పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
పరీక్షిన్మహారాజు భూధర్మదేవతల సంవాదం బాలించుట
క. భూవరరూపుఁడు శూద్రుఁడు, గోవుం దా నేల తన్నెఁ గోరి పరీక్షి
ద్భూవరుఁడు దిశల గెలుచుచు, నే విధిఁ గలి నిగ్రహించె నెఱిఁగింపఁగదే.
391
మ. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్‌ వినక దుర్బుద్ధిన్‌ విలంఘించి, దు
ర్నరవార్తాకథన ప్రపంచములు గర్ణప్రాప్తముల్‌ సేసి, వా
సరముల్‌ వ్యర్థతఁ ద్రోచుచుండఁ జన దీ సంసార మోహంబునన్‌.
392
సీ. మనుట నిత్యము గాదు మరణంబు నిజ మని యెఱిఁగి మోక్షస్థితి నిచ్చగించు
నల్పాయువు లగు మా కన్యదుర్జన చరిత్రము లోలిఁ గర్ణ రంధ్రములఁ బెట్టి
బంగారు వంటి యీ బ్రదికెడు కాలంబుఁ బోనాడఁగా నేల పుణ్యచరిత!
మాధవపదపద్మ మకరందపానంబు సేయింపవే యేము సేయునట్టి
 
ఆ. సత్త్రయాగమునకు సన్మునీంద్రులు సీర, వాఁడె దండధరుఁడు వచ్చెఁ జూడు
చంపఁ డొకనినైన జన్న మయ్యెడుదాఁక, వినుచునుండుఁ దగిలి విష్ణుకథలు.
393
క. మందునకు మందబుద్ధికి, మందాయువునకు నిరర్థమార్గునకును గో
విందచరణారవింద మ, రందము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్‌.
394
వ. అని శౌనకుండు పలికిన సూతుం డిట్లనియెఁ బరీక్షిన్నరేంద్రుండు నిజవాహినీ సందోహ సురక్షితంబగు కురుజాంగలదేశంబునం గలి ప్రవేశంబు నాకర్ణించి, యుద్ధకుతూహలత నంగీకరించి, యొక్క నాఁడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని, నీల నీరద నిభతురంగ నివహ యోజితంబును, ఫలిత మనోరథంబును నైన రథంబు నారోహణంబు సేసి, మృగేంద్ర ధ్వజంబు వెలుంగ రథ కరి తురంగమ సుభట సంఘటితంబగు వాహినీచక్రంబు నిర్వక్రంబుగం గొలువ, దిగ్విజయార్థంబు వెడలి పూర్వదక్షిణ పశ్చిమోత్తర సముద్రలగ్నంబు లయిన, యిలావృత రమ్యక హిరణ్మయ హరివర్ష కింపురుష భద్రాశ్వ కేతుమాల భారత వర్షంబులు నుత్తర కురుదేశంబులును జయించి, పుష్కల ధనప్రదాన పూర్వికలగు సపర్యల నభ్యర్చితుండై తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు మంగళ పాఠక సంఘాత జేగీయమాన పూర్వరాజవృత్తాంతంబు లాకర్ణింపుచుఁ బాఠకపఠితపద్యంబుల వలనం బాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుం డాచరించిన సారథ్య, సఖ్య, సాచివ్య, సభాపతిత్వ, వీరాసనత్వ, దూతభావాది కర్మంబులు నశ్వత్థామాస్త్ర తేజంబు వలనఁ దన్ను రక్షించుటయు, యాదవ పాండవులందలి స్నేహానుబంధంబును, వారలకుం గలిగిన భగవద్భక్తివిశేషంబును విని, విశ్వంభరుని భక్త వాత్సల్యంబునకు నాశ్చర్యంబు నొందుచు, వందిబృందంబులకు మహార్ఘంబులగు హారాంబరాభరణాది సందోహంబుల నొసంగుచుఁ, బద్మనాభ పాదపద్మ భజన పరతంత్ర పవిత్రమానసుండై యుండె; నయ్యెడ వృషభ రూపంబున నేకపాదంబున సంచరించు ధర్మదేవుండు దన సమీపంబున లేఁగలేని లేఁగటి కుఱ్ఱి చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు గురియుచు గోరూపయై యున్న ధాత్రి కిట్లనియె. 395
మ. నయనాంభఃకణజాల మేల విడువన్‌ నాతల్లి! నీ మేను సా
మయమై యున్నది; మోము వాడినది; నీ మన్నించు చుట్టాలకున్‌
భయదుఃఖంబులు నెందు నొందవు గదా? బంధించి శూద్రుల్‌ పద
త్రయహీనన్‌ ననుఁ బట్ట వత్తు రనియో, తాపంబు నీ కేటికిన్‌?
396
సీ. మఖములు లేమి నమర్త్యుల కిటమీఁద మఖభాగములు లేక మాను ననియొ?
రమణులు రమణుల రక్షింప రనియొ తత్పుత్రులఁ దండ్రులు ప్రోవ రనియొ?
భారతి గుజనులఁ బ్రాపించు ననియొ సద్విప్రులు నృపుల సేవింతు రనియొ?
కులిశ హస్తుఁడు వాన గురియింపకుండఁగఁ బ్రజలు దుఃఖంబులఁ బడుదు రనియొ?
 
ఆ. హీనవంశజాతు లేలెద రనియొ, రాజ్యములు పాడి గలిగి జరుగవనియొ?
మనుజు లన్నపానమైథున శయనాస, నాది కర్మసక్తు లగుదు రనియొ?
397
మ. జననీ! నీ భర మెల్ల డించుటకునై చక్రాయుధుం డిన్ని హా
యనముల్‌ దాను నరాకృతిన్‌ మెలఁగి నిత్యానందముం జేసి పో
యిన నే నింక ననాథ నైతిఁ; గుజనుం డెవ్వాఁడు శాసించునో
పెనుదుఃఖంబుల నేమి పొందు ననియో భీతిల్లి చింతించుటల్‌.
398
క. దెప్పర మగు కాలముచే, నెప్పుడు దేవతలకెల్ల నిష్టం బగు నీ
యొప్పిదముఁగృష్ణుఁ డరిగినఁ, దప్పెఁగదా! తల్లి! నీవు తల్లడపడఁగన్‌.
399
వ. అనిన భూదేవి యిట్లనియె. 400
క. ఈ లోకంబునఁ బూర్వము, నాలుగు పాదముల నీవు నడతువు నేఁ డా
శ్రీలలనేశుఁడు లేమిని, గాలముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే!
401
వ. మఱియు సత్య శౌచ దయా క్షాంతులును, ద్యాగసంతోషార్జవంబులును, శమ దమ తపంబులును, సమత్వంబును, పరాపరాధ సహనంబును, లాభంబు గలయెడ నుదాసీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, జ్ఞానవిరక్తులును, నైశ్వర్య శౌర్యప్రభా దక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్ర్యంబును. గౌశల కాంతి ధైర్యమార్దవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును, సౌభాగ్యగాంభీర్య స్థైర్యంబులును, శ్రద్ధాకీర్తి మాన గర్వాభావంబులును ననియెడి ముప్పది తొమ్మిది గుణంబులు; నవియునుంగాక బ్రహ్మణ్యతా శరణ్యతాది మహా గుణసమూహంబును శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లుంగావున. 402
క. గణనాతీతము లగు స, ద్గుణములు గల చక్రి సనిన ఘోరకలి ప్రే
రణమునఁ బాప సమూహ, వ్రణయుతులగు జనులఁ జూచి వగచెదఁ దండ్రీ!
403
క. దేవతలకు ఋషులకుఁ బితృ, దేవతలకు నాకు నీకు ధీరులకును నా
నా వర్ణాశ్రమములకును, గోవులకును బాధ యనుచుఁ గుందెద ననఘా!
404
సీ. బ్రహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపములఁ
గమలాలయము మాని కమల యెవ్వని పాద కమలంబు సేవించుఁ గౌతుకమునఁ
బరమ యోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదు రెవ్వని నియతితోడ
వేదంబు లెవ్వని విమలచారిత్రముల్‌ వినుతింపఁగా లేక వెగడు వడియె
 
ఆ. నట్టి వాసుదేవు నబ్జ వజ్రాంకుశ, చక్ర మీన శంఖ చాప కేతు
చిహ్నితంబులైన శ్రీచరణము లింక సోఁక వనుచు వగపు సోఁకె నయ్య!
405
క. హరిపాదంబులు సోఁకెడి, సిరికతమున నఖిలభువనసేవ్యత్వముతో
స్థిర నైతి నిన్ని దినములు, హరి నా గర్వంబు మాన్చి యరిగె మహాత్మా!
406
క. లీలాకారము దాల్చెను, శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో
న్మూలనము సేయుకొఱకును, నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్‌.
407
ఉ. ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం
బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర
ప్రేమకరావలోకనము ప్రీతిఁ గనుంగొనలేమి మాధవుం
గామిను లేల? నిర్దళితకర్ములు యోగులుఁ బాయ నేర్తురే!
408
క. మెల్లన నాపై యాదవ, వల్లభుఁ డడుగిడఁగ మోహవశనై నే రం
జిల్లఁగ రోమాంచము క్రియ, మొల్లములై మొలచు సస్యములు మార్గములన్‌.
409
వ. అని యిట్లు పూర్వవాహిని యైన సరస్వతీతీరంబున ధర్మదేవుండును భూమియు వృషధేనురూపంబుల భాషింప రాజర్షియైన పరీక్షిద్భూవరుండు డగ్గఱియె; నా సమయమున. 410
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )