పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
దక్షప్రజాపతి సంతతి
క. వనజజునివలన భవ మం, దిన యా దక్షప్రజాపతికి మనునిజనం
దన యగు “ప్రసూతి” సతియం, దనఘా! పదియార్వు రుదయ మందిరి కన్యల్‌.
27
వ. ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు మైత్రియు దయయు శాంతియుఁ దుష్టియుఁ బుష్టియుఁ బ్రియయు నున్నతియు బుద్ధియు మేధయుఁ దితిక్షయు హ్రీయు మూర్తియు నను నామంబులు గల పదుమువ్వురను ధర్మరాజున కిచ్చె, నొక్కకన్యక నగ్నిదేవునకును నొక్కతెం బితృదేవతలకును నొక్కతె జన్మమరణాదినివర్తకుండగు నభవునకుం బెండ్లి సేసె; నంత నా ధర్మపత్నులయందు శ్రద్ధవలన శ్రుతంబును, మైత్రివలనఁ బ్రసాదంబును, దయవలన నభయంబును, శాంతివలన సుఖంబును, దుష్టివలన ముదంబును, బుష్టివలన స్మయంబును, గ్రియవలన యోగంబును, నున్నతివలన దర్పంబును, బుద్ధివలన నర్థంబును, మేధవలన స్మృతియు, దితిక్షవలన క్షేమంబును, హ్రీవలనఁ బ్రశ్రయంబును, మూర్తివలన సకలకల్యాణగుణోత్పత్తిస్థానభూతులగు నరనారాయణలను ఋషు లిద్దఱును సంభవించిరి; వారల జన్మకాలంబున. 28
సీ. గంధవాహుఁడు మందగతి ననుకూలుఁడై వీచె; నల్దిక్కులు విశద మయ్యె;
నఖిలలోకంబులు నానందమును బొందెఁ; దుములమై దేవదుందుభులు మ్రోసెఁ;
గర మొప్ప జలధుల కలఁక లడంగెను; మించిన గతిఁ బ్రవహించె నదులు,
గంధర్వకిన్నరగానముల్‌ వీతెంచె; నప్సరోజనుల లాస్యములు సెలఁగె;
 
తే. సురలు గురియించి రందంద విరులవాన, మునిజనంబులు సంతోషమునఁ జెలంగి
వినుతు లొనరించి; రవ్వేళ విశ్వమెల్లఁ, బరమమంగళమై యొప్పె భవ్యచరిత!
29
వ. ఆ సమయంబున బ్రహ్మాదిదేవత లమ్మహాత్ముల కడకుం జనుదెంచి యిట్లని స్తుతియించిరి. 30
సీ. గగనస్థలిం దోఁచు గంధర్వనగరాది రూపభేదము లట్టు రూఢిమెఱసి
యే యాత్మయందేని నేపారు మాయచే నీ విశ్వమిటు రచియింపఁబడియె
నట్టి యాత్మప్రకాశార్థమై మునిరూపముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
పరమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁగాక యీ సృష్టి దుష్కర్మవృత్తి
 
తే. జరగనీకుండు కొఱకునై సత్త్వగుణము, చే సృజించిన మ మ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ నపహసించు, నీ కృపాలోకనంబుల నెమ్మిఁజూడు.
31
క. అని యిట్లు దేవగణములు, వినుతింపఁ గృపాకటాక్ష వీక్షణములచేఁ
గని వారు గంధమాదన, మున కేగిరి తండ్రి ముదము ముప్పిరిగొనఁగన్‌.
32
క. ధరణీభర ముడుపుట కా, నరనారాయణులు భువి జనన మనయము నొం
దిరి యర్జునకృష్ణాఖ్యలఁ, గురుయదువంశముల సత్త్వగుణయుతు లగుచున్‌.
33
వ. మఱియు నగ్నిదేవునకు దక్షపుత్రియైన “స్వాహాదేవి” యను భార్యయందు హుతభోజనులగు పావకుండును, బవమానుండును, శుచియు నను మువ్వురుకొడుకులు గలిగిరి: వారివలనం బంచచత్వారింశ త్సంఖ్యగల యగ్ను లుత్పన్నంబులయ్యె; నిట్లు పితృపితామహయుక్తంబుగా నేకోనపంచాశత్సంఖ్యలు గల యగ్నులు బ్రహ్మవాదులచే యజ్ఞకర్మంబులం దగ్నిదేవతాకంబులైన యిష్టులు దత్తన్నామంబులచేతఁ జేయంబడుచుండు; నా యగ్ను లెవ్వరనిన నగ్నిష్వాత్తులు బర్హిషదులు సౌమ్యులుఁ బితలు నాజ్యపులు సాగ్నులు నిరగ్నులు నన నేడుదెఱంగులై యుందురు. దాక్షాయణియగు స్వధ యను ధర్మపత్నియందు వారలవలన “వయున” యు, “ధారిణి” యు నను నిద్దఱు కన్య లుదయించి జ్ఞానవిజ్ఞానపారగ లగుచు బ్రహ్మనిష్ఠ లయి పరఁగిరి; వెండియు. 34
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )