పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
పరీక్షిన్మహారాజు గలిని నిగ్రహించి ధర్మపరిపాలనము సేయుట
వ. అని యటు ధరణీ ధర్మదేవతల బుజ్జగించి మహారథుండయిన విజయపౌత్త్రుండు క్రొక్కారు మెఱుంగు చక్కదనంబు ధిక్కరించి దిక్కులకు వెక్కసంబయిన యడిదంబు బెడిదంబుగ జడిపించి పాపహేతువయిన కలిని రూపుమాప నుద్యోగించిన, వాఁడు రాజరూపంబు విడనాడి, వాడిన మొగంబుతోడ భయవిహ్వలుండై హస్తంబులు సాఁచి తత్పాదమూల విన్యస్త మస్తకుండై ప్రణామంబు సేసి. 431
క. కంపించె దేహమెల్లం, జంపకు మో రాజతిలక! శరణాగతు ర
క్షింపు మని తనకు మ్రొక్కినఁ, జంపక కలిఁజూచి నగుచు జనపతి పలుకున్‌.
432
క. అర్జునకీర్తిసమేతుం, డర్జున పౌత్త్రుండు భయ రసావృత జనులన్‌
నిర్జితులఁ జంప నొల్లఁడు, దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా!
433
వ. నీవు పాపబంధుండవు. మదీయబాహుపాలితం బయిన మహీమండలంబున నిలువ వలవదు; రాజదేహంబునందు వర్తించు నిన్ను నసత్యలోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయాకలహ కపట కలుషాలక్ష్మ్యాది ధర్మేతరసమూహంబు లాశ్రయించు; సత్యధర్మంబులకు నివాసంబగు బ్రహ్మావర్తదేశంబున యజ్ఞ విస్తార నిపుణు లయిన వారు యజ్ఞేశ్వరుం డయిన హరింగూర్చి యాగంబు సేయుచున్న వారు; యజించు వారలకు సుఖప్రదానంబుసేయుచు, సకల భూతాంతర్యామియై భగవంతుం డయిన హరి జంగమస్థావరంబులకు నంతరంగ బహిరంగముల సంచరించు వాయువు చందంబున నాత్మరూపంబు మనోరథంబు నిచ్చుం; గావున నీ విం దుండ వలవ దనుచు దండహస్తుండయిన జముని కైవడి మండలాగ్రంబు సాఁచిన రాజవర్యునకుం గలి యిట్లనియె. 434
క. జగతీశ్వర! నీ యడిదము, ధగధగితప్రభలతోడఁ దఱచుగ మెఱయన్‌
బెగడెం జిత్తము గుండెలు, వగిలెడి నెందుఁ నిఁక జొత్తు భావింపఁ గదే!
435
వ. నరేంద్రా! నిన్ను, నారోపితశరశరాసను సర్వప్రదేశంబులందును విలోకించుచున్న వాఁడ; నే నెక్కడ నుండుదు నానతిమ్మనిన రాజన్య శేఖరుండు ప్రాణివధ స్త్రీ ద్యూత పానంబు లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చి మఱియు నడిగిన సువర్ణమూలంబగు నసత్య మద కామ హింసా వైరంబు లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితరస్థలంబుల స్పృశియింపకుండ నియమించె, నిట్లు కలినిగ్రహంబు సేసి హీనంబు లయిన తపశ్శౌచదయ లనియెడు మూఁడు పాదంబులు వృషభమూర్తి యయిన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరం బయిన సంతోషంబు సంపాదించి. 436
క. గజనామధేయపురమున, గజరిపుపీఠమున ఘనుఁడు గలిదమనుం డ
గ్గజవైరిపరాక్రముఁ డై, గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవలక్ష్మిన్‌.
437
వ. ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామబాణపావకంబు వలన బ్రదికి, వృషభమూర్తి యయిన ధర్మదేవతకు నభయం బిచ్చిన పరీక్షిన్నరేంద్రుండు బ్రాహ్మణ శాపప్రాప్తతక్షకాహిభయంబు వలనఁ బ్రాణంబులు వోవు నని యెఱింగి సర్వసంగంబులు వర్జించి, శుకునకు శిష్యుండై విజ్ఞానంబు గలిగి, గంగాతరంగిణీ తీరంబునం గళేబరంబు విడిచె వినుఁడు. 438
క. హరివార్త లెఱుఁగు వారికి, హరిపదములు దలఁచువారి కనవరతంబున్‌
హరికథలు వినెడివారికి, మరణాగత మోహసంభ్రమము లేదనఘా!
439
క. శుభచరితుఁడు హరి యరిగినఁ, బ్రభవించి ధరిత్రి నెల్లఁ బ్రబ్బియుఁ గలి దా
నభిమన్యుసుతుని వేళను, బ్రభవింపక యడఁగి యుండె భార్గవముఖ్యా!
440
వ. ఇవ్విధంబునఁ జతుస్సముద్రముద్రితాఖిలమహీమండలప్రాజ్యసామ్రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయుచు నా యభిమన్యుసంభవుండు. 441
ఉ. చేసినఁ గాని పాపములు సెందవు; చేయఁ దలంచి నంతటం
జేసెద నన్న మాత్రమునఁ జెందుఁ గదా కలివేళఁ బుణ్యముల్‌;
మోసము లే దటంచు నృపముఖ్యుఁడు గాచెఁ గలిన్‌ మరంద ము
ల్లాసముతోడఁ గ్రోలి విరులం దెగఁజూడని తేఁటి కైవడిన్‌.
442
వ. మఱియుం బ్రమత్తులై యధీరులగు నరులయందు వృకంబు చందంబున నొదిగి కాచుకొని యుండి చేష్టించుంగాని ధీరులైన వారికిం గలివలని భయంబు లేదని కలినంతంబు నొందింపఁడయ్యె ననిన విని ఋషులు సూతున కిట్లనిరి. 443
సీ. పౌరాణికోత్తమ! బ్రదుకుము పెక్కేండ్లు తామరసాక్షుని ధవళయశము
మరణశీలురమైన మా కెఱింగించితి కల్పితంబగు క్రతుకర్మమందుఁ
బొగలచేఁ బొగిలి యబుద్ధచిత్తులమైన మము హరి పదపద్మ మధుర రసము
ద్రావించితివి నీవు, ధన్యుల మైతిమి స్వర్గ మేనియు నపవర్గమేని
 
తే. భాగవత సంగ లవ భాగ్యఫలము కీడె?, ప్రకృతిగుణహీనుఁడగు చక్రి భద్రగుణము
లీశకమలాసనాదులు నెఱుఁగ లేరు, వినికి వినఁజాల మనియెడి వెఱ్ఱి గలఁడె?
444
క. శ్రీపంబులు ఖండిత సం, తాపంబులు గల్మషాంధతమస మహోద్య
ద్దీపంబులు పాషండ దు, రాపంబులు విష్ణువందనాలాపంబుల్‌.
445
క. పావనములు దురితలతా, లావనములు నిత్యమంగళ ప్రాభవ సం
జీవనములు లక్ష్మీసం, భావనములు వాసుదేవు పదసేవనముల్‌.
446
ఆ. పరమభాగవతుఁడు పాండవపౌత్త్రుండు, శుకుని భాషణముల శుద్ధబుద్ధి
యై విరాజమానుఁడై ముక్తి యగు విష్ణు, పాదమూల మెట్లు వడసె ననఘ!
447
వ. మహాత్మా! విచిత్రయోగనిష్ఠా కలితంబును, విష్ణుచరిత లలితంబును, బరమ పుణ్యంబును, సకలకల్యాణ గుణగణ్యంబును, భాగవత జనాపేక్షితంబును నైన పారీక్షిత భాగవతాఖ్యానంబు వినిపింపు మనిన సూతుం డిట్లనియె. 448
క. మిముబోఁటి పెద్దవారలు, కమలాక్షుని చరిత మడుగఁగాఁ జెప్పెడి భా
గ్యము గలిగె నేఁడు నా జ, న్మము సఫలం బయ్యె వృద్ధమాన్యుఁడ నగుటన్‌.
449
క. కులహీనుఁడు నారాయణ, విలసత్కథనములు గడఁక వినిపించినఁ ద
త్కులహీనతఁ బాసి మహో, జ్జ్వల కులజత్వమును బొందు సన్మునులారా!
450
సీ. ఎవ్వని గుణజాల మెన్న జిహ్వలు లేక నలినగర్భాదు లనంతుఁ డండ్రు
కోరెడు విబుధేంద్రకోటి నొల్లక లక్ష్మి ప్రార్థించె నెవ్వని పాదరజము
బ్రహ్మ యెవ్వని పాదపద్మంబు గడిగిన జలము ధన్యత నిచ్చె జనుల కెల్ల
భగవంతుఁ డనియెడి భద్రశబ్దమునకు నెవ్వఁ డర్థాకృతి నేపు మిగులు
 
ఆ. నే మహాత్ము నాశ్రయించి శరీరాది, సంగకోటినెల్ల సంహరించి
ప్రాభవమున మునులు పారమహంస్యంబు, నొంది తిరిగి రాక యుందు రెలమి.
451
చ. క్రమమున మింటికై యెగయుఁగాక విహంగము మింటిదైన పా
రముఁ గన నేర్చునే? హరిపరాక్రమ మోపినయంతఁ గాక స
ర్వము వివరింప నెవ్వఁడు ప్రవర్తకుఁడౌ మునులార! నాదు చి
త్తమునకు నెంత గానఁబడెఁ దప్పక చెప్పెద మీకు నంతయున్‌.
452
క. వేదండపురాధీశుఁడు, గోదండము సేతఁ బట్టికొని గహనములో
వేదండాదుల నొకనాఁ, డే దండలఁ బోవ నీక యెగచెన్‌ బలిమిన్‌.
453
క. ఒగ్గములు ద్రవ్వి పడు మని, యొగ్గెడు పెనుఁదెరల వలల నురలు మృగములన్‌
డగ్గఱి చంపెడు వేడుక, వెగ్గలమై చిత్తమందు వెంటాడింపన్‌.
454
క. కోలముల గవయ వృక శార్దూ, లములఁ దరక్షు ఖడ్గ రోహిత హరి శుం
డాలముల శరభ చమర, వ్యాలముల వధించె విభుఁడు వడి నోలములన్‌.
455
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )