| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| వ. | ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు వొడగని భృత్యజన కామదుండగు న ప్పరమేశ్వరుండు ‘మీరలు దుఃఖింప వలవ దేను నా మాయాబలంబునం జేసి మీ యర్థంబు మరల సాధించెద’ నని పలికెఁ; దత్సమయంబున నయ్యమృత పూరంబు నేమ త్రావుద’ మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కతంబునఁ బ్రబలులగు రక్కసులు విలోకించి సత్త్రయాగంబు నందు నడచు చందంబునఁ దుల్యప్రయాస హేతువులగు సురలును సుధాభాగంబున కర్హు లగుదురు గావునఁబంచి కుడుచుట కర్తవ్యం; బిది సనాతనంబగు ధర్మం బగుటం జేసి యియ్యమృత కుంభంబు విడువుం డని దుర్బలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలు లైన తమవారల వారించుచున్న సమయంబున. | 298 |
| ఆ. |
ఒకని చేత నుండ నొకఁడు బలిష్ఠుఁడై, పుచ్చికొనిన వాని బొదుగఁబట్టి యంతకంటె నధికుఁడమృత కుంభమునెత్తి, కొంచుఁబాఱెఁబరులు గుయ్యిడంగ. |
299 |
| వ. | అంత. | 300 |
| సీ. |
మెత్తని యడుగుల మెఱుఁగారు జానువు లరఁటి కంబముల దోయైన తొడలు ఘనమగు జఘనంబుఁగడు లేఁత నడుమును బల్లవారుణకాంతి పాణియుగముఁ గడు దొడ్డపాలిండ్లుఁగంబుకంఠంబును బింబాధరముఁజంద్రబింబముఖముఁ దెలిగన్నుఁగవయును నళికుంతలంబును బాలేందుసన్నిభఫాలతలము |
|
| తే. |
నమరఁగుండల కేయూరహారకంక, ణాదు లేపార మంజీరనాద మొప్ప నల్ల నవ్వులఁబద్మదళాక్షుఁడసుర, పతుల నడఁగింప నాఁడురూపంబుఁదాల్చి. |
301 |
| వ. | అ య్యవసరంబున జగన్మోహనాకారంబున. | 302 |
| సీ. |
పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు జాఱించి మెల్లనఁజక్క నొత్తుఁ దళుకు దళ్కను గండఫలకంబు లొలయించు నొలయించి కెంగేల నుజ్జగించుఁ గడుమెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు నల్లార్చి ఱెప్పల నండ గొలుపు సవరని దరహాసచంద్రికఁజిలికించుఁజిలికించి కెమ్మోవిఁజిక్కువఱచు |
|
| తే. |
దళితధమ్మిల్లకుసుమగంధమ్ము నెఱపుఁ, గంకణాదిఝణంకృతుల్ గడలుకొలుపు నొడలి కాంతులు పట్టులే కులుకఁబాఱు, సన్న వలిపంపుఁబయ్యెద చౌకళింప. |
303 |
| వ. | ఇవ్విధంబున నక్కపట యువతీరత్నంబు జగన్మోహనదేవతయునుం బోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులం గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జడియుచు మురియుచుండ రాక్షసవరులు గనుంగొని. | 304 |
| సీ. |
అవుఁగదే లావణ్య, మవుఁగదే మాధుర్య మవుఁగదే సతి నవయౌవనాంగి! యెటనుండి వచ్చితి? వేమి యిచ్ఛించెదు? నీ నామ మెయ్యది నీరజాక్షి? యమరగంధర్వసిద్ధాసురచారణ మనుజకన్యలకు నీ మహిమ గలదె? ప్రాణచిత్తేంద్రియపరిణామదాయియై నిర్మించెఁబో విధి నిన్నుఁగరుణ, |
|
| తే. |
వనిత! గశ్యపు సంతతి వార మేము, భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుఁ, బాలు దీరని యర్థంబు పంచి యిమ్ము. |
305 |
| క. |
సభయై యుండెద మిందఱ, మభయంబున వచ్చు కొలఁది నమృతంబును నీ విభరాజగమన! తప్పక, విభజింపు విపక్షపక్షవిరహితమతివై. |
306 |
| వ. | అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుండగు హరి తన వాఁడి వాలు చూపు టంపఱలవలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ మొగమెత్తి యిట్లనియె. | 307 |
| క. |
సుందరులగు పురుషులఁగని పొందెడు నాయందు నిజము పుట్టునె మీకున్? బృందారకరిపులారా! చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. |
308 |
| క. |
పలుకులు మధురసధారలు దలఁపులు నానాప్రకారదావానలముల్ సెలుములు సాలావృకములు చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే! |
309 |
| క. |
నా నేర్చుకొలఁది మీకును మానుగ విభజించి యిత్తు; మానుఁడు శంకన్ గానిండనవుడు నిచ్చిరి దానవు లమృతంపుఁగడవఁదరుణీమణికిన్. |
310 |
| క. |
ఆ శాంతాలోకనములు, నా శీతలభాషణములు నా లాలితముల్ రాశిపరంపర లగుచుం, బాశములై వారి నోళ్ళు బంధించె నృపా! |
311 |
| వ. | ఇట్లు సుధాకలశంబు కేల నందుకొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుం డగు ముకుందుండు ‘మేలు గీ డనక నేను బంచి యిచ్చిన తెఱంగున నంగీకరించుట కర్తవ్యం’ బనవుడు ‘నగుంగాక’ యని సురాసుర దైత్యదానవ సమూహం బుపవసించి కృతస్నానులై హోమంబు లాచరించి విప్రులకు గోభూహిరణ్యాది దానంబులు సేసి తదాశీః ప్రవచనంబును గైకొని ధవళపరిధానులై గంధమాల్య ధూపదీపాలంకృతం బగు కనకరత్న శాలా మధ్యంబునఁ బ్రాగగ్రకుశ పీఠంబులం బూర్వ దిశాభిముఖులై పంక్తులు గొని యున్న సమయంబున. | 312 |
| క. |
శ్రోణీభరకుచయుగభర, వేణీభరములను డస్సి వివిధాభరణ క్వాణ యయి యువిద వచ్చెను, బాణిసరోజమున నమృతభాండముఁగొంచున్. |
313 |
| క. |
భాసురకుండలభాసిత, నాసాముఖకర్ణగండనయనాంచలయై శ్రీసతి యగు సతిఁగని, దేవాసురయూథంబు మోహ మందె నరేంద్రా! |
314 |
| వ. | అప్పుడు. | 315 |
| క. |
‘అసురుల కమృతము వోయుట వొసఁగదు పాములకుఁబాలు వోసినమాడ్కిన్ దొసఁగగు నంచును వేఱొక దెసఁగూర్చుండంగఁబెట్టె దేవాహితులన్. |
316 |
| వ. | ఇట్లు రెండు పంక్తులుగా నేర్పరించి. | 317 |
| సీ. |
వేగిరపడకుఁడీ వినుఁడు దానవులార! తడవుసేయక వత్త్తు దైత్యులార! యటు సక్కఁగూర్చుండుఁడని కన్ను లల్లార్చి చనుఁగవ పయ్యెద జాఱఁదిగిచి వదినె మఱందుల వావులు కల్పించి మర్మంబు లెడలించి మఱుఁగు సేసి మెల్లని నగవుల మేనులు మఱపించి కడు జాణ మాటలఁగాకుపఱచి |
|
| ఆ. |
యసురవరుల నెల్ల నడకించి సురలను, దడవు సేయవలదు; ద్రావుఁడనుచు వచ్చుకొలఁది నమృతవారి విభాగించెఁ, దరుణి దివిజు లెల్లఁదనిసి పొగడ. |
318 |
| వ. | ఆ య్యవసరంబున. | 319 |
| సీ. |
మనకు వేల్పులకును మందట లేకుండఁబంచి పెట్టెద నని పడఁతి పూనెఁ దానేల తప్పును? దప్పదు తరళాక్షి గాక రమ్మనుచును గడఁకఁబిల్వ మఱుమాట లాడదో మఱి చూడకుండునో చనుఁగవఁగప్పునో చాలు ననుచు నొండాడఁగలఁగుచు నొక్కింత సొలయునో మనయెడఁగందునో మగువ యనుచు |
|
| ఆ. |
నెలఁత చూడ్కిగముల నీరై కరంగుచుఁ, బ్రణయభంగభీతిబద్ధులగుచు నూరకుండ్రు గాని ‘యువిద! తే తెమ్మ’ని, యడుగఁజాల రప్పు డసురవరులు. |
320 |
| వ. | అప్పుడు. | 321 |
| మ. |
అమరవ్రాతములోనఁజొచ్చి దివిజుండై రాహు పీయూషపా నము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్ సేయ నారాయణుం డమరారాతిశిరంబు చక్రహతిఁదున్మాడెన్ సుధాసిక్తమై యమరత్వంబును జెందె మూర్ధము దదన్యాంగంబు నేలంబడెన్. |
322 |
| ఆ. |
అజుఁడు వాని శిరము నంబరవీథిని, గ్రహము సేసి పెట్టి గారవించె; వాఁడు పర్వములను వైరంబు దప్పక భానుచంద్రములను బట్టుచుండు. |
323 |
| క. |
ఒక బొట్టుఁ జిక్కకుండఁగ, సకలసుధారసము నమరసంఘంబులకుం బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిఁ దాల్చె నసురశూరులు బెగడన్ |
324 |
| మ. |
అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థాభిమానంబులన్ సములై లబ్ధవికల్పు లైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తా మత్యంతదోర్గర్వులై; కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణసంయుక్తులే? |
325 |