పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
మత్సా వ్యతార కథా ప్రారంభము
వ. అని యిట్లు శుకుఁడు రాజునకు వామనావతార చరితంబు సెప్పెనని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి. 690
సీ. ‘విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడు; మున్ను హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
గర్మబద్ధుని భంగి ఘనుఁడీశ్వరుఁడు లోక నిందింతంబై తమోనిలయమైన
మీనరూపము నేల మేలని ధరియించె? నెక్కడ వర్తించె? నేమి సేసె?
నాద్యమై వెలయు నయ్యవతారమునకు నెయ్యది కారణంబు? గార్యాంశ మెట్లు?
 
ఆ. నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ, దెలియఁజెప్పవలయు, దేవదేవు
చరిత మఖిలలోకసౌభాగ్యకరణంబు గాదె; విస్తరింపు క్రమముతోడ’
691
వ. అని, మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె; మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుండగు బాదరాయణి యిట్లనియె. 692
సీ. విభుఁడీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు ధర్మార్థములఁగావఁదనువుఁదాల్చి
గాలిచందంబున ఘనరూపములయందుఁ దనురూపములయందుఁదగిలియుండు;
నెక్కువ దక్కువ లెన్నఁడు నొందక, నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు;
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతి వహించు; మనుజేశ! చోద్యమే మత్స్య మగుట?
 
తే. వినుము పోయిన కల్పాంతవేళఁ దొల్లి, ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ, దపముఁగావించె నొక యేటితటమునందు.
693
వ. మఱియు నొక్కనాఁ డమ్మేదినీకాంతుండు గృతమాలికయను నేటిపొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు సేయుచున్న సమయంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల; దవిలి వచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె నట్లు విడివడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కిట్లనియె. 694
మత్తకోకిల. “పాటువచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి ఝషంబు లీ
యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్చోట నుండక నీదు దోసిలి సొచ్చి వచ్చిన నన్ను న
ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ?
695
ఆ. వలలుఁ దారు నింక వచ్చి జాలరి వేఁట, కాఱు నేఱు గలఁచి గారవెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;, రప్పు డెందుఁ జొత్తు? ననఘ చరిత!
696
క. భక్షించు నొండె ఝషములు, శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్‌
రక్షింపు దీనవత్సల!, ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము కలదే?”
697
వ. అనిన విని కరుణాకరుండగు నవ్విభుండు మెల్లన యయ్యంభశ్చరడింభకంబును గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొనిపోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము సాలక రాజన్యున కిట్లనియె. 698
క. ‘ఉండ నిది గొంచె మెంతయు, నొండొకటిందెమ్ము భూవరోత్తమ?’ యనుడున్‌
గండకముఁదెచ్చి విడిచెను, మండలపతి సలిలకలశమధ్యమునందున్‌.
699
వ. అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతులనిడుపై యుదంచనంబు నిండి పట్టు సాలక వేఱొండు దెమ్మనవుడా రాచపట్టి కరుణాగుణంబునకు నీడపట్టు గావున గండకంబు నొండొక్క చిఱుత మడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలంబై ‘తనకు సంచరింప నిదిగొంచెం’ బని పలికినం బుడమిఱేఁడు మంచివాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదంబునందు నిడియె; నదియు నాసలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము సాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పనివాఁడైన కతంబున నమ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కి ట్లను బెనుమొసళ్లు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింత కాలంబు నడపి కడపట దిగవిడువకు; వెడలఁ దిగువు’ మని యెలింగింపఁ దెలిసి యన్నీటి తిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁడిట్లనియె. 700
సీ. ఒక దినంబున శతయోజనమాత్రము విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము; మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు కరుణ నాపన్నులఁగావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి నవ్యయ! నారాయణాభిధాన!
 
తే. జననసంస్థితిసంహారచతురచిత్త!, దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ
నీదు లీలావతారముల్‌ నిఖిలభూత, భూతిహేతువుల్‌ మ్రొక్కెదఁ బురుషవర్య!
701
క. ఇతరులము గాము చిత్సం, గతులము మాపాల నీవు గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు, నతిసేసిన వాని కేల నాశము గలుగున్‌?
702
క. శ్రీలలనాకుచవేదికఁ, గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి, నేలా మత్స్యంబ వైతి వెఱిగింపు హరీ!”
703
వ. అని పలుకు సత్యవ్రతమహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయవేళా సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించు మీనరూపధరుండైన హరి యిట్లనియె. 704
సీ. ఇటమీఁద నీ రాత్రి కేడవదినమునఁ బద్మగర్భుని కొక్క పగలు నిండు;
భూర్భువాదికజగంబులు మూఁడు విలయాబ్ధిలోన మునుంగు; నా లోనఁబెద్ద
నావ సేరఁగ వచ్చు; నా పంపు పెంపున దానిపై నోషధితతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ గలవు సప్తర్షులుఁకలసి తిరుగ
 
ఆ. మ్రోలఁగాన రాక ముంచు పెంజీఁకటి, మిడుకుచుండు మునుల మేని వెలుఁగు
దొలఁకుచుండు జలధి దోదూయమాన మై, నావ దేలుచుండు నరవరేణ్య!
705
వ. మఱియు నన్నావ మున్నీటి కరళ్లకు లోనుగాకుండ, నిరుగెలంకుల వెనుక ముందట నేమఱకుండఁ బెన్నెఱులగు నా గఱులన్‌ జడియుచుఁ బొడువ వచ్చినఁ బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; నొక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడసూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం బదిలముచేసి నీకును మునులకును నలజడి సెందకుండ మున్నీట నిప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియును బ్రయోజనంబు గలదు. నా మహిమ పరబ్రహ్మంబని తెలియుము. నిన్ను ననుగ్రహింతు నని సత్యవ్రతుండు సూడ హరి తిరోహితుండయ్యె; నయ్యవసరంబున. 706
ఆ. మత్స్యరూపియైన మాధవు నుడుగులు, దలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁదూర్పు దలగడగాఁబండి, కాచి యుండె నాఁటి కాలమునకు.
707
వ. అంతఁ గల్పాంతంబు డాసిన. 708
క. ఉల్లసితమేఘపంక్తులు, జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్‌
వెల్లివిరిసి జలరాసులు, సెల్లెలికట్టలను దాఁటి సీమల ముంచెన్‌.
709
వ. తదనంతరంబ. 710
తే. మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!, బ్రాహ్మ మనఁగ నైమిత్తికప్రళయవేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ, గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.
711
వ. అంత నమ్మహారాత్రి యందు. 712
మ. నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్‌ నిర్మించి నిర్మించి వీఁ
పిఱియన్‌ నీల్గుచు నావులించుచు నజుండే సృష్టియున్‌ మాని మే
నొఱఁగన్‌ ఱెప్పలు మూసి కేల్‌ దలగడై యుండంగ నిద్రించుచున్‌
గుఱువెట్టందొడఁగెంగలల్‌ గనుచు నిర్ఘోషించుచున్‌ భూవరా!
713
ఆ. అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి, ముఖమునందు వెడలె మొదలి శ్రుతులు
నపహరించె నొక హయగ్రీవుఁడను దైత్య, భటుఁడు; దొంగఁదొడరఁబరులవశమె!
714
క. చదువులు దన చేవడినం, జదువుచుఁ బెన్‌ బయల నుండ శంకించి వడిం
జదువుల ముదుకఁడు గూరుకఁ, జదువుల తస్కరుఁడు సొచ్చె జలనిధి కడుపున్‌.
715
వ. ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన వాని జయింపవలసియు, మ్రాను దీఁగెల యందు విత్తనంబుల పొత్తరలు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్లకార్యంబులకుం గావలి యగు నా పురుషోత్తముం డప్పెనురేయి చొరుదలయందు. 716
క. కుఱుగఱులు వలుఁద మీసలు, చిఱుఁదోఁకయు బసిఁడి యొడలు సిరిగల పొడలున్‌
నెఱి మొగము నొక్క కొమ్మును, మిఱుచూపులుఁగలిగి విభుఁడు మీనంబయ్యెన్‌.
717
వ. అట్లు లక్షయోజనాయతంబయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి సొచ్చి. 718
సీ. ఒకమాటు జలజంతుయూథంబుతోఁగూడు నొకమాటు దరులకు నుఱికి వచ్చు
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు నొకమాటు లోపల నొదిఁగియుండు
నొకమాటు వారాశి నొడలు ముంపఁగఁజూచు నొకమాటు బ్రహ్మాండ మొరయఁదలఁచు
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు నొకమాటు జలముల నుమిసివైచు
 
తే. గఱులు సారించు, మీసలు గడలు కొలుపుఁ, బొడలు మెఱయించుఁగన్నుల పొలప మార్చుఁ
నొడలు జళిపించుఁ దళతళ లొలయు మీన, వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.
719
వ. అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్తపరాధీనుండగు హరిం దలచుచునుండ నారాయణప్రేరితయై యొక్క నావ వచ్చినంగనుంగొని. 720
మ. చని సత్యవ్రతమేదినీదయితుఁడోజంబూని మ్రాన్దీఁగ వి
త్తనముల్‌ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
మునిసంఘంబులు దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁదేలుచుం
గనియెన్‌ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్‌ మీనమున్‌.
721
వ. కని, జలచరేంద్రుని కొమ్మున నొక్కపెనుఁ బాఁపత్రాట న న్నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నారాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడందొడంగె. 722
మ. తమలోఁబుట్టు నవిద్య గప్పిగొనుడుందన్మూలసంసార వి
భ్రములై కొందఱు దేలుచుంగలఁగుచున్‌ బల్వెంటలన్‌ దైవయో
గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్యసంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణంబాలింపు మమ్మీశ్వరా!
723
ఉ. కన్నులు గల్గువాఁడు మఱి కాననివానికిఁ ద్రోవఁ జూపఁగాఁ
జన్న తెఱంగు మూఢునకు సన్మతి దా గురుఁడౌట సూర్యుఁడే
కన్నులు గాఁగ భూతములఁగాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే!
724
క. ఇంగలముతోడి సంగతి, బంగారమువన్నె గలుగుభంగినిఁ ద్వత్సే
వాంగీకృతుల యఘంబులు, భంగంబులఁబొందు ముక్తి ప్రాప్తించు హరీ!
725
క. హృదయేశ! నీ ప్రసన్నత, పదివేలవపాలి లేశభాగముకతనం
ద్రిదశేంద్రత్వము గలదఁట!, తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!
726
క. పెఱవాఁడు గురుఁ డటంచును, గొఱగాని పదంబు సూపఁ గుజనుండగు నీ
నెఱత్రోవ నడవ నేర్చిన, నఱమఱ లేనట్టి పదమునందు దయాబ్ధీ!
727
మ. చెలివై చుట్టమవై మనస్స్థితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కుల పంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటంబడి లోక మక్కట! వృథాబద్ధాశమై పోయెడిన్‌
నిలువన్‌ నేర్చునె హేమరాశిఁగనియున్‌ నిర్భాగ్యుఁడంభశ్శయా!
728
ఆ. నీరరాశిలోన నిజకర్మబద్ధమై, యుచితనిద్రఁబొంది యున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు, నట్టి నీవు గురుఁడ వగుట మాకు.
729
క. ఆలింపుము! విన్నప మిదె, వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్‌
నాలోని చిక్కు మానిచి, నీలోనికిఁ గొంచుఁబొమ్ము నిఖిలాధీశా!
730
వ. అని ఇట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి, సాంఖ్య యోగక్రియాసహితయగు పురాణ సంహిత నుపదేశించె; నమ్మహారాజు మునిసమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుండయ్యె; నతం డిమ్మహా కల్పంబున వివస్వంతుండనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరికృపావశంబున నేడవ మనువయ్యె; నంత నవ్విధంబునఁ బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు దన్నిశాంత సమయంబున. 731
మ. ఉఱ కంభోనిధి రోసి వేదముల కుయ్యున్‌ దైన్యముం జూచి వే
గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకం దోఁక సారించి మే
న్మెఱయన్‌ దౌడలు దీటి మీస లదరన్‌ మీనాకృతిన్‌ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళిత గ్రావున్‌ హయగ్రీవునిన్‌.
732
వ. అంతం బ్రళయావసానసమయంబున. 733
సీ. ఎప్పుడు వేగునం చెదురు చూచుచు నుండు మునుల డెందంబులు ముదము నొందఁ
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి యోరపయ్యెఁద జక్కనొత్తికొనఁగ
మలినమై పెను రేయి మ్రక్కిన తేజంబు దొంటి చందంబునఁ దొంగలింపఁ
బ్రాణుల సంచితభాగధేయంబులు గన్నుల కొలఁకులఁ గానఁబడఁగ
 
తే. నవయవంబులు గదలించి యావులించి, నిదురఁదెప్పిఱి మేల్కాంచి నీల్గి మలఁగి
యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు, ధాత గూర్చుండె సృష్టిసంధాత యగుచు.
734
వ. అయ్యవసరంబున. 735
ఆ. వాసవారిఁ జంపి వానిచే పడియున్న, వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మానియున్న నీరజాసనునకు, నిచ్చెఁగరుణతోడ నీశ్వరుండు.
736
క. జలరుహనాభునికొఱకై, జలతర్పణ మాచరించి సత్యవ్రతుఁ డా
జలధి బ్రదికి మను వయ్యెను, జలజాక్షునిఁ గొలువ కెందు సంపద గలదే?
737
ఆ. జనవిభుండు దపసి సత్యవ్రతుండును, మత్స్యరూపి యైన మాధవుండు
సంచరించినట్టి సదమలాఖ్యానంబు, వినినవాఁడు బంధవిరహితుండు.
738
క. హరిజలచరావతారముఁ, బరువడిఁ బ్రతిదినముఁ జదువఁ బరమపదంబున్‌
నరుఁడొందు వాని కోర్కులు, ధరణీశ్వర! సిద్ధిబొందుఁ దథ్యము సుమ్మీ!
739
మ. ప్రళయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ముల వేదంబులు గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
డలరన్‌ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
జలధింగ్రుంకుచుఁ దేలుచున్‌ మెలఁగు రాజన్మూర్తికిన్‌ మ్రొక్కెదన్‌.
740
వ. అని చెప్పి. 741
క. రాజేంద్ర! దైత్యదానవ, రాజమహాగహనదహన! రాజస్తుత్యా!
రాజావతంసమానిత!, రాజధరార్చిత! గుణాఢ్య! రాఘవ రామా!
742
మాలిని. దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ!
743
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవత పురాణంబను మహాప్రబంధంబునందు స్వాయంభువ స్వారోచిషోత్తమతామస మనువుల చరిత్రంబును, గరిమకరంబుల యుద్ధంబును, గజేంద్రరక్షణంబును, రైవతచాక్షుషమనువుల వర్తనంబును, సముద్రమథనంబును, గరళ భక్షణంబును, నమృతాది సంభవంబును, దేవాసుర కలహంబును, హరి కపటకామినీరూపంబున నసురుల వంచించి దేవతల కమృతంబు వోయుటయును, రాక్షసవధంబును, హరిహర సల్లాపంబును, హరి కపటకామినీరూప విభ్రమణంబును, వైవస్వత సూర్యసావర్ణి దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి భద్రసావర్ణి దేవసావర్ణీంద్రసావర్ణి మనువుల వృత్తాంతంబును, బలియుద్ధయాత్రయును, స్వర్గవర్ణనంబును, దేవపలాయనంబును, వామనావతారంబును, శుక్రబలిసంవాదంబును, ద్రివిక్రమవిస్ఫురణంబును, రాక్షసుల సుతలగమనంబును, సత్యవ్రతోపాఖ్యానంబును, మీనావతారంబును నను కథలు గల యష్టమస్కంధము. 744
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )