| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | వినుము పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుం డనుపేర గంధర్వుండ నైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకుఁ బ్రియుండనై క్రీడించుచు నొక్కనాఁడు విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్త్రమనియెడి యాగంబులోన నారాయణకథలు గానంబు సేయుకొఱకు నప్సరోజనులను గంధర్వులనుంజీరిన. | 472 |
| ఆ. |
క్రతువులోని కేను గంధర్వగణముతోఁ, గలసిపోయి విష్ణుగాథ లచటఁ గొన్ని పాడి సతులఁగూడి మోహితుఁడనై, తలఁగి చనితి నంత ధరణినాథ! |
473 |
| క. |
వారిజగంధుల పొత్తున, వారిం గైకొనక తలఁగి వచ్చిన బుద్ధిన్ వా రెఱిఁగి శాప మిచ్చిరి, వారింపఁగరాని రోషవశమున నధిపా! |
474 |
| ఆ. |
‘పంకజాక్షు నిచటఁబాడక కామినీ, గణముఁగూడి చనిన కల్మషమున దగ్ధకాంతి వగుచు ధరణీతలంబున, శూద్రజాతి సతికి సుతుఁడ వగుము.’ |
475 |
| వ. | అని యిట్లు విశ్వస్రష్టలు శపించిన నొక బ్రాహ్మణదాసికిఁబుత్త్రుండనై జన్మించి యందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష సేసిన భాగ్యంబున నిమ్మహాకల్పంబునందు బ్రహ్మపుత్త్రుండనై జన్మించితి. | 476 |
| ఆ. |
కౌశలమున మోక్షగతికి గృహస్థుఁ డే, ధర్మ మాచరించి తగిలి పోవు నట్టి ధర్మ మెల్ల నతివిశదంబుగాఁ, బలుకఁబడియె నీకు భవ్యచరిత! |
477 |
| మ. |
అఖిలాధారుఁడజాదిదుర్లభుఁడు బ్రహ్మంబైన విష్ణుండు నీ మఖమందర్చితుఁడై నివాసగతుఁఢై మర్త్యాకృతిన్ సేవ్యుఁడై సఖియై చారకుఁడై మనోదయితుఁడై సంబంధియై మంత్రియై సుఖదుండయ్యె, భవన్మహామహిమ దాఁ జోద్యంబు ధాత్రీశ్వరా! |
478 |
| వ. | అని యిట్లు నారదుండు సెప్పిన వృత్తాంతం బంతయు విని ధర్మనందనుండు ప్రేమ విహ్వలుండై వాసుదేవునిం బూజించె. వాసుదేవ ధర్మనందనుల చేతఁ బూజితుండై నారదమునియు దేవమార్గంబునం జనియె నని శుక యోగీంద్రుండు పాండవపౌత్త్రునకుం జెప్పెనని సూతుండు శౌనకాదులకుం జెప్పిన. | 479 |
| క. |
రాజీవసదృశలోచన!, రాజీవభవాదిదేవ రాజవినుత! వి, భ్రాజితకీర్తిలతావృత, రాజీవభవాండభాండ! రఘుకులతిలకా! |
480 |
| మాలిని. |
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా! నిరుపమనయకాంతా! నిర్జరారాతిహంతా! గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా! సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా! |
481 |
| గద్య. | ఇది శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్త్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీ మహాభాగవతంబను మహా పురాణంబునందు ధర్మనందనునకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుటయు, హిరణ్యకశిపు దితి సంవాదంబును, సుయజ్ఞోపాఖ్యానంబును, యమసల్లాపంబును, బ్రహ్మవరలాభ గర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబును, బ్రహ్లాద విద్యాభ్యాస కథయును, బ్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదంబును, బ్రహ్లాదు వచనంబు ప్రతిష్ఠింప హరి నరసింహరూపంబున నావిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకు నభయం బిచ్చి నిఖిలదేవతానివహ ప్రహ్లాదాది స్తూయమా నుండై తిరోహితుం డగుటయుఁ, ద్రిపురాసుర వృత్తాంతంబును, నీశ్వరుండు త్రిపురంబుల దహించుటయు, వర్ణాశ్రమ ధర్మ వివరణంబును, బ్రహ్లాదాజగర సంవాదంబును, స్వధర్మ ప్రవర్తకుఁడగు గృహస్థుండు ముక్తుండగు మార్గంబు నారదుండు ధర్మజునకుఁ దెలుపుటయు, నారదుని పూర్వజన్మ వృత్తాంతంబును నను కథలు గల సప్తమస్కంధము. | 482 |