాదులును, గృష్ణ సహచరులైన సునంద నందాదులును సుఖానందులే? యని యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె. | 348 |
| సీ. |
వైకుంఠవాసుల వడువున నెవ్వని, బలమున నానందభరితు లగుచు వెఱవక యాదవ వీరులు వర్తింతు రమరులు గొలువుండునట్టి కొలువు చవికె నాకర్షించి చరణసేవకులైన బంధుమిత్రాదుల పాదయుగము నెవ్వఁడు ద్రొక్కించె నింద్రపీఠము మీఁద వజ్రంబు జళిపించి వ్రాలువాని |
|
| తే. |
ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి, యమృతజలములఁ బోషింప నలరు పారి జాత మెవ్వఁడు గొనివచ్చి సత్యభామ, కిచ్చె నట్టి మహాత్మున కిపుడు శుభమె? |
349 |
| శా. |
అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁ డా పన్నానీకశరణ్యుఁ డీశుఁడు జగద్భద్రానుసంధాయి శ్రీ మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు సుధర్మామధ్య పీఠంబునం దున్నాఁడా బలభద్రుఁగూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్? |
350 |
| క. |
ఆ రామకేశవులకును, సారామలభక్తి నీవు సలుపుదువుగదా? గారాములు సేయుదురా?, పోరాముల బంధు లెల్లప్రొద్దు జితారీ! |
351 |
| శా. |
మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ బ్రాభవ స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ గన్నీ రెన్నఁడుఁ దేవు తండ్రి! చెపుమా కల్యాణమే చక్రికిన్? |
352 |
| వ. | అదియునుంగాక | 353 |
| క. |
ఓడితివో శత్రువులకు, నాడితివో సాధుదూషణాలాపములం గూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్? |
354 |
| క. |
తప్పితివో, యిచ్చెద నని, చెప్పితివో కపటసాక్షి చేసిన మేలుం దెప్పితివో శరణార్థుల, రొప్పితివో ద్విజులఁ బసుల, రోగుల, సతులన్ |
355 |
| క. |
అడిచితివో భూసురులను?, గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా? విడిచితివో యాశ్రితులను?, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్? |
356 |
| వ. | అని పలికినం గన్నీరు కరతలంబునం దుడిచికొనుచు, గద్గదస్వరంబున మహానిధిం గోలుపోయిన పేదచందంబున నిట్టూర్పులు నిగిడించుచు, నర్జునుం డన్న కిట్లనియె. | 357 |
| క. |
మన సారథి, మన సచివుఁడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుఁడున్ మన విభుఁడు, గురుఁడు, దేవర మనలను దిగనాడి చనియె మనుజాధీశా! |
358 |
| క. |
కంటకులు నృపులు సూడఁగ, మింటం గంపించు యంత్రమీనముఁ గోలన్ గెంటించి మనము వాలుం, గంటిం జేకొంటి మతని కరుణన కాదే! |
359 |
| క. |
దండి ననేకులతో నా, ఖండలుఁ డెదు రయిన గెలిచి ఖాండవవనముం జండార్చికి నర్పించిన, గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుట నధిపా! |
360 |
| క. |
దిక్కుల రాజుల నెల్లను, మక్కించి ధనంబు గొనుట మయకృతసభ ము న్నెక్కుట జన్నము సేయుట, నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే! |
361 |
| మ. |
ఇభజిద్వీర్య! మఖాభిషిక్త మగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్ సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపఁగా నభయం బిచ్చి ప్రతిజ్ఞ సేసి భవదీయారాతికాంతాశిరో జభరశ్రీల హరింపఁడే విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్! |
362 |
| శా. |
వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా వారింప నా వల్లభుల్ రా రీ వేళ, నుపేక్ష సేయఁదగవే, రావే, నివారింపవే? లేరే త్రాతలు! కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడం గారుణ్యంబున భూరివస్త్రకలితంగాఁ జేయఁడే ద్రౌపదిన్? |
363 |
| సీ. |
దుర్వాసుఁ డొకనాఁడు దుర్యోధనుఁడు వంపఁ బదివేల శిష్యుల భక్తిఁ గొలువఁ జనుదెంచి మనము పాంచాలియుఁ గుడిచిన వెనుక నాహారంబు వేఁడికొనినఁ బెట్టెద ననవుడుఁ బెట్టకున్న శపింతు ననుచుఁ దోయావగాహమున కేగఁ గడవల నన్న శాకములు దీఱుటఁ జూచి పాంచాలపుత్త్రిక పర్ణశాల |
|
| తే. |
లోనఁ దలఁచిన విచ్చేసి లోవిలోని, శిష్టశాకాన్నలవముఁ బ్రాశించి, తపసి కోప ముడిగించి, పరిపూర్ణకుక్షిఁ జేసె, నిట్టి త్రైలోక్యసంతర్పి యెందుఁ గలఁడు? |
364 |
| సీ. |
పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని బలమున నా కిచ్చెఁ బాశుపతము? నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు పీఠార్ధమున నుండఁ బెంపుఁ గంటిఁ? గాలకేయ నివాతకవచాది దైత్యులఁ జంపితి నెవ్వని సంస్మరించి? గోగ్రహణమునాఁడు కురుకులాంభోనిధిఁ గడచితి నెవ్వని కరుణఁ జేసి? |
|
| ఆ. |
కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల, తలల పాగ లెల్లఁ దడవి తెచ్చి, యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని, పుత్త్రి యడుగ బొమ్మపొత్తికలకు. |
365 |
| మ. |
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో గురుశక్తిన్ రథయంతయై నొగలపైఁ గూర్చుండి యా మేటి నా శరముల్ వాఱక మున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నా కిచ్చుచున్. |
366 |
| మ. |
అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె ల్వ సమర్థంబులు గాని కైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ ర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహుదివ్యాస్త్ర ప్రపంచంబు నా దెసకున్ రాక తొలంగె మాధవు దయాదృష్టిన్ నరేంద్రోత్తమా! |
367 |
| చ. |
వసుమతి దివ్యబాణముల వ్రక్కలు వాపి కొలంకు సేసి, నా రసములు మాటుగాఁ బఱపి రథ్యములన్ రిపు లెల్లఁ జూడ సా హసమున నీటఁ బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు, నా కసురవిరోధి భద్రగతి నండయి వచ్చినఁ గాదె భూవరా! |
368 |
| సీ. |
చెలికాఁడ! రమ్మని చీరు నన్నొకవేళ మన్నించు నొకవేళ మఱఁది యనుచు బంధుభావంబునఁ బాటించు నొకవేళ, దాతయై యొకవేళ ధనము లిచ్చు, మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు, బోధియై యొకవేళ బుద్ధిసెప్పు, సారథ్య మొనరించుఁ జన విచ్చి యొకవేళఁ, గ్రీడించు నొకవేళ, గేలిసేయు, |
|
| తే. |
నొక్క శయ్యాసనంబున నుండుఁ, గన్న, తండ్రి కైవడిఁ జేసిన తప్పుఁ గాచు, హస్తములు వట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ! మాధవు మఱవ రాదు. |
369 |
| క. |
విజయ, ధనంజయ, హనుమ, ద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేం ద్రజ, మిత్రార్జున యంచును, భుజములు దలకడవ రాకవోకలఁ జీరున్. |
370 |
| క. |
వారిజగంధులు దమలో, వారింపఁగ రాని ప్రేమ వాదము సేయన్ వారిజనేత్రుఁడు ననుఁ దగ, వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా! |
371 |
| క. |
నిచ్చలు లోపలి కాంతలు, మచ్చికఁ దనతోడ నాడు మాటలు నాకున్ ముచ్చటలు సెప్పు మెల్లన, విచ్చలవిడిఁ దొడలమీఁద విచ్చేసి నృపా! |
372 |
| చ. |
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁబోక నేఁ గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో? |
373 |
| శా. |
కాంతారంబున నొంటిఁ దోడుకొని రాఁగాఁ జూచి గోవిందు శు ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల మదరాగాయత్తులై తాఁకి నా చెంతన్ బోయలు మూఁగి పట్టికొన నా సీమంతినీ సంఘమున్ భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక ధాత్రీశ్వరా! |
374 |
| శా. |
ఆ తే రా రథికుండు నా హయము లా యస్త్రాసనం బా శర వ్రాతం బన్యులఁ దొల్లి జంపును దుదిన్ వ్యర్థంబులై పోయె మ చ్చేతోఽధీశుఁడు చక్రి లేమి, భసిత క్షిప్తాజ్యమాయావి మా యా తంత్రోషరభూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. |
375 |
| మ. |
యదువీరుల్ మునినాథు శాపమునఁ గాలాధీనులై, యందఱున్ మదిరాపాన వివర్ధమాన మదసమ్మర్దోగ్ర రోషాంధులై కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి, న ష్టదశం జిక్కిరి నల్వురేవు రచటన్ సర్వంసహావల్లభా! |
376 |
| క. |
భూతములవలన నెప్పుడు, భూతములకు జన్మ మరణ పోషణములు ని ర్ణీతములు సేయుచుండును, భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా! |
377 |
| క. |
బలములు గల మీనంబులు, బలవిరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతు లయిన యదువులు, బలరహితులఁ జంపి రహితభావముల నృపా! |
378 |
| మ. |
బలహీనాంగులకున్ బలాధికులకుం బ్రత్యర్థిభావోద్యమం బులు గల్పించి, వినాశమున్ నెఱపి, యీ భూభారముం బాపి, ని శ్చలబుద్ధిం గృతకార్యుఁడై చనియె, నా సర్వేశ్వరుం డచ్యుతుం డలఘుం డేమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వరా! |
379 |
| వ. | మఱియు దేశకాలార్థ యుక్తంబులు, నంతఃకరణ సంతాప శమనంబులు నయిన హరివచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబయి యున్నది అని యన్నకుం జెప్పి, నిరుత్తరుండై, నిరంతర హరిచరణారవింద చింతామలబుద్ధియై శోకంబు వర్జించి, సదా ధ్యానభక్తి విశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి తన కుభయ సేనామధ్యంబున నచ్యుతుం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబులచేత నావృతంబయిన విజ్ఞానంబుఁ గ్రమ్మఱ నధిగమించి, హేతుమద్భావంబున శోకహేతు వహంకార మమకారాత్మకం బయిన ద్వైతభ్రమం బనియును, ద్వైత భ్రమంబునకుఁ గారణంబు దేహం బనియును, దేహంబునకు బీజంబు లింగం బనియును, లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతి యనియును, ‘బ్రహ్మాహ’ మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండు ననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యం బనియును, నైర్గుణ్యంబువలనఁ గార్య లింగనాశం బనియును, గార్యలింగనాశంబున నసంభవంబగు ప్రకృతిం బాసి క్రమ్మఱ స్థూలశరీరప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును నిశ్చయించి, యర్జునుండు విరక్తుండై యూరకుండె; ధర్మజుండు భగవదీయమార్గంబుఁ దెలిసి, యాదవుల నాశంబు విని నారదు వచనంబులం దలంచి, నిశ్చల చిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయుచుండె నా సమయంబున. | 380 |
| క. |
యదువుల నాశము మాధవు, పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ త్పదచింతాతత్పరయై, ముదమున సంసారమార్గమునకుం బాసెన్. |
381 |
| వ. | ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటిని పరిహరించు విన్నాణి తెఱంగువ, యాదవరూప శరీరంబునంజేసి యీశ్వరుండు లోకకంటక శరీరంబులు సంహరించి నిజ శరీరంబు విడిచె; సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు. నిజరూపంబున మెలంగుచు రూపాంతరంబులు ధరియించి క్రమ్మఱ నంతర్ధానంబు నొందు నటుని కైవడి లీలాపరాయణుండైన నారాయణుండు మీన కూర్మాది రూపంబులు ధరియించుం బరిహరించునని చెప్పి మఱియు నిట్లనియె. | 382 |
| క. |
ఏ దినమున వైకుంఠుఁడు, మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచి నాఁ డా దినమున నశుభప్రతి, పాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్. |
383 |