పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చి వరంబు లిచ్చుట
తే. కడఁగి మఱివారు యాదృచ్ఛికమునఁ జేసి, హరికి నిత్యప్రియుండగు హరునిఁ గాంచి
యతని వలన ననుగ్రహ మంది మోక్ష, మంది రని చెప్పి, తది నిశ్చయంబు మఱియు.
897
క. హరి దర్శన పూర్వం బిహ, పరలోకములందు నా నృపాల తనయు లం
దిరి యే ఫలముల నందఱు, నిరతి నెఱింగింపు మన మునివరుఁడు వలికెన్‌.
898
క. విను జనకాదేశము ముద, మునఁ దాల్చి నృపాత్మజులు సముద్రోదరమం
దనుపమ జపయజ్ఞంబున, నొనరఁ దపం బూని ముదము నొందుచు నుండన్‌.
899
క. పదివే లేఁడులు నిష్ఠను, వదలక తప మాచరింప వారల కర్థిన్‌
సదయాంతరంగుఁ డభయ, ప్రదుఁడు సనాతనుఁడు నైన పద్మోదరుఁడున్‌.
900
క. అనుపమ శాంతము లగు నిజ, తను రశ్ములచే నృపాల తనయ తపో వే
దనలు శమింపఁగఁ జేయుచు, ననయముఁ బ్రత్యక్ష మయ్యె, నచ్యుతుఁ డంతన్‌.
901
సీ. ఘనమేరుశృంగసంగతనీలమేఘంబు, నెఱి గరుడస్కంధ నివసితుండుఁ
గమనీయ నిజదేహకాంతి విపాటితాభీలాఖి లాశాంతరాళ తముఁడు
సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర, సేవక పరిజన సేవితుండు
మండిత కాంచన కుండల రుచిరోప, లాలిత వదన కపోలతలుడుఁ
 
తే. జారు నవరత్న దివ్య కోటీరధరుఁడుఁ, గౌస్తుభప్రవిలంబ మంగళ గళుండు
లలిత పీతాంబర ప్రభాలంకృతుండు, హారకేయూర వలయ మంజీర యుతుఁడు.
902
క. లలితాయతాష్ట భుజ మం, డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ
లలనా కాంతి స్పర్ధా, కలిత లసద్వైజయంతికా శోభితుఁడున్‌.
903
క. సురగరుడ యక్షకిన్నర, నిరుపమ జేగీయ మాన నిఖిలాశా సం
భరిత యశోమహనీయ, స్ఫురణుఁడు నగు న ప్పురాణ పురుషుం డెలమిన్‌.
904
క. కరుణావలోకనంబుల, నిరవొంద నృపాలసుతుల నీక్షించి రమా
వరుఁ డంబుద గంభీర మ, ధుర భాషలఁ బలికెఁ బ్రియము దూఁకొనుచుండన్‌.
905
తే. తాపసోత్తములగు ప్రచేతసులు! వేడ్క, వినుఁడు మీరలు సౌహార్దమున నభిన్న
ధర్ము లగుట భవత్సౌహృదమున కేను, జాలఁ బరితోష మందితి సమత నేఁడు.
906
క. అనయమును మీ మనోరథ, మొనరింతు, నెఱుంగఁ బలుకుఁ డుత్తములగు మి
మ్మనుదినము నెవ్వఁడు సుఖశ, యనుఁడై మదిలోనఁ దలఁచు నా నరుఁ డెపుడున్‌.
907
క. భ్రాతృజన సౌహృదంబును, భూతదయాగుణము విమల బుద్ధియు సుజన
ప్రీతియుఁ గల్గి సుఖించును, వీత సమస్తాఘుఁ డగుచు విశ్వములోనన్‌.
908
వ. మఱియు రుద్రగీతం బయిన మదీయస్తవం బెవ్వ రనుదినంబును స్తోత్రంబు సేయుదురు, వారల కభిమత వరంబులు, శోభన కరంబగు ప్రజ్ఞయు నిత్తు, మీరలు ముదన్వితులై జనకాదేశం బంగీకరించుటం జేసి మీ కీర్తి లోకంబుల విస్తరిల్లు, మీకు ననూన బ్రహ్మగుణుండు నాత్మసంతతింజేసి లోకత్రయ పరిపూర్ణ గుణాకరుండు నైన పుత్రుండు సంభవింపంగలండు, కండు మహాముని తపోవినాశార్థంబుగా నింద్రునిచేతఁ బ్రేషిత యగు ప్రమ్లోచయను నప్సరస గర్భంబు దాల్చి య మ్మునీంద్రుని వీడ్కొని దివంబునకుం జను సమయంబునం బ్రసూతయై తత్పుత్త్రిని వృక్షంబులందుఁ బెట్టి చనిన. 909
సీ. ఆ శిశు వపుడు పేరాఁకలిచేఁ గుంది వావిచ్చి బిట్టు వాపోవుచుండ
నాలించి యటకు రాజైన సోముఁడు వచ్చి వలనొప్ప నవసుధావర్షి యైన
యాత్మీయ తర్జని నర్థిఁ బానమ్ము సేయింపంగఁ బెరిఁగి య య్యిందువదనఁ
గన్య వరారోహఁ గడఁక మారిషయను చెలువఁ బుణ్యుండు ప్రాచీనబర్హి
 
తే. యన్నృపునిచేఁ బ్రజావిసర్గావసరము, నందు వేడ్కఁ దదాదిష్టు లైన మీర
లందఱును నెయ్యమున వివాహంబు గండ, యని సరోరుహనయనుఁ డిట్లనియె మఱియు.
910
వ. అనఘాత్ములారా! యభిన్న ధర్మశీలు రయిన మీకు నందఱకు నా సుమధ్యమయైన కన్య యభిన్న ధర్మశీలయు భవ దర్పితాశయయు నయిన భార్య యగు, మీర లప్రతిహత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్యభోగంబులు మదనుగ్రహులై యనుభవించెద, రంత నా యందుల భక్తిం జేసి నిర్మలాంతఃకరణులై యీ భోగంబులు నిరయ ప్రాయంబులుఁ గాఁ దలంచి మదీయ స్థానంబు నొందెద రని వెండియు నిట్లనియె. 911
చ. అరయ గృహస్థు లయ్యును మదర్పిత కర్ములు నస్మదీయ సుం
దర చరితామృత శ్రవణ తత్పరమానస యాతయాములున్‌
సరస గుణాఢ్యులై తనరు సాధుల కీ గృహముల్‌ దలంప దు
ష్కరభవబంధ హేతువులు గావు, నృపాత్మజులార! యెన్నఁడున్‌.
912
వ. అది యెట్లంటిరేని. 913
చ. అనుపమ బ్రహ్మవాదు లగు నంచిత యోగిజనానుగీయమా
న నిజకథా సముత్సుకుఁ డనందగు నేను మదీయులంద నూ
తనముగ నుందుఁ గావున నుదారత వారికి నీ గృహావళుల్‌
ఘనభవబంధ హేతువులు గా, విది యంతయు నిక్కమారయన్‌.
914
క. సరసుఁడ నగు ననుఁ బొందిన, పురుషులు ఘనశోక మోహమోదంబులఁ బొం
దరు, గావున నెనయఁగను ద్రి, పురుషాధీశ్వరుఁడ బ్రహ్మభూతుఁడ నగుదున్‌.
915
వ. అని యిట్లు పలుకుచున్న పురుషార్థ భాజనుండగు జనార్దనుని దర్శించి తద్దర్శన విధ్వస్త రజస్తమోగుణు లయిన ప్రచేతసులు. 916
చ. కరసరసీరుహంబు లెసకం బెసఁగన్‌ ముకుళించి గద్గద
స్వరములఁ జేసి యిట్లనిరి, సర్వశరణ్యు నగణ్యు నిందిరా
వరు నజితున్‌ గుణాఢ్యు ననవద్య చరిత్రుఁ బవిత్రు నచ్యుతుం
బరుఁ బరమేశు నీశు భవబంధవిమోచనుఁ బద్మలోచనున్‌.
917
సీ. కేశవ! సంతత క్లేశనాశనుఁడవు కోరి మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవ స్థితి విలయార్థ ధారిత విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండ వతిశాంతమానసుఁడవు
 
తే. తవిలి సంసార హారిమేధస్కుఁడవును, దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూత నివాసివి సర్వసాక్షి, వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ!
918
వ. మఱియును. 919
ఉ. తోయరుహోదరాయ! భవదుఃఖహరాయ! నమో నమః పరే
శాయ! సరోజకేసర పిశంగ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ! పయోజ సన్నిభ పదాయ! సరోరుహ మాలికాయ! కృ
ష్ణాయ! పరాపరాయ! సుగుణాయ! సురారిహరాయ! వేధసే!
920
వ. అని వినుతించి. 921
చ. కమలదళాక్ష! దుఃఖలయ కారణమై తగు తావకీన రూ
పము ననివార్య దుర్భర విపద్దశ దుఃఖము నొందు మాకు నీ
సుమహిత సత్కృపాగరిమఁ జూపుట కంటె ననుగ్రహంబు లో
కమునఁ దలంప నొండొకటి గల్గునె? భక్త ఫల ప్రదాయకా!
922
ఉ. భూరి శివేతరాపహవిభూతి సమేత! మహాత్మ! దీన ర
క్షా రతి నొప్పు నీవు చిరకాలమునన్‌ సుఖవృత్తి వీరు మా
వార లటంచు బుద్ధి ననవద్య! తలంచిన యంతమాత్ర స
త్కారమె చాలు నట్లగుట గా కిటు సన్నిధి వైతి వీశ్వరా!
923
చ. అరయఁగ క్షుద్రభూత హృదయంబుల యందుల నంతరాత్మవై
తిరముగ నుండు నీవు భవదీయ పదాంబురుహ ద్వయార్చనా
పరమతు లైన మాకును శుభప్రద భూరి మనోరథంబు లీ
వెఱుఁగవె? భక్తలోక హృదయేప్సిత దాయక! ముక్తినాయకా!
924
సీ. అయినను విను సరోజాయత లోచన! వర మోక్ష మార్గ ప్రవర్తకుఁడవుఁ
బురుషార్థ భూత విస్తరుఁడవు నగు నీవు దగిలి ప్రసన్నుఁడ వగుట మాకు
నర్థి మనోభీష్టమైన వరం బయ్యె నైనను నాథ! పరాపరుండ
వైన నిన్నొక వరం బర్థింతు మనినను భువిఁ దావకీన విభూతు లెన్న
 
తే. నంత మెఱుఁగంగ రామి ననంతుఁ డనుచుఁ, బలుకుదురు నిన్ను, నది గానఁ బరమ పురుష!
యే వరం బని కోరుదు మేము? దప్పి, గొన్న బాలకుఁ డబ్ధి నీ ళ్లెన్ని గ్రోలు?
925
వ. ఇదియునుం గాక. 926
ఉ. పూని భవత్పదాంబురుహ మూల నివాసులమైన మేము మే
ధానిధి! నీ విలోకనముఁదక్కఁగ నన్యముఁ గోర నేర్తుమే?
మానిత పారిజాత కుసుమ స్ఫుట నవ్యమరందలుబ్ధ శో
భా నయశాలి యైన మధుపంబు భజించునె యన్యపుష్పముల్‌?
927
చ. హరి! భవదీయమాయ ననయంబును జెందిన నేము నిచ్చలుం
గర మనురక్తి నేది తుదిగా భవకర్ములమై ధరిత్రి పైఁ
దిరుగుదు, మంతదాఁక భవదీయజనంబులతోడి సంగతిన్‌
గురుమతి జన్మజన్మములకున్‌ సమకూరఁగఁజేయు మాధవా!
928
మ. కమలాధీశ్వర! తావకీన వర భక్త వ్రాత సంసర్గ లే
శముతోడన్‌ సరిగాఁ దలంప, మెలమిన్‌ స్వర్గాపవర్గాది సౌ
ఖ్యము లన్నన్‌ విను మానుషంబు లగు నీ కామంబులం జెప్ప నే
ల! మునీంద్ర స్తుత పాదపద్మ! సుజనాలాపానుమోదాత్మకా!
929
వ. మఱియు భగవద్భక్త సంగంబుల యందుఁ దృష్ణాప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పంబడుటచే భూతంబులయందు వైరంబును నుద్వేగంబును లేకుండు నని. 930
చ. వనముల ముక్తసంగు లగువారు నుతింపఁ దనర్తు వీవు, గా
వున నిలఁ బుణ్యతీర్థములఁ బోలఁ బవిత్రము సేయఁ బూని య
ర్థిని బదచారులై ధరఁ జరించు భవత్పదభక్తసంగమం
బనుపమభూరిసంసృతిభయస్థుని బుద్ధి రుచింపకుండునే?
931
వ. కావున. 932
చ. వనరుహ పత్త్రలోచన! భవత్సఖుఁడైన సుధాంశుమౌళి తో
డి నిమిషమాత్ర సంగతిఁ గడింది వ్రణంబును దుశ్చికిత్సము
న్ననఁ దగు జన్మరోగమున కర్మిలి వైద్యుఁడ వైన నిన్ను నే
మనయముఁ జూడఁ గంటిమి, కృతార్థులమై తగ మంటి మీశ్వరా!
933
వ. దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, గురుప్రసాదంబును, విప్రవృద్ధానువర్తనంబును, నార్యజన నమస్కరణంబును, సర్వభూతానసూయయు, నన్నవిరహితంబుగా ననేకకాలం బుదకంబులయందు సుతప్తంబయిన తపంబు సేయుటయు, నివి యన్నియును బురాణ పురుషుండవైన భవదీయ పరితోషంబు కొఱకు నగుంగాక యని విన్నవించెద మని వెండియు నిట్లనిరి. 934
మ. మను పద్మాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్‌ తపోజ్ఞాన స
త్త్వ నిరూఢిం దగువారు నీ మహిమమున్‌ వర్ణింపఁ బారం బెఱుం
గని వారయ్యును నోపినంత వినుతుల్‌ గావింతు, రట్లౌట నే
మును నిన్నర్థి నుతింతు మీశ! వరదా! బుద్ధ్యాది మూలంబుగన్‌.
935
వ. అని మఱియు సముండవు, నాదిపురుషుండవుఁ, బరుండవు, శుద్ధుండవు, వాసుదేవుండవు, సత్త్వమూర్తివి, భగవంతుండవు నైన నీకు నమస్కరించెద మని యిట్లు ప్రచేతసుల చేత నుతింపంబడి శరణ్యవత్సలుం డగు హరి సంతుష్టాంతరంగుండై వారలు కోరినయట్ల వరంబు లిచ్చిన. 936
తరల. అనయ మా నృపనందనుల్‌ ముదమార సన్నుతిఁజేయఁగా
మనములోఁబరితోషమంది రమాహృదీశుఁడు భక్త పా
లన కరుండు తదీయ దర్శన లాలసాత్మకు లాత్మలం
దనివి సాలక చూడ నాత్మపదంబు కేఁగె రయంబునన్‌.
937
వ. తదనంతరంబ ప్రచేతసులు భగవదాజ్ఞ శిరంబుల ధరియించి సముద్ర సలిల నిర్గతు లయి. 938
క. భూరి సమున్నతి నాక, ద్వార నిరోధంబు గాఁగఁ దగఁ బెరిఁగిన యా
భూరుహ సంఛన్నాఖిల,ధారుణి నీక్షించి రాజతనయులు వరుసన్‌.
939
చ. ఘనకుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో
చను గతి నుగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా
ననయముఁ జేయఁ బూనిన జనాధిపసూనుల మోముఁదమ్ముల
న్ననల సమీరముల్‌ జనన మంది కుజంబులఁ గాల్పఁ జొచ్చినన్‌.
940
క. నలినభవుఁ డా మహీజ, ప్రళయముఁ గని వచ్చి ధరణిపాల తనూజా
తుల మధురోక్తుల నుపశాం, తులఁ గావించుచును బ్రియము దూఁకొనఁ బలికెన్‌.
941
వ. అట్లు పలికి వారల నుపశమితక్రోధులం జేసిన యనంతరంబ. 942
సీ. అవశిష్ట ధరణీరుహంబులు భయ మంది తివిరి చతుర్ముఖాదేశమునను
మారిష యను సతీమణిఁ దమ కూఁతును నా ప్రచేతసులకు నర్థి నిచ్చె,
నా నరపాలక సూనులు దక్షున కరయంగ మున్నీశ్వరాపరాధ
మునఁ బ్రాప్త మైనట్టి జనపాల జన్మంబునకుఁ గారణం బైన నలిననయన
 
తే. నాదరంబునఁ గమలజు నాజ్ఞఁ జేసి, కడఁక దీపింప విధివత్ప్రకారమునను
వరుస నందఱుఁ గూడి వివాహ మైరి, గడవ వచ్చునె దైవ సంకల్ప మెందు?
943
క. కలదే జగతిం బదురు నృ, పుల కిల నొక భార్య యందుఁ బొసఁగునె? వినఁగా
నలినోదరు ఘనమాయా, కలితాద్భుతములకు నతులు గావింపఁదగున్‌.
944
వ. అంతఁ జాక్షుషమన్వంతరంబున దైవచోదితుండై యిష్ట ప్రజాసర్గంబు గావించుచుఁ బ్రతిశుద్ధుండైన దక్షుండు పూర్వ దేహంబు గాల విద్రుతం బగుచుండం బ్రచేతసులకు న మ్మారిష యను భార్యయందు సంభవించి నిజకాంతిం జేసి సమస్త తేజోధనుల తేజంబును బిహితంబుగాఁ జేయుచుఁ గర్మ దాక్ష్యంబున దక్షుండను నామంబు వహించి బ్రహ్మచేతం బ్రజాసర్గ రక్షయందు నియోగింపంబడి మరీచ్యాదులం దత్త ద్వ్యాపారంబులందు నియోగించి యుండె, నంత. 945
సీ. ఒనరఁ బ్రచేతసు లుత్పన్న విజ్ఞాను లగుచు వేగంబ నారాయణోక్తిఁ
దలఁచుచు నాత్మనందను కడ నిజభార్య నిడి వనవాసులై కడఁగి మున్ను
జాబాలి యను మునీశ్వరుఁడు సిద్ధుండైన భూరి పశ్చిమ వార్ధి తీరమునను
సర్వభూతాత్మ విజ్ఞానంబు గల యాత్మ ఘన విమర్శకృత సంకల్పులైరి
 
తే. యంత నచటికి సమ్మోద మతిశయిల్ల, నరసురాసుర యక్ష కిన్నర వరేణ్య
మానితోన్నత సంపూజ్య మానుఁడైన, నారదుండు వివేక విశారదుండు.
946
వ. చనుదెంచి నిర్జితప్రాణ మనో వాగ్దర్శనులును జితాసనులును శాంతులును నసమాన విగ్రహులును నిర్మలంబైన పరబ్రహ్మంబు నందు నియోజితంబైన యంతఃకరణంబును గలవారును నైన రాజనందనుల కడ నిలిచిన. 947
క. చనుదెంచిన నారదమునిఁ, గనుఁగొని నృపసుతులు లేచి కౌతుక మొప్పన్‌
వినమితులై సముచిత పూ, జనములఁ బరితుష్టుఁ జేసి సద్వినయమునన్‌.
948
చ. అనఘ! మునీంద్ర చంద్ర! భవదాగమనంబు సమస్త లోక శో
భన మగు, నస్మదీయమగు భాగ్యవశంబున నేఁడు విశ్వ పా
వన! నినుఁ జూడఁగంటి మనివార్య భవద్భ్రమణంబు లోక లో
చనుగతి వోలెఁ బ్రాణులకు సర్వ భయాపహరంబు గావునన్‌.
949
వ. అని మఱియు నిట్లనిరి. 950
సీ. ‘అనఘాత్మ! భగవంతులైన కేశవ వామదేవులచే నుపదిష్టమైన
యాత్మతత్త్వంబు గృహస్థుల మగు మాకు ననయంబు విస్మృతం బయ్యె నట్టి
కలిత తత్త్వార్థ ప్రకాశకంబును భూరి ఘోర సంసారాబ్ధి తారకంబు,
నై కర మొప్పారు నాత్మతత్త్వము నేఁడు చిరదయామతిఁ బ్రకాశింపఁ జేయు’
 
తే. మని ప్రచేతసు లర్థిఁ బల్కినఁ జెలంగి, భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుఁడు
నఖిలలోక విహారుండు నైన యట్టి, నారదుఁడు వల్కె నా రాకుమారులకును.
951
సీ. చర్చింప నరుల కే జన్మ కర్మాయుర్మనో వచనంబుల దేవదేవుఁ
డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపఁబడెడు
నవియ పో, జన్మ కర్మాయుర్మనో వచనములని ధరణి నెన్నంగఁ దగును
వనరుహనాభ సేవా రహితము లైన జననోపనయన దీక్షాకృతంబు
 
తే. లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల? వేద చోదిత యగు కర్మవితతి యేల?
జప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?, మహిత నానావధాన సామర్థ్య మేల?
952
వ. మఱియు హరి విరహితంబైన యింద్రియ పాటవంబును నిపుణయైన బుద్ధియుఁ బ్రాణాయామాది యోగంబును దేహాది వ్యతిరిక్తాత్మ జ్ఞానంబును సన్న్యాసాధ్యయనంబులును దక్కిన వ్రతవైరాగ్యాది శ్రేయస్సాధనంబులును నేల? సర్వేశ్వరుండు సమస్త శ్రేయస్స్వరూపుండును సమస్త శ్రేయో0000వధిభూతుండును సర్వభూతావాసుండును సర్వభూతాత్మప్రదుండును సర్వభూత ప్రియుండును సర్వవ్యాపకుండునుం గావున. 953
మ. కమలాధీశ్వరుఁ బూజ సేయుట సమగ్ర ప్రీతిఁ బ్రాణోపహా
రము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్ష్మాజమూలాభిషే
కము శాఖాభుజపుష్టిదంబు నగు రేఖన్‌ సర్వదేవార్హణ
క్రమమై యొప్పు ధరావరేణ్య సుతులారా! బుద్ధి నూహించినన్‌.
954
వ. అదియునుం గాక. 955
క. పెను పగు వర్షాకాలం, బున దిననాయకుని వలనఁ బొడమిన సలిలం
బనయముఁ గ్రమ్మఱ గ్రీష్మం, బున సూర్యునియందు డిందుపోలిక మఱియున్‌.
956
క. ధరణిఁ జరాచర భూతము, లరయఁగ జనియించి యందె యణఁగిన పగిదిన్‌
హరిచేఁ బుట్టిన విశ్వము, హరియందె లయంబు నొందు, నది యెట్లన్నన్‌.
957
మ. అరయన్నభ్రతమఃప్రభల్‌ మును నభంబం దొప్పఁగాఁ దోఁచి క్ర
మ్మఱ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులుం
బరికింపం ద్రిగుణ ప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మఱన్‌
విరతిం బొందుచు నుండుఁ గావున హరిన్‌ విష్ణున్‌ భజింపం దగున్‌.
958
వ. మఱియును సమస్త దేహులకు నాత్మయు, నిమిత్త భూతుండును, నద్వితీయుండును శశ్వత్ప్రకాశుండును, బ్రధాన పురుషుండును, స్వతేజో విధ్వస్త గుణప్రవాహుండును, మానస బుద్ధి సుఖేచ్ఛా ద్వేషాది వికల్పరహితుండును, నగుణుండును దేహాత్మ భ్రమ నివృత్త్యుపలభ్యుండును, నాది మధ్యాంత రహితుండును, నిత్యానంద స్వరూపుండును, సర్వజ్ఞుండును, బరమేశ్వరుండు నైన నారాయణు నభేదబుద్ధింజేసి భజింపుం, డతండు సర్వభూత దయయు నెంతమాత్రంబు సంభవించు నంతమాత్రంబున సంతుష్ట చిత్తులును, సర్వేంద్రియోపశాంతులును నగు పురుషులయెడ సంతుష్టుం డగు నని వెండియు నిట్లనియె. 959
చ. చతురత నట్టి యీశ్వరుఁడు సజ్జనలోక నిరస్త సర్వ కా
మిత విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
పితుఁ డగుచున్‌ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‌.
960
క. శ్రుత ధన కుల ధర్మ సము, న్నత మదములఁ జేసి సజ్జన ప్రతతికి సం
తతమును నెగ్గొనరించు కు, మతు లర్థిం జేయు పూజ మతిఁ గొనఁ డెందున్‌.
961
వ. అది యెట్లనిన. 962
సీ. వలనొప్పఁ దను ననువర్తించు నిందిరా కామినీ మణిఁ దదాకాంక్షు లగుచు
ధృతి ననువర్తించు దేవేంద్రముఖ్యుల నే ననువర్తింప కెప్పు డాత్మ
నిత్య స్వతంత్రుని నిజభక్త వరదుని దీనవత్సలు గుణాధీశు నజునిఁ
బురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణునిఁ జిదానందమయుని
 
తే. నజితు నచ్యుతుఁ బుండరీకాయతాక్షుఁ, దవిలి సేవింపకుండునే? ధర కృతజ్ఞుఁ
డైన పురుషుండు సమ్మోదితాత్ముఁ డగుచుఁ, జారుమతులార! రాజకుమారులార!
963
వ. అని మఱియు నిట్లనియె, భవదీయ వంశ ధుర్యుండుఁ జిత్రరథుండు నగు ధ్రువుండు సపత్నీమాతృ వాగ్బాణ భిన్న హృదయుండై పంచవర్షార్భకుం డగుచుఁ దపోవనంబున కరుగు నపుడు మార్గంబున నాచే నుపదిష్టంబైన క్రమంబున భగవంతుండగు పుండరీకాక్షు నారాధించి యితరులచే నొందరాని సర్వోత్తమంబగు పదంబు నొందెఁ గాన మీరును రుద్రోపదేశ క్రమంబున సర్వభూతాంతర్యామి యగు నీశ్వరు భవచ్ఛేదంబునకై భజియింపుడు. 964
క. అని యివ్విధమున నారద, ముని రాజకుమారులకును ముదము దలిర్పన్‌
వనజోదరు సచ్చరితము, వినిపించి సరోజభవుని వీటికిఁ జనియెన్‌.
965
వ. అట్లు నారదుండు సనిన యనంతరంబ. 966
చ. నరవర నందనుల్‌ గడఁక నారద వక్త్ర వినిర్గతంబు సుం
దరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై
పరఁగిన విష్ణుసద్యశము భక్తి నుతించి ముకుందచింతనా
నిరుపమ భక్తిఁజెంది హరినిత్యపదంబును బొంది రున్నతిన్‌.
967
వ. అని మైత్రేయుండు విదురున కిట్లనియె. మహాత్మా! నీవు నన్నడిగిన ప్రచేతో నారద సంవాద రూపంబైన హరికీర్తనంబు మను పుత్త్రుండైన యుత్తానపాదుని వంశప్రకారంబును జెప్పితి నని వెండియు నిట్లనియె. నారదు వలనం బ్రియవ్రతుం డాత్మ విజ్ఞానంబు నొంది మహీమండలంబుఁ బరిపాలించి యనంతరంబునఁ బుత్త్రులకు రాజ్యంబుఁ బంచి యిచ్చి పరలోకగతుం డయ్యె, ననిన. 968
క. విని విదురుం డా మునివరు, ఘన చరణము లాత్మమస్తకంబున మధు సూ
దను చరణాంభోరుహములు, మనమునఁ దగఁ దాల్చి పలికె మైత్రేయునితోన్‌.
969
క. మునినాథ చంద్ర! కరుణా, వననిధి! నీ చేత భక్త వత్సలుఁడగు నా
వనజాక్షు తత్త్వ మెఱిఁగితి, నని తత్పదములకు వినతుఁడై వినయమునన్‌.
970
క. ఆ మునిచే నా మంత్రితుఁ, డై మనమున బంధు దర్శనాకాంక్షితుఁడై
ధీ మహితుఁడైన విదురుఁడు, సామజపురమునకుఁ జనియె సమ్మద మొప్పన్‌.
971
క. అని శుకుఁడు పరీక్షిత్తున, కనుకంపం జెప్పె నీ యుపాఖ్యానంబున్‌
వినువాఁ డైశ్వర్యాయు, ర్ధన కీర్తి స్వస్తి గతులఁ దగఁ బ్రాపించున్‌.
972
క. అని శుకయోగి పరీక్షి, జ్జనపాల సుధాపయోధి చంద్రున కర్థిన్‌
వినిపించిన కథ మోదం, బున సూతుఁడు శౌనకాది మునులకుఁ జెప్పెన్‌.
973
చ. సరస వచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ
భరణ ధురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర! రాజ శే
ఖర! ఖర దూషణ ప్రముఖ గాఢ తమః పటల ప్రచండ భా
స్కర! కఱకంఠ కార్ముక విఖండన ఖేలన! భక్త పాలనా!
974
క. శర విదళిత సారంగా!, సరస దయాపాంగ! భక్త జలధితరంగా!
దురిత ధ్వాంత పతంగా!, వర జనకసుతానుషంగ! వననిధి భంగా!
975
మాలిని. సుర విమత విదారీ! సుందరీ శంబరారీ!
సరస వినుత సూరీ! సర్వలోకోపకారీ!
నిరుపమ గుణ హారీ! నిర్మలానంద కారీ!
గురుసమర విహారీ! ఘోర దైత్య ప్రహారీ!
976
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్త్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబునందు స్వాయంభువ మనువునకు నాకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతోత్తాన పాదులు జన్మించుటయు, నందు నాకూతిని రుచి ప్రజాపతికి నిచ్చుటయు, నా రుచి ప్రజాపతికి నాకూతి దేవియందు శ్రీ విష్ణు మూర్త్యంశజుండైన యజ్ఞుండును, లక్ష్మీ కళాంశజ యగు దక్షిణ యను కన్యకయు నుద్భవించుటయు, మనుపుత్రియైన దేవహూతిని గర్దమున కిచ్చుటయుఁ, బ్రసూతిం దక్ష ప్రజాపతి కిచ్చుటయుఁ, బ్రసూతి దక్షుల వలనం బ్రజాపరంపరలు గలుగుటయు, మఱియుం గర్దమ ప్రజాపతి పుత్త్రికా సముదయంబును క్షత్త్ర బ్రహ్మర్షుల కిచ్చుటయుఁ గర్దమ పుత్త్రి యైన కళవలన మరీచికిం గశ్యపుం డను పుత్రుండును బూర్ణిమ యను కూఁతురుం బుట్టుటయును, బూర్ణిమవలన గంగయు విరజుం డనెడు కుమారుండును జన్మించుటయు, గశ్యపప్రజాపతివలన నయిన ప్రజా పరంపరలచే ముల్లోకంబు లాపూర్ణంబు లగుటయు, నత్రిమహాముని తపంబును, నతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షం బగుటయు, ననసూయా పాతివ్రత్య మాహాత్య్మంబు వలన ననసూయాత్రులకుం ద్రిమూర్తుల కళాంశజు లయిన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును, దక్షాత్మజల జన్మంబును, భృగువువలన ఖ్యాతి యను నంగనకు శ్రీమహాలక్ష్మి జన్మించుటయును, భృగుపౌత్రుం డయిన మార్కండేయు జన్మంబును, ధర్మునకు మూర్తివలన నర నారాయణులు సంభవించుటయును, సత్త్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును, దక్షాధ్వర ధ్వంసంబును, బ్రహ్మచేఁ బ్రార్థితుండై శివుండు దక్షాదుల ననుగ్రహించుటయును, దక్షాదికృత శ్రీహరి స్తవంబును, శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా ననుగ్రహించుటయును, సతీదేవి హిమవంతునకు జనించి హరునకుం బ్రాప్తించుటయు, నుత్తానపాదుని వృత్తాంతంబును, ధ్రువోపాఖ్యానంబును, ధ్రువుండు దండ్రిచేత నవమానితుండై నారదోపదేశంబున మధువనంబునకుం జని తపంబు సేయుటయును, హరి ప్రసన్నుండై యతని మనోరథంబు లిచ్చుటయును, నతండు మరలఁ బురంబునకు వచ్చుటయు, గుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును, ధ్రువుండు యజ్ఞంబులు సేయుచు రాజ్య భోగంబులం దనిసి తనయు నుల్కలునిం బట్టంబు గట్టి హరియనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు, నుల్కలుండు వత్సరుం డను తన సుతనిఁ బట్టంబు గట్టి హరిం జేరుటయు, వత్సరుని వంశపరంపరయు, నందు నంగుని సుతుండయిన వేను కళేబరంబున లక్ష్మీనారాయణుల యంశంబున నర్చియు బృథుండును జన్మించుటయుఁ, బృథుండు భూమిం గామధేనువురీతి నఖిల వస్తువులుం బిదుక నియమించి నిమ్నస్థలిం జేసి యింద్రుండు వశవర్తియై యుండ బహు యజ్ఞంబులు సేసిన నతనికి హరి ప్రత్యక్షం బగుటయు, నధ్యాత్మ ప్రబోధంబును, నింద్రుని వలనఁ బాషండ సంభవంబును, నింద్రుని జయించిన విజితాశ్వుని నతని తమ్ములను బృథివీపాలనంబునకు నిలిపి పృథుండు నర్చియుం బరమపదప్రాప్తు లగుటయు, విజితాశ్వునకు వసిష్ఠు శాపంబునం ద్రేతాగ్నులు దనయులై జనించుటయుఁ, బృథుని పౌత్త్రుండయిన ప్రాచీనబర్హి రాజ్యంబును నతని యజ్ఞంబు లసంఖ్యాతంబులైన నారదుండు మాన్పం దలంచి పురంజనుకథ నధ్యాత్మ ప్రపంచంబుగాఁ దెలుపుటయుఁ, బ్రాచీనబర్హి సుతులయిన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరి స్తవంబుపదేశించుటయుఁ, బ్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షం బగుటయు, వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివవిద్వేష ప్రయుక్త శాపంబునం బుత్త్రుండై జనియించుటయును, బ్రచేతసులు ముక్తికిం జనుటయును, విదురుండు మైత్రేయుని వీడ్కొని హస్తి పురంబున కరుగుటయు నను కథలు గల చతుర్థ స్కంధము. 977
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )