పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
దక్షాదులు విష్ణువును స్తుతించుట
వ. నిటలతట ఘటిత కరపుటులై య మ్మహాత్ముని యపారమహిమం బెఱింగి నుతియింప శక్తులు గాక యుండియుఁ, గృతానుగ్రహనిగ్రహుం డగుటం జేసి తమ తమ మతులకు గోచరించిన కొలంది నుతియింపఁ దొడంగి, రందు గృహీతంబు లగు పూజాద్యుపచారంబులు గలిగి బ్రహ్మాదులకు జనకుండును, సునందనందాది పరమభాగవతజనసేవితుండును, యజ్ఞేశ్వరుండును నగు భగవంతుని శరణ్యునింగాఁ దలంచి దక్షుం డిట్లనియె. దేవా! నీవు స్వస్వరూపంబునం దున్న యప్పు డుపరతంబులు గాని రాగాద్యఖిల బుద్ధ్యవస్థలచే విముక్తుండవును, నద్వితీయుండవును, జిద్రూపకుండవును, భయరహితుండవును నై మాయం దిరస్కరించి మఱియు నా మాయ ననుసరించుచు లీలామానుషరూపంబుల నంగీకరించి స్వతంత్రుండ వయ్యును మాయా పరతంత్రుండవై రాగాది యుక్తుండునుంబోలె రామకృష్ణాద్యవతారంబులఁ గానంబడుచుందువు; గావున నీ లోకంబులకు నీవ యీశ్వరుండ వనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయావిభూతు లగుటం జేసి లోకంబులకు నీశ్వరులు గారనియును భేదదృష్టి గల నన్ను రక్షింపు; మీ విశ్వకారణులైన ఫాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకలచరాచరజంతువులును నీవ; భవద్వ్యతిరిక్తంబు జగంబున లేదని విన్నవించినఁ దదనంతరంబ ఋత్విగ్జనంబు లిట్లనిరి. 170
సీ. వామదేవుని శాపవశమునఁ జేసి కర్మానువర్తులము మే మైనకతన
బలసి వేదప్రతిపాద్యధర్మోపలక్ష్యంబైన యట్టి మఖంబునందు
దీపింప నింద్రాదిదేవతాకలితరూపవ్యాజమునఁ బొంది పరఁగు నిన్ను
యజ్ఞస్వరూపుండ వని కాని కేవలనిష్కించనుండవు నిర్మలుఁడవు
 
తే. నరయ ననవద్యమూర్తివి యైన నీదు, లలితతత్త్వస్వరూపంబుఁ దెలియఁజాల
మయ్య! మాధవ! గోవింద! హరి! ముకుంద! చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార!
171
వ. సదస్యు లిట్లనిరి. 172
సీ. శోకదావాగ్నిశిఖాకులితంబు పృథు క్లేశఘనదుర్గదుర్గమంబు
దండధరక్రూరకుండలిశ్లిష్టంబు, పాపకర్మవ్యాఘ్రపరివృతంబు
గురుసుఖదుఃఖకాకోలపూరితగర్త మగుచు ననాశ్రయ మైనయట్టి
సంసారమార్గసంచారులై మృగతృష్ణికలఁ బోలు విషయసంఘము నహమ్మ
 
తే. మేతి హేతుకదేహనికేతనములు, నయి మహాభారవహు లైనయట్టి మూఢ
జనము లే నాఁట మీ పదాబ్జములు గానఁ, జాలువారలు? భక్తప్రసన్న! దేవ!
173
వ. రుద్రుండిట్లనియె. 174
చ. వరద! నిరీహయోగిజనవర్గసుపూజిత! నీ పదాబ్జముల్‌
నిరతము నంతరంగమున నిల్పి సమగ్రభవత్పరిగ్రహ
స్ఫురణ దనర్చు నన్ను నతిమూఢులు సంతతము న్నమంగళా
చరణుఁడటంచుఁబల్క నది సమ్మతి నే గణియింప నచ్యుతా!
175
వ. భృగుండిట్లనియె. 176
మ. అరవిందోదర! తావకీనఘనమాయామోహితస్వాంతులై
పరమంబైన భవన్మహామహిమముంబాటించి కానంగ నో
పరు బ్రహ్మాదిశరీరు లజ్ఞు లయి; యో పద్మాక్ష! భక్తార్తి సం
హరణాలోకన! నన్నుఁగావఁదగు నిత్యానందసంధాయివై.
177
వ. బ్రహ్మ యిట్లనియె. 178
సీ. తవిలి పదార్థభేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవిఁజూడఁ
గలుగు నీ రూపంబు గడఁగి మాయామయం బగు; నసద్వ్యతిరిక్త మగుచు మఱియు
జ్ఞానార్థకారణసత్త్వాదిగుణముల కాశ్రయభూతమై యలరుచున్న
నిరుపమాకారంబు నీకు విలక్షణ మైయుండు ననుచు నే నాత్మఁదలఁతు
 
తే. నిర్వికార! నిరంజన! నిష్కళంక!, నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!
విశ్వసంబోధ్య! నిరవద్య! వేదవేద్య!, ప్రవిమలానంద! సంసారభయవిదూర!
179
వ. ఇంద్రుం డిట్లనియె. 180
మ. దితిసంతానవినాశసాధనసముద్దీప్తాష్టబాహాసమ
న్వితమై యోగిమనోనురాగకరమై వెల్గొందు నీ దేహ మా
యత మైనట్టి ప్రపంచముంబలెను మిథ్యాభూతముంగామి శా
శ్వతముంగా మదిలోఁదలంతు హరి! దేవా! దైవచూడామణీ!
181
వ. ఋత్విక్పత్ను లిట్లనిరి. 182
చ. కడఁగి భవత్పదార్చనకుఁ గా నిటు దక్షునిచే రచింపఁగాఁ
బడి శితికంఠరోషమున భస్మము నొంది పరేతభూమియై
చెడి కడు శాంత మేధమునఁ జెన్నఱియున్న మఖంబుఁ జూడు మే
ర్పడ జలజాభనేత్రములఁబావన మై విలసిల్లు నచ్యుతా!
183
వ. ఋషు లిట్లనిరి. 184
మ. అనఘా! మాధవ! నీవు మావలెనె కర్మారంభివై యుండియున్‌
విను తత్కర్మఫలంబు వొంద; వితరుల్‌ విశ్వంబునన్‌ భూతికై
యనయంబున్‌ భజియించు నిందిర గరం బర్థిన్‌ నినుం జేరఁ గై
కొన; వే మందుము నీ చరిత్రమునకున్‌ గోవింద; పద్మోదరా!
185
వ. సిద్ధు లిట్లనిరి. 186
చ. హరి! భవదుఃఖభీషణదవానలదగ్ధతృషార్తమన్మనో
ద్విరదము శోభనంబును బవిత్రము నైన భవత్కథాసుధా
సరిదవగాహనంబునను సంసృతితాపము వాసి క్రమ్మఱం
దిరుగదు బ్రహ్మముంగనిన ధీరుని భంగిఁ బయోరుహోదరా!
187
వ. యజమాని యగు ప్రసూతి యిట్లనియె. 188
చ. కరచరణాదికాంగములు గల్గియు మస్తము లేని మొండెముం
బరువడి నొప్ప కున్న గతిఁ బంకజలోచన! నీవు లేని య
ధ్వరము ప్రయాజలం గలిగి తద్దయు నొప్పక యున్న దీ యెడన్‌
హరి! యిటు నీదు రాక శుభ మయ్యె రమాధిప! మమ్ముఁగావవే!
189
వ. లోకపాలకు లిట్లనిరి. 190
సీ. దేవాదిదేవ! యీ దృశ్యరూపంబగు సుమహితవిశ్వంబుఁ జూచు ప్రత్య
గాత్మభూతుండ వైనట్టి నీవు నసత్ప్రకాశరూపంబులై గలుగు మామ
కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ వొందించి పంచభూతోపలక్షి
తంబగు దేహివిధంబునఁ గానంగఁ బడుదువు గాని యేర్పడిన శుద్ధ
 
తే. సత్త్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప, ధరుఁడవై కానఁబడవుగా? పరమపురుష!
యవ్యయానంద! గోవింద! యట్లు గాక, యెనయ మా జీవనము లింక నేమి కలవు?
191
వ. యోగీశ్వరు లిట్లనిరి. 192
సీ. విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవులఁ గనఁ డెవ్వఁ; డటు వానికంటెఁ బ్రియుఁడు
నీకు లేఁ; డయినను నిఖిలవిశ్వోద్భవస్థితివిలయంబుల కతన దైవ
సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశిష్టాత్మీయమాయచే నజభవాది
వివిధభేదము లొందుదువు స్వస్వరూపంబు నందుండుదువు; వినిహతవిమోహి
 
తే. వగుచు నుందువు గద! నిన్ననన్యభక్తి, భృత్యభావంబు దాల్చి సంప్రీతిఁ గొల్చు
మమ్ము రక్షింపవే? కృపామయ! రమేశ! పుండరీకాక్ష! సంతతభువనరక్ష!
193
వ. శబ్ద బ్రహ్మ యిట్లనియె. 194
చ. హరి భవదీయతత్త్వము సమంచితభక్తి నెఱుంగ నేను నా
సరసిజసంభవాదులును జాలము, సత్త్వగుణాశ్రయుండవున్‌
బరుఁడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్డు నిం
దఱముఁ జతుర్విధార్థఫలదాయక! మ్రొక్కెద మాదరింపవే!
195
వ. అగ్నిదేవుం డిట్లనియె. 196
మ. హవరక్షాచరణుండవై నెగడు దీ; వయ్యగ్నిహోత్రాది పం
చవిధంబున్‌ మఱి మంత్రపంచకసుసృష్టంబై తగం బొల్చు నా
హవరూపంబగు నీకు మ్రొక్కెదను; నీ యాజ్ఞన్‌ భువిన్‌ హవ్యమున్‌
సవనవ్రాతములన్‌ వహింతు హరి యుష్మత్తేజముం బూనుచున్‌.
197
వ. దేవత లిట్లనిరి. 198
మ. మును కల్పాంతమునందుఁ గుక్షి నఖిలంబున్‌ దాఁచి యేకాకివై
జనలోకోపరి లోకవాసులును యుష్మత్త్తత్త్వమార్గంబు చిం
తనముం జేయఁ బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం
చిన నీ రూపము నేఁడు సూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా!
199
వ. గంధర్వు లిట్లనిరి. 200
మ. హరపంకేజభవామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో
యరవిందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశసంభూతులై
పరఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్‌, దేవ! యీ
శ్వర! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవాధీశ! రక్షింపుమా!
201
వ. విద్యాధరు లిట్లనిరి. 202
సీ. నలినాక్ష! విను భవన్మాయావశంబున దేహంబు దాల్చి తద్దేహమందు
నాత్మ “నహ మ్మ” మేత్యభిమానమును బొంది పుత్త్రజాయాగృహక్షేత్రబంధు
ధనపశుముఖ వస్తుతతుల సంయోగవియోగ దుఃఖంబుల నొందుచుండు
ధృతివిహీనుఁడు నసద్విషయాతిలాలసుఁ డతిదుష్టమతియు నైనట్టివాఁడు
 
తే. దవిలి భవదీయగుణసత్కథావిలోలుఁ, డయ్యె నేనియు నాత్తమోహంబువలనఁ
బాసి వర్తించు విజ్ఞానపరతఁదగిలి, చిరదయాకార! యిందిరాచిత్తచోర!
203
వ. బ్రాహ్మణజనంబు లిట్లనిరి. దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నలినంబు ధరియించు చందంబున రసాతలగతయైన భూమి నెత్తితి; వట్టి యోగిజన స్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయనామకీర్తనంబుల సకలయజ్ఞవిఘ్నంబులు నాశంబు నొందు; నట్టి నీకు నమస్కరింతుము. 204
క. అని తన్ను సకలజనములు, వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం
చిన యా దక్షుని యజ్ఞము, ఘనముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్‌.
205
క. సకలాత్ముఁడు దా నగుటను, సకలహవిర్భోక్త యయ్యు జలజాక్షుండుం
బ్రకటస్వభాగమున న, య్యకలంకుఁడు దృప్తిఁ బొంది యనె దక్షునితోన్‌.
206
వ. అనఘా! యేనును బ్రహ్మయు శివుండును నీజగంబులకుఁ గారణభూతుల; మందు నే నీశ్వరుండను నుపద్రష్టను స్వయంప్రకాశకుండను నై గుణమయం బయిన యాత్మీయమాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్క్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందు చుండుదు; నట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నాయందు నజభవాదులను భూతగణంబులను మూఢుం డగువాఁడు వేఱుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేఱుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపండు. గావున మా మువ్వుర నెవ్వండు వేఱు సేయకుండు వాఁడు కృతార్థుం డని యానతిచ్చిన దక్షుండును. 207
క. విని విష్ణుదేవతాకం, బనఁగాఁ ద్రికపాలకలిత మగు నా యాగం
బునఁ దగ న వ్విష్ణునిపద, వనజంబులు పూజసేసి వారని భక్తిన్‌.
208
వ. మఱియును. 209
సీ. అంగప్రధానకయాగంబులను జేసి యమరుల రుద్రుని నర్థిఁ బూజ
సేసి విశిష్టేష్టశిష్టభాగమున నుదవసానకర్మంబు దవిలి తీర్చి
తాను ఋత్విక్కులుఁదగ సోమపులఁగూడి యవభృథస్నానంబు లాచరించి
కడఁక నవాప్తసకలఫలకాముఁడై తనరు దక్షునిఁ జూచి ధర్మబుద్ధి
 
తే. గలిగి సుఖవృత్తి జీవింతుకాక యనుచుఁ, బలికి దివిజులు మునులును బ్రాహ్మణులును
జనిరి నిజమందిరముల; కా జలజనయన, భవులు వేంచేసి రాత్మీయభవనములకు.
210
వ. అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనకయందు జనియించి విలయకాలంబున బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరియించె నని దక్షాధ్వరధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుడయిన యుద్ధవునకు నెఱింగించె; నతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పితి నని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె. 211
క. ఈ యాఖ్యానముఁజదివిన, ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ
ర్యాయుఃకీర్తులు గలుగును, బాయును దురితములు; దొలఁగు భవబంధంబుల్‌.
212
వ. అని వెండియు నిట్లనియె. 213
క. విను సనకాదులు నారదుఁ, డును హంసుఁడు నరుణియు ఋభుఁడు యతియుఁ గమలా
సనజులు నైష్ఠికు లనికే, తను లగుటన్‌ సాగవయ్యెఁదద్వంశంబుల్‌.
214
వ. మఱియు నధర్మునకు “మృష” యను భార్యయందు దంభుండును, “మాయ” యను నంగనయుం బుట్టిరి; అధర్మసంతానం బగు వారిరువురును మిథునం బైరి; వారిని సంతానహీనుండగు నిరృతి గైకొనియె; వారలకు లోభుండును నికృతియను సతియునుం గలిగి మిథునం బయిరి; ఆ మిథునంబునకుఁ గ్రోధుండు హింస యను నంగనయుం బుట్టి మిథునం బయిరి; ఆ మిథునంబునకుఁ గలియు దురుక్తియను నతివయు జన్మించి దాంపత్యంబు గైకొనిరి; ఆ దంపతులకు భయమృత్యువు లను మిథునంబు గలిగె; దానివలన యాతనయు నిరయంబునుం బుట్టిరి; వీరలు సంసార హేతువగు నధర్మతరుశాఖ లయి నెగడిరి; వీని శ్రేయస్కాముండగు జనుం డీషన్మాత్రంబు ననువర్తింపం జనదు; ఇవ్విధంబునం బ్రతి సర్గంబును సంగ్రహంబున వినిపించితి; ఇప్పుణ్య కథ నెవ్వండేని ముమ్మాఱు వినిన నతండు నిష్పాపుం డగునని చెప్పి మఱియు నిట్లనియె. 215
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )