పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
శివుఁడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట
సీ. అభ్రంలిహాదభ్రవిభ్రమాభ్రభ్రమకృన్నీలదీర్ఘశరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలనదీప్తజ్వాలికాజాలజాజ్వల్యమానకేశములు మెఱయఁ
జండదిగ్వేదండశుండాభదోర్దండసాహస్రధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయలోకవీక్షణద్యుతిలోకవీక్షణతతి దుర్నిరీక్షముగను
 
తే. గ్రకచకఠినకరాళదంష్ట్రలు వెలుంగ, ఘనకపాలాస్థివనమాలికలును దనర
నఖిలలోకభయంకరుఁ డగుచు వీర, భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.
107
తే. వీరభద్రుండు విహతవిద్వేషి భద్రుఁ, డగుచుఁ దన వేయిచేతుల మొగిచి వినయ
మెసఁగ నే నేమి సేయుదు? నెఱుఁగ నాకు, ఆన తిమ్మన్న నతని క య్యభవుఁ డనియె.
108
చ. గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల నీ
వరయ వరూధినీవరుఁడవై చని యజ్ఞము గూడ దక్షునిన్‌
బరువడిఁ ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయ మంటి వే
నరిది మదంశసంభవుఁడవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్‌
109
వ. అని కుపితచిత్తుండై యాజ్ఞాపించిన నట్లకాక యని. 110
చ. అనఘుఁడు రుద్రుఁజేరి ముదమారఁబ్రదక్షిణ మాచరించి వీ
డ్కొని యనివార్యవేగమునఁ గుంభిని గ్రక్కదలన్‌ ఝళంఝళ
ధ్వని మణినూపురంబులు పదంబుల మ్రోయఁగ భీషణప్రభల్‌
దనరఁ గృతాంతకాంతకశితస్ఫుటశూలముఁ బూని చెచ్చెరన్‌.
111
చ. సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహతధూతధూళి ధూ
సరితకుబేరదిక్తటము సభ్యులు దక్షుఁడుఁ జూచి “యెట్టి భీ
కరతమ?” మంచనం, ‘దమము గాదు, రజఃపటలం’ బటంచు ని
వ్వెఱపడి పల్కి రాత్మల వివేకవిహీనతఁబొంది వెండియున్‌.
112
సీ. ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? విలయసమీరమా? పొలయ దిపుడు;
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్రశాసనుఁ డిపుడు రాజ్యంబు సేయఁ
జోరసంఘములకో రారాదు; మఱి గోగణాళి రాకకు సమయంబు గాదు;
కావున నిప్పుడు కల్పావసానంబు గాఁబోలు; గా కటు గాకయున్న
 
తే. నిట్టి యౌత్పాతికరజ మెందేనిఁ గలదె?, యనుచు మనముల భయమంది రచటి జనులు
సురలు దక్షుఁడు; నంతఁ బ్రసూతి ముఖ్య, లయిన భూసురకాంత లిట్లనిరి మఱియు.
113
క. తన కూఁతులు సూడఁగ నిజ, తనయను సతి ననపరాధఁదగవఱి? యి ట్లె
గ్గొనరించిన యీ దక్షుని, ఘనపాపవిపాక మిదియుఁ గాఁదగు ననుచున్‌.
114
వ. వెండియు నిట్లనిరి: కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు సాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింపఁజేసె; నమ్మహాత్ముం డెంతటివాఁడన్నం బ్రళయకాలంబున. 115
సీ. సుమహితనిశితత్రిశూలాగ్రసంప్రోత నిఖిలదిక్కరిరాజనివహుఁడగుచుఁ
జటులోగ్రనిష్ఠురస్తనితగంభీరాట్టహాసనిర్భిన్నాఖిలాశుఁడగుచు
భూరికరాళవిస్ఫారదంష్ట్రాహతి పతితతారాగణప్రచయుఁ డగుచు
వివిధహేతివ్రాతవిపులప్రభాపుంజ మండితచండదోర్దండుఁ డగుచు
 
తే. వికటరోషభయంకరభ్రుకుటి దుర్ని,రీక్ష్య దుస్సహతేజోమహిమఁ దనర్చి
ఘనవికీర్ణజటాబంధకలితుఁడగుచు, నఖిలసంహారకారణుండయి నటించు.
116
తే. అట్టి దేవునిఁ ద్రిపురసంహారకరునిఁ, జంద్రశేఖరు సద్గుణసాంద్రు నభవు
మనము రోషింపఁ జేసిన మంగళములఁ, బొందవచ్చునె పద్మగర్భునకునైన?
117
వ. అని యివ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముండైన దక్షునకు భయావహంబులై సహస్రసంఖ్యాతంబులైన మహోత్పాతంబులు భూనభోంతరంబులఁ గానంబడు చుండె; నా సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిలపీతవర్ణంబులు గలిగి వామనాకారులు, మకరోదరాననులునై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులు వెట్టుచుఁ గదియం జనుదెంచి దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు సేయుచుం గొందఱు ప్రాగ్వంశంబు, గొందఱు పత్నీశాలయుఁ, గొందఱు సదస్యశాలయుఁ, గొంద ఱాగ్నీధ్రశాలయుఁ, గొందఱు యజమానశాలయుఁ, గొందఱు మహానస గృహంబును విధ్వంసంబులు గావించిరి; మఱియుఁ గొందఱు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెఱచిరి; వెండియుఁ గొందఱు హోమాగ్ను లార్చిరి; పదంపడి కొందఱు హోమకుండంబులయందు మూత్రంబులు విడిచిరి; కొంద ఱుత్తరవేదిక మేఖలలు ద్రెంచిరి; కొందఱు మునుల బాధించిరి; కొందఱు తత్పత్నుల వెఱపించిరి; మరికొందఱు దేవతా నిరోధంబు గావించిరి; అంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిఁ, జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టిరి. ఇవ్విధంబున సదస్యదేవర్త్విఙ్నికాయంబుల శిలల ఱువ్వియు, జానువులఁ బొడిచియు, నఱచేతుల నడిచియు, కూర్పరంబులఁ బొడిచియు, వివిధబాధలం బఱచిన వారు కాందిశీకులై యెక్కడెక్క డేనియుంజనిరి. మఱియును- 118
క. మును దక్షుఁ డభవుఁ బలుకఁగఁ, గనుగీఁటిన భగునిఁ బట్టి కన్నులు పెకలిం
చెను నందీశ్వరుఁ డచ్చటి, జనముల హాహారవంబు సందడి గొలుపన్‌.
119
తే. కుపితుఁడై నాఁడు భవుని దక్షుఁడు శపింపఁ, బరిహసించిన పూషుని పండ్లు డుల్లఁ
గొట్టె బలభద్రుఁ డాకళింగుని రదంబు, లెలమి డులిచిన పగిదిఁ జండీశ్వరుండు.
120
క. తగవేది దక్షుఁ డా సభ, నగచాపుఁ దిరస్కరించునాఁ డట శ్మశ్రుల్‌
నగుచుం జూపుట నా భృగు, పగకై శ్మశ్రువులు వీరభద్రుఁడు వెఱికిన్‌.
121
సీ. అతులదర్పోద్ధతుండై వీరభద్రుండు గైకొన దక్షువక్షంబుఁ ద్రొక్కి
ఘనశితధారాసిఁ గొని మేను వొడిచియు మంత్రసమన్విత మహితశస్త్ర
జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుఁ జంపఁగా లేక విస్మయము నొంది
తద్వధోపాయంబు దన చిత్తమునఁ జూచి కంఠనిష్పీడనగతిఁ దలంచి
 
క. మస్తకము ద్రుంచి యంచితామర్షణమున, దక్షిణానలమున వేల్చెఁ దదనుచరులు
హర్షమును బొంద, నచటి బ్రాహ్మణజనంబు, లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ.
122
వ. ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజవాసంబైన కైలాసంబునకుఁ జనియె న య్యవసరంబున. 123
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )