పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము సప్తమస్కంధము
నారదుండు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మంబులు తెలుపుట
సీ. అనఘాత్మ! సకలవర్ణాశ్రమాచార సమ్మత ధర్మ మెయ్యది మానవులకు?
నే ధర్మమున నరుం డిద్ధ విజ్ఞానము భక్తియుఁబ్రాపించుఁ? బద్మజునకు
సాక్షాత్సుతుండవు, సర్వజ్ఞుఁడవు, నీకు నెఱుఁగ రానిది ధర్మమింత లేదు,
నారాయణ పరాయణస్వాంతు లనఘులు శాంతులు సదయులు సాధువృత్తి
 
ఆ. మెఱయుచున్న ఘనులు మీ వంటివా రెద్ది, పరమధర్మ మనుచు భక్తిఁదలఁతు?
రట్టి ధర్మరూప మఖిలంబు నెఱిఁగింపు, వినఁగ నిచ్చ గలదు విమలచరిత!
408
వ. అనిన నారదుండు ధర్మరాజుం జూచి దాక్షాయణియందు నిజాంశంబున నవతరించి, భువన శోభనంబు కొఱకు బదరి కాశ్రమంబునఁ దపోనిరతుండయి యున్న నారాయణునివలన సనాతనంబగు ధర్మంబు వింటి, నది సెప్పెద, సకల వర్ణంబుల జనులకు సత్యంబును, దయయును, నుపవాసాది తపంబును, శౌచంబును, సైరణయు, సదసద్వివేకంబును, మనోనియమంబును, బహిరింద్రియ జయంబును, హింస లేమియు, బ్రహ్మచర్యంబును, దానంబును, యథోచితజపంబును, సంతోషంబును, మార్దవంబును, సమదర్శనంబును, మహాజనసేవయు, గ్రామ్యంబు లయిన కోరికలు మానుటయు, నిష్ఫలక్రియలు విడుచుటయు, మితభాషిత్వంబును, దేహంబుగాని తన్ను వెదకి కొనుటయు, నన్నోదకంబులు ప్రాణులకుం బంచి యిచ్చుటయుఁ బ్రాణులందు దేవతాబుద్ధియు, నాత్మబుద్ధిం జేయుటయు, శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మ సమర్పణ సఖ్యంబు లనియెడి త్రింశల్లక్షణంబులు గలుగ వలయు, నందు సత్కులాచారుండయి మంత్రవంతంబులైన గర్భాధానాది సంస్కారంబు లవిచ్ఛిన్నంబులుగాఁ గలవాఁడు ద్విజుండు. ద్విజునకు యజన యాజ నాధ్యయ నాధ్యాపన దాన ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు విహితంబులు. రాజునకుఁ బ్రతిగ్రహ వ్యతిరిక్తంబులయిన యజనాది కర్మంబు లయిదును బ్రజాపాలనంబును, బ్రాహ్మణులు గానివారివలన దండశుల్కాదులు గొనుటయు, విహితకర్మంబులు, వైశ్యునికిఁ గృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులు, బ్రాహ్మణ కులానుసరణంబును విహితంబులు, శూద్రునకు ద్విజశుశ్రూష సేయవలయును. 409
సీ. విను, కర్షణాదికవృత్తికంటెను మేలు యాచింప నొల్లని యట్టి వృత్తి
ప్రాప్తంబుఁగైకొని బ్రదుకుకంటెను లెస్స యనుదినంబును ధాన్య మడిగికొనుట
యాయవారముకంటె నధికకళ్యాణంబు పఱిగ యెన్నుల ధాన్యభక్షణంబు
శిలవృత్తికంటెను శ్రేయ మాపణములఁ బడ్డ గింజలు దిని బ్రదుకుఁ గనుట
 
ఆ. యెడరుచోట నృపతి కీ నాల్గువృత్తులుఁ, దగుఁ, బ్రతిగ్రహంబు దగదు తలఁప
నాపదవసరముల నధముఁడెక్కువజాతి, వృత్తి నున్న దోషవిధము గాదు.
410
వ. వినుము. శిలవృత్తియు నుంఛవృత్తియు ఋత మనియు, నయాచితవృత్తి యమృత మనియు, నిత్యయాచ్ఞావృత్తి మృత మనియుఁ, గర్షకవృత్తి ప్రమృత మనియు నెన్నుదు, రట్టి వృత్తుల జీవించుట మేలు, వాణిజ్యంబు సత్యానృత మనియు, శ్వవృత్తి నీచసేవ యనియుఁ బలుకుదురు, సర్వవేదమయుండు బ్రాహ్మణుండు, సర్వదేవమయుండు క్షత్రియుండు. బ్రాహ్మణక్షత్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబు గాదు. 411
క. దమమును శౌచముఁ దపమును, శమమును మార్దవముఁ గృపయు సత్యజ్ఞాన,
క్షమలును హరిభక్తియు హ, ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!
412
ఉ. శౌర్యము దానశీలముఁబ్రసాదము నాత్మజయంబుఁ దేజమున్‌
ధైర్యము దేవభక్తియును ధర్మము నర్థముఁ గామమున్‌ బుధా
చార్యముకుందసేవలును సత్కృతియుం బరితోషణంబు స
ద్వీర్యము రక్షణంబుఁ బృథివీవరశేఖర! రాజచిహ్నముల్‌.
413
క. ధర్మార్థకామవాంఛయు, నిర్మలగురుదేవవిప్రనివహార్చనముల్‌
నిర్మదభావముఁబ్రమదము, శర్మకరత్వమును వైశ్యజనలక్షణముల్‌.
414
ఉ. స్తేయము లేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్‌ నిజేశులన్‌
మాయలు లేక డాయుటయు మంత్రము సెప్పక పంచయజ్ఞముల్‌
సేయుటయున్‌ ధరామరుల సేవయు గోవుల రక్షణంబు న
న్యాయము లేమియున్‌ మనుజనాథ! యెఱుంగుము శూద్రధర్మముల్‌.
415
సీ. నిలయము పాటించి నిర్మలదేహయై శృంగార మే ప్రొద్దుఁజేయవలయు
సత్యప్రియాలాపచతురయై ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింపవలయు
దాక్షిణ్య సంతోష ధర్మమేధాదుల దైవత మని ప్రియుఁదలఁపవలయు
నాథుఁ డే పద్ధతి నడచు నా పద్ధతి నడచి సద్బంధుల నడపవలయు
 
ఆ. మార్దవమునఁ బతికి మజ్జన భోజన, శయన పాన రతులు జరపవలయు
విభుఁడు పతితుఁడైన వెలఁది ప్రాతివ్రత్య, మహిమఁబుణ్యుఁజేసి మనుపవలయు.
416
క. తరుణి దన ప్రాణవల్లభు, హరిభావముగా భజించి యతఁడును దానున్‌
సిరి కైవడి వర్తించును, హరిలోకమునందు సంతతానందమునన్‌.
417
క. ఉపవాసంబులు వ్రతములుఁ, దపములు వేయేల? భర్త దైవత మని ని
ష్కపటతఁగొల్చిన సాధ్వికి, నృపవర! దుర్లభము లేదు నిఖిలజగములన్‌.
418
వ. మఱియు సంకర జాతులయిన రజక చర్మకారక నట బురుడ కైవర్తక మేద భిల్లురగు నంత్యజాతు లేడ్వురకును జండాల పుల్కస మాతంగ జాతులకును నా యా కులాగతంబులయిన వృత్తులఁ జౌర్య హింసాదులు వర్జించి సంచరింపవలయు, మానవులకుఁ బ్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబు లని వేదవిదులైన పెద్దలు సెప్పుదురు, కారుకారున దున్నెడు క్షేత్రంబు లావు సెడు, నందుఁ జల్లిన బీజంబులు నిస్తేజంబులై యుండి లెస్సగ నంకురింపవు, నిరంతర ఘృత ధారా వర్షంబున దహనంబునకు దాహకత్వంబు లేక శాంతిం జెందు, నందు వేల్చిన హవ్యంబులు ఫలింపవు, తద్విధంబున ననవరత కామానుసంధానంబునఁ గామోన్ముఖంబైన చిత్తంబు కామంబులఁ దనిసి నిష్కామంబై విరక్తి నొందుం గావున సత్త్వ స్వభావంబు తోడ నెప్పుడుఁ దప్పక నిజవంశానుగత విహిత ధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నొందు, జాతిమాత్రంబునఁ బురుషునికి వర్ణంబు నిర్దేశింపం బనిలేదు. శమదమాది వర్ణ లక్షణ వ్యవహారంబులఁ గనవలయు నని మఱియు నారదుం డిట్లనియె. 419
క. క్రమమున వర్ణంబుల చి, హ్నము లెల్లను జెప్పఁబడియె నాశ్రమముల ధ,
ర్మము లెఱిఁగించెద నన్నియు, సమదాహితహృదయశూల! సదమలశీలా!
420
వ. వినుము బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పలాశదండ కమండలు ధరుండును. సంస్కారహీన శిరోరుహుండును, దర్భహస్తుండును, శీల ప్రశస్తుండును, మౌనియునై త్రిసంధ్యంబును బ్రహ్మ గాయత్రి జపియించుచు, సాయం ప్రాత రవసరంబుల నర్కపావక గురుదేవతోపాసనంబులు సేయుచు, గురుమందిరంబునకుం జని దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులు గలిగి వేదంబులు చదువుచు నధ్యయనోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు, రేపు మాపును విహిత గృహంబుల భిక్షించి భైక్షంబు గురువునకు నివేదించి యనుజ్ఞ గొని మిత భోజనంబు గావించుచు, విహిత కాలంబుల నుపవసించుచు నంగనలందు నంగనాసక్తులందుం బ్రయోజన మాత్రభాషణంబు లొనర్చుచు, గురు పరాంగనలవలన నభ్యంగకేశ ప్రసాధన శరీర మర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు, గృహంబున నుండక జితేంద్రియత్వంబున సత్యభాషణుండయి సంచరింపవలయు. 421
ఆ. పొలఁతి దావవహ్ని; పురుషుఁడాజ్యఘటంబు, కరఁగకుండరాదు కదిసెనేని,
బ్రహ్మయైనఁ గూఁతుఁ బట్టకమానఁడు, వడుగు కింతి పొత్తు వలదు వలదు.
422
వ. వినుము. స్వరూప సాక్షాత్కారంబున దేహి బహిరింద్రియాదికం బయిన యంతయు నాభాస మాత్రంబుగా నిశ్చయించి యెందాఁక జీవుండు స్వతంత్రుం డయిన యీశ్వరుండు గాకుండు, నంతదడవు నంగన యిది, పురుషుండ నే ననియెడి బుద్ధిమానుట కర్తవ్యంబు గాదు, బ్రహ్మచారి యతి గృహస్థులం దెవ్వఁడైనఁ జిత్తంబు పరిపక్వంబుగాక యద్వైతానుసంధానంబు సేసిన మూఢుండగుం గావున, రహస్యంబునం బుత్త్రిక నైనం డాయకుండవలయు. 423
చ. శిరమున మేన సంస్కృతులు సేయక చందనభూషణాద్యలం
కరణము లెల్ల మాని ఋతుకాలమునన్‌ నిజభార్యఁబొందుచుం
దరుణులఁజూడఁబాఱక ధృతవ్రతుఁడై మధుమాంసవర్జియై
గురుతరవృత్తితో మెలఁగు కోవిదుఁడొక్క గృహస్థు భూవరా!
424
వ. మఱియు ద్విజుండు గృహస్థుండై గురువుల వలన నుపనిషదంగసహితంబైన వేదత్రయంబును పఠియించి నిజాధికారానుసారంబుగ నర్థవిచారంబు సేసి తన బలంబు కొలంది గురువులకు నభీష్టంబు లొసంగి గృహంబున నొండె, వనంబున నొండె, నైష్ఠికత్వంబు నాశ్రయించి, ప్రాణులతోడ జీవించుచు గురువునందు, నగ్నియందు నాత్మయందు సర్వభూతంబులందు నచ్యుతదర్శనంబు సేయుచు నింద్రియ వ్యసనాదిమగ్నుండు గాక యెఱుక గలిగి వర్తించుచుఁ బరబ్రహ్మంబు నొందు. 425
క. వినుము వనప్రస్థునకున్‌, మునికథితము లైన నియమములు గల వాచొ
ప్పున వనగతుఁడై మెలఁగెడి, ఘనుఁడు మహర్లోకమునకు గమనించు నృపా!
426
వ. అటమీఁద గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుంజని, దున్నక పండెడి నీవారాదికంబు లగ్నిపక్వంబుసేసి యొండె నామంబులు సేసియొండె నర్కపక్వంబులైన ఫలాదులొండె భక్షించుచు వన్యాహారంబుల నిత్యకృత్యంబులయిన చరుపురోడాశంబు లొనర్చుచుఁ, బ్రతిదినంబును బూర్వ సంచితంబులు పరిత్యజించి నూతనద్రవ్యంబులు సంగ్రహించుచు నగ్ని కొఱకుఁ బర్ణశాలయైనఁ బర్వత కందరం బయిన నాశ్రయించుచు, హిమ వాయు వహ్ని వర్షాతపంబులను సహించుచు, నఖ శ్మశ్రు కేశ తనూరుహంబులు ప్రసాధితంబులు సేయక, జటిలుం డై వసియించుచు, దండాజిన కమండలు వల్కల పరిచ్ఛదంబులు ధరియించి పండ్రెండైన, నెనిమిదైన, నాలుగైన, రెండైన నొక వత్సరంబయినఁ దపః ప్రయాసంబున బుద్ధినాశంబు గాకుండ మునియై చరించుచు, దైవవశంబున జరారోగంబుల చేతఁజిక్కి నిజధర్మానుష్ఠాన సమర్థుండు గాని సమయంబున నిరశనవ్రతుఁడయి యగ్నుల నాత్మారోపణంబులు సేసి సన్న్యసించి యాకాశంబునందు శరీర రంధ్రంబులును, గాలియందు నిశ్శ్వాసంబును, దేజంబు లోపల నూష్మంబును, జలంబుల రసంబును, ధరణియందు శల్యమాంస ప్రముఖంబులును, వహ్నియందు వక్తవ్యంబుతోడ వాక్కును, నింద్రునియందు శిల్పంబుతోడఁ గరంబులును, విష్ణునియందు గతితోడఁ బదంబులును, బ్రజాపతి రతితోడ నుపస్థంబును, మృత్యువందు విసర్గంబుతోడఁ బాయువును, దిక్కులందు శబ్దంబుతోడ శ్రోత్రంబును, వాయువందు స్పర్శంబుతోడఁ ద్వక్కును, సూర్యుని యందు రూపంబుతోడఁ జక్షువులును, సలిలంబులందుఁ బ్రచేతస్సహితయయిన జిహ్వయు, క్షితియందు గంధసహితంబయిన ఘ్రాణంబును, జంద్రునియందు మనోరథంబులతోడ మనంబును, గవియైన బ్రహ్మయందు బోధంబుతోడ బుద్ధియు, రుద్రునియం దహంకారంబుతోడ మమత్వంబును, క్షేత్రజ్ఞునియందు సత్త్వంబుతోడఁ జిత్తంబును, బరంబునందు గుణంబులతోడ వైకారికంబును డిందించి యటమీఁదఁ బృథివిని జలంబునందును, జలంబును దేజంబు నందును, దేజంబును వాయువునందును, వాయువును గగనంబునందును, గగనంబును నహంకార తత్త్వంబునందును, నహంకారంబును మహత్తత్త్వంబునందును, మహత్తత్త్వంబును బ్రకృతియందును, బ్రకృతి నక్షరుండైన పరమాత్మయందును లయంబు నొందించి, చిన్మాత్రావశేషితుం డయిన క్షేత్రజ్ఞుని నక్షరత్వంబున నెఱింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వహ్నిచందంబునఁ బరమాత్మయైన నిర్వికార పరబ్రహ్మంబునందు లీనుండు గావలయు. 427
క. అనఘ! వనప్రస్థుండై, చని తద్ధర్మంబు లిట్లు సలుపుచు మఱియున్‌
మనెనేని సన్న్యసింపం, జను నటమీఁదటను ముక్తసంగత్వమునన్‌.
428
వ. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి సన్న్యసించి దేహమాత్రావశిష్టుండును, సర్వభూత నిరపేక్షుండును, భిక్షుండును, నిరాశ్రయుండును, నాత్మారాముండును, సర్వభూతసముండును, శాంతుండును, సమచిత్తుండును, నారాయణ పరాయణుండును నై కౌపీనంబను నాచ్ఛాదన మాత్రంబైన వస్త్రంబు ధరియించి దండాది వ్యతిరిక్తంబులు విసర్జించి యాత్మపరంబులు గాని శాస్త్రంబులు వర్జించి గ్రహనక్షత్రాది విద్యలనభ్యసింపక భేదవాదంబులైన తర్కంబులు తర్కింపక యెందును బక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి యుపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాది వ్యాపారంబుల నుల్లసిల్లక, పెక్కు దినంబు లొక్కయెడ వసింపక యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచుఁ, గార్యకారణ వ్యతిరిక్తంబైన పరమాత్మయందు విశ్వంబు దర్శించుచు, సదసన్మయంబైన విశ్వంబునందుఁ బర బ్రహ్మంబయిన యాత్మ నవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల నాత్మనిరీక్షణంబు సేయుచు, నాత్మకు బంధమోక్షణంబులు మాయా మాత్రంబులు గాని వస్తుప్రకారంబున లేవనియును, దేహంబునకు జీవితంబు ధ్రువంబు గాదనియును, మృత్యువు ధ్రువం బనియును నెఱుంగుచు, భూతదేహంబుల సంభవనాశంబులకు మూలం బయిన కాలంబుఁ బ్రతీక్షించుచుఁ, నివ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబుఁ జరియించి యటమీఁద విజ్ఞాన విశేషంబు సంభవించినఁ బరమహంసుండై దండాది చిహ్నంబులు ధరియించి యొండె, ధరియింపక యొండె బహిరంగవ్యక్త చిహ్నుండు గాక యంతరంగ వ్యక్తంబైన యాత్మానుసంధానంబు గలిగి మనీషియై బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకుఁ దనవలన నున్మత్త బాలమూకుల తెఱంగుఁ జూపుచుండవలయును. 429
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - saptama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )