పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట
తే. ఇంతి దన సుతుల్‌ సురలఁగారింతు రనుచుఁ, దలఁచుచుండంగ నంత వత్సరశతంబు
సనఁగ నఁటమీఁదఁగనియెఁ గశ్యపుని దేవి, యఖిల లోకైకకంటకు లైన సుతుల.
601
వ. అయ్యవసరంబున. 602
తే. ధరణి గంపించెఁ, గులపర్వతములు వడఁకె, జలధులు గలంగెఁ, దారకావళులు డుల్లె
గగన మగలెను, మ్రొగ్గె దిక్కరులు, దిశల, మిడుఁగుఱు లెగసెఁ, బిడుగులు పుడమిఁబడియె.
603
సీ. హోమానలంబుల ధూమంబు లడరెను బ్రతికూలవాయువుల్‌ బలసి వీచెఁ
దరువు లెల్లెడ విటతాటంబులై కూలె గ్రహతారకావళి కాంతి మాసె,
బెరసి మొగిళ్లు నెత్తురువాన గురిసెను మెఱుఁగులు దెసల మిర్మిట్లుగొలిపె
స్వర్భానుఁడొగి నపర్వమున భానునిఁ బట్టెఁ గైకొని చిమ్మచీఁకట్లు పర్వె,
 
తే. మొనసి కుక్కలు మొఱిఁగెను మోర లెత్తి, పగలు నక్కలు వాపోయె, ఖగము లార్త
రవము లిచ్చెను, దేవతాప్రతిమ లొరగెఁ, గన్నులను నశ్రుకణములు గ్రందుకొనఁగ.
604
క. మొదవులు నెత్తురుఁజీమును, బిదికెన్‌, గార్దభరవంబు భీషణ మయ్యెన్‌
మద ముడిగెఁగరుల కటములఁ, బొదివెఁదురంగముల వాలముల నిప్పు లొగిన్‌.
605
క. గుహలు రొదలిచ్చెఁ, బాప, గ్రహమిత్రతఁజెంది వక్రగతులను సౌమ్య
గ్రహములు వర్తించెను, దు, స్సహతేజోదితితనూజసంభవవేళన్‌.
606
మ. భయదప్రక్రియ నట్లు దోఁచిన మహోత్పాతమ్ము లీక్షించి సం
క్షయకాలం బని కాని, సాధుహననోగ్రక్రూరదేవాహితో
దయసంక్షోభముగా నెఱుంగక సమస్తప్రాణిసంఘాతముల్‌,
భయమందెన్‌ సనకాదియోగిజనముల్‌ దక్కన్‌ బుధేంద్రోత్తమా!
607
వ. అట్లావిర్భవించిన యనంతరంబ. 608
మ. కులశైలాభ శరీరముల్‌ దనర రక్షోనాథు లత్యుగ్ర దో
ర్బల మొప్పం బదఘట్టనన్‌ ధర చలింపన్‌ రత్న కేయూర కుం
డల కాంచీ కటకాంగుళీయక కిరీటస్వర్ణమంజీర ని
ర్మలకాంతుల్‌ దులకింప నాత్మరుచిచే మందీకృతార్కాంశులై.
609
వ. ఉన్న సమయంబునం గశ్యపుండు నిజతనూభవులఁ జూడం దలంచి దితిమందిరంబునకుఁ జనుదెంచి సుతులం గనుంగొని వారలకు నామకరణంబు సేయం దలంచి. 610
మ. దితిజఠరంబునందుఁదన తేజము మున్నిడినట్టి పుత్త్రు న
ద్భుత చరితున్‌ “హిరణ్యకశిపుం”డనుపేరఁ, బ్రసూతివేళ నా
దితి మును గన్న పట్టి రవితేజునిఁ“గాంచనలోచనుండు” నా
హితమతిఁబేరు వెట్టి చనియెన్‌ నిజనిర్మలపుణ్యభూమికిన్‌.
611
వ. అయ్యవసరంబున నతుల తేజో విరాజితుండైన హిరణ్యకశిపుండు హిరణ్యగర్భ వరదాన గర్వంబునను, దుర్వార పరిపంథి గర్వ నిర్వాపణాఖర్వ భుజావిజృంభణంబునను నిఖిలలోక పాలాదుల జయించి స్వవశం బొనర్చి సంతుష్టాంతరంగుండై యెందునుం దనకు మృత్యుభయంబు లేక నిర్భయుండై సుఖంబుండె, తత్సోదరుండైన హిరణ్యాక్షుండు ప్రతిదివసంబుఁ జండ వేదండ శుండాదండ మండిత భుజాదండంబున గదాదండంబు ధరియించి తన్ను నెదిరి కదనంబు సేయంజాలిన యరివీరునిం గానక భూలోకం బెల్లం గ్రుమ్మరి దివంబునకు దాడివెట్టి యందు సమరవిముఖులైన బర్హిర్ముఖులం గనుంగొని వనజాసన వరప్రదానంబు జింతించి హితులు సెలంగ నహితులు గలంగ మహిత వైజయంతికాదామం బభిరామంబై వెలుంగం జరణంబుల మణినూపురంబులు మొరయ నిజదేహద్యుతి దిక్కులం బిక్కటిల్లం జనుదెంచువానిం గని భీతచిత్తులయి దేవతాగణంబులు గరుడునిం గని పఱచు నురగంబులుంబోలె నిజనివాసంబు లర్కనివాసంబులుం గాంచనావాసంబులుంగా నొనర్చి యెక్కడికేనిం జనిన. 612
ఉ. శౌర్యము వోవఁదట్టి, నిజసాధనముల్‌ దిగనాడి, విక్రమౌ
దార్యపరాక్రమక్రమము దప్పఁగ భీతిలి పాఱి రక్కటా,
కార్యముఁదప్పి నాకు లని గైకొని యార్చి సుమేరుపర్వత
స్థైర్యుఁడు వార్ధిఁజొచ్చె నతిదర్పితభూరిభుజావిజృంభియై.
613
వ. ఇట్లు సొచ్చిన. 614
క. వరుణుని బలములు దనుజే, శ్వరుతేజముఁ దేఱిచూడఁజాలక శౌర్య
స్ఫురణము సెడి యెందేనియుఁ, బఱచెం దజ్జలధిమధ్యభాగమునందున్‌.
615
క. అమరారి విపులనిశ్శ్వా, సములం బ్రభవించినట్టి జలనిధి కల్లో
లములను విపులగదా దం, డమునంబోనడఁచె నతిదృఢంబగు శక్తిన్‌.
616
చ. మఱియును న మ్మహాజలధి మధ్యమునన్‌ సురవైరి పెక్కు వ
త్సరములు గ్రీడ సల్పి రిపుసైన్యవిదారణశౌర్యఖేలనా
పరతఁజరించి య వ్వరుణపాలితమైన లసద్విభావరీ
పురమున కేఁగి యందుఁబరిపూర్ణత నున్న పయోధినాథునిన్‌.
617
వ. మఱియును. 618
సీ. యాదోగణాధీశుఁడగుచుఁబాతాళభువనపరిపాలుఁడై తనరుచున్న
వరుణునిఁగనుఁగొని పరిహసితోక్తుల నిట్లను, విశ్వమం దెన్నఁగలుగు
సకలలోకైకపాలకులలో నతిబలాధికుఁడని జగము నుతింపఁదగిన
శూరుండ విపుడు నీ పౌరుష మొప్పంగఁ గదనరంగమున న న్నెదిరి చూడు,
 
తే. నీ భుజావిక్రమంబును బ్రాభవంబు, నడఁతు నని పల్కుటయు విని యబ్ధివిభుఁడు
పగతు జయమును వృద్ధియు బలము నాత్మ, బలముఁదలపోసి దనుజుతో బవరమునకు.
619
క. సమయము గాదని తన చి, త్తమునంగల రోషవహ్నిఁదాలిమియను తో
యములందగ నార్చుచు నుప, శమితోక్తులఁబలికె దనుజసత్తముతోడన్‌.
620
చ. మనమున శాంతిఁబూని, నియమంబున సంగర ముజ్జగించి యే
ననయము నున్నవాఁడ, నిపు డాహవకేళిఁ జరింపరాదు, నీ
ఘనభుజవిక్రమస్ఫురితగాఢవిజృంభణమున్‌ జయింపఁజా
లిన ప్రతివీరు లెవ్వరును లేరు, ముకుందుఁడు దక్క నెక్కడన్‌.
621
చ. గొనకొని య మ్మహాత్ముఁడు వికుంఠపురంబున నున్నవాఁడు దా
నని మొనఁబెక్కుమాఱు లభియాతుల నోలి జయించి శక్తి పెం
పున సడిసన్న వీరుఁడని భూజనకోటి నుతించు, నందు వే
చను, మతఁడిచ్చు నీకు నని, సర్వముఁదీఱెడు నంతమీఁదటన్‌.
622
ఉ. నిందకు నోర్చి యాజిమొన నిల్వఁగ నోపక వీఁగి పాఱు నీ
పందల వెంటఁబడ్డ మగపంతమె? సర్వశరణ్యుఁడైన గో
విందుఁడు దీర్చు నీ పని వివేకవిహీన! చనంగ నోపుదే
నందుల కేఁగు, మాతఁడమరారులఁబోర జయించు నిచ్చలున్‌.
623
వ. అదియునుంగాక. 624
క. పురుషాకృతిఁబ్రతియుగమునఁ, బురుషోత్తముఁడవతరించి భూరిభుజావి
స్ఫురణన్‌ దుష్టనిశాటుల, హరియించుచు నుండు మునిగణార్చితపదుఁడై.
625
ఉ. కావున నా విభుందొడరి కయ్యము దయ్య మెఱుంగఁజేసి ర
క్షోవర! నీ భుజాబలము సొంపఱి మేదినిఁగూలి సారమే
యావళి కాశ్రయం బగుదు, వచ్చటి కిప్పుడ యేగుదేని నీ
చేవయు లావు నేర్పడును, జెప్పఁగనేటికి మీఁది కార్యముల్‌.
626
చ. అని వరుణుండు వల్కిన దురాగ్రహ మెత్తి హిరణ్యలోచనుం
డనయము మానసంబున భయం బొకయింతయు లేక, సంగరా
వని నెదిరింతు నేఁ డమరవర్ధను దుష్టవిమర్దనున్‌ జనా
ర్దను ననుచున్‌ వికుంఠనగరస్ఫుటసంచితమార్గవర్తియై.
627
క. చను నవసరమున నారద, మునివరుఁడెదు రేగుదెంచి ముదము దలిర్పన్‌
దనుజేంద్ర, యెందుఁబోయెద, వని యడిగిన నారదునకు నతఁడిట్లనియెన్‌.
628
చ. సరసిరుహోదరుందొడరి సంగర మే నొనరించి యిందిరా
వరుని ననంతుఁద్రుంచి సురవైరికులంబుల కెల్ల మోద వి
స్ఫురణ ఘటింపఁజేయుటకుఁ బూని వికుంఠపురానువర్తినై
యరిగెద నన్న న మ్మునికులాగ్రణి దానవనేత కిట్లనున్‌.
629
చ. గురుభుజుఁడమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నేఁడు లేఁడు, భూ
భరము వహింప నాదికిటిభావముఁదాల్చి రసాతలంబునం
దిరవుగ నున్నవాఁ,డచటి కేగఁగ నోపుదువేని నేగు మం
దరయఁగఁగల్గు నీకు నసురాంతకుతోడి రణం బవశ్యమున్‌.
630
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )