పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
శివుండు దేవప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట
క. కంటే జగముల దుఃఖము, వింటే జలజనితవిషము వేఁడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; దానఁగీర్తి మృగాక్షీ!
233
క. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన, ప్రాణుల రక్షింపవలయుఁబ్రభువుల కెల్లం;
బ్రాణుల కిత్తురు సాధులు, ప్రాణంబులు నిమిషభంగురము లని మగువా!
234
క. పరహితము సేయు నెవ్వఁడు, పరమహితుండగును భూతపంచకమునకుం
బరహితమె పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖీ!
235
క. హరి మది నానందించిన, హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్‌
హరియును జగములు మెచ్చఁగ, గరళము వారించు టొప్పుఁగమలదళాక్షీ!
236
క. శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్‌
రక్షింతుఁబ్రాణికోట్లను వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!
237
వ. అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ ‘దేవా! దేవర చిత్తంబుకొలంది నవధరింతురు గాక!’ యని పలికె నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. 238
మ. అమరన్‌ లోకహితార్థమంచు నభవుండౌఁగాక యం చాడెఁబో
యమరుల్‌ భీతిని మ్రింగవే యనిరి వో యంభోజగర్భాదులుం
దముఁగావన్‌ హర! లెమ్ము లెమ్మనిరి వో తాఁజూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్‌.
239
వ. అనిన శుకుండిట్లనియె. 240
క. మ్రింగెడువాఁడు విభుం డని, మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్‌
మ్రింగు మనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
241
మ. తనచుట్టున్‌ సురసంఘముల్‌ జయజయధ్వానంబులన్‌ బొబ్బిడన్‌
ఘనగంభీరరవంబుతో శివుఁడు లోకద్రోహి! హుం పోకు ర
మ్మని కెంగేలఁదెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్‌ మహావిషము నాహారించె హేలాగతిన్‌.
242
వ. అ య్యవిరళ మహాగరళ దహన పాన సమయంబున. 243
మ. కదలంబాఱవు పాఁప పేరు; లొడలన్‌ ఘర్మాంబుజాలంబు వు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱగావు; నిజజూటాచంద్రుఁడుంగందఁడున్‌;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్‌.
244
క. ఉదరము లోకంబులకును సదనం బగు టెఱిఁగి శివుఁడు చటులవిషాగ్నిం
గుదురుకొనఁగంఠబిలమునఁబదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్‌.
245
క. మెచ్చిన మచ్చిక కలిగిన, నిచ్చిన నీవచ్చుఁగాక యిచ్ఛ నొరులకుం
జిచ్చుఁగడిగొనఁగ వచ్చునె, చిచ్చఱచూ పచ్చుపడిన శివునకుఁదక్కన్‌.
246
ఆ. హరుఁడు గళమునందు హాలాహలము వెట్టఁగప్పు గలిగి తొడవు కరణి నొప్పె;
సాధురక్షణంబు సజ్జనులకు నెన్న, భూషణంబు గాదె భూవరేంద్ర!
247
వ. తదనంతరంబ. 248
క. గరళంబుఁగంఠబిలమున హరుఁడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్‌
హరియు విరించియు నుమయును సురనాథుఁడుఁబొగడి రంత సుస్థిరమతితోన్‌.
249
క. హాలాహలభక్షణకథ హేలాగతి విన్న వ్రాయ నెలమిఁబఠింపన్‌
వ్యాళానలవృశ్చికముల పాలై చెడ రెట్టి జనులు భయవిరహితులై.
250
వ. మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ. 251
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )