పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రుఁడు గాంధారీసహితుండై వనంబునకుఁ బోవుట (సం. 15-20-1)
వ. పనిచినం బ్రియంబు పెంపున హృదయంబు పల్లవింప నా భూవల్లభుం డనేకగ్రామంబు లగ్రహారంబులు గావించి గాంధారరాజు మొద లయిన నిజ బంధువులకు బహుళ దక్షిణలుగాఁ బార లౌకిక క్రియలు చేసెనిట్లు ధృతరాష్ట్రుండు; భారత రణంబున మరణంబు నొందిన బంధు లోకంబునకుం బుణ్యలోక సౌఖ్యాతిశయ పదంబు లగు పరమ శ్రాద్ధంబులు నిర్వర్తించి కృతకృత్యుం డై సర్వ కృత్యంబులుం జలిపి పాడ్యమి నాఁడు | రేపకడ ఋత్విక్సమేతుం డై యిష్టి నడపి | పాండవులను దక్కటి బంధువులను మిత్రులను రావించి వనవాసంబునకు సంకల్పంబు చేసి, సకల భృత్యజనంబులకు నర్హధనంబు లిచ్చి, గాంధారీ సమన్వితుం డై వల్కలాజినంబులు ధరియించి, యక్షత గంధ పుష్పంబుల గృహంబుఁ, బూజించి సర్వపదార్థంబులుం బరిత్యజించి యద్దేవియుఁ గదిసి నడవ యాజకు లగ్నులు నుపకరణంబులును ధరియించి ముందటం జేరువ నరుగ నగరు వెడలె, నట్టియెడ నేతెంచి. 137
క. గొంతి మొద లైన కౌరవ | కాంతా జను లెల్ల నెవ్వగలఁ బొగులుచుఁ బ
క్ష్మాంతంబుల బాష్పసలిల | సంతానము లురలఁ దోన చనుదేరంగన్‌
138
వ. అజ్జనపతి చనుచుండె. 139
తే. పాండవాగ్రజుఁ డక్కురుభర్తవలను | శోకదీనుఁడై తప్పక చూచి యేడ్చి
‘హా మహారాజ ముఖ్య! యెం దరిగె?’ దనుచు | నొడలు కంపింపఁ జదికిలఁ బడియె నధిప!
140
క. నరుఁ డనునయించె వెస న | న్నరపతి నెత్తుచును దా ననయమున్‌ వనటం
బురపురఁ బొక్కెం గురు భూ | వర! యద్దెస తెఱఁగు రాదు వాక్రువ్వంగన్‌.
141
వ. భీమసేన నకుల సహదేవులును గృప యుయుత్సు సంజయులును ధౌమ్యాది ధరణీ సురులును శోక వ్యాకులత్వంబు నొందిరి; గొంతి యడలుచు గాంధారి కరంబు నిజస్కంధంబున నిడికొని నడవ నంధనృపతి గాంధారీ స్కంధ భాగ కలిత బాహుం డై పోవుచుండె నప్పుడు పాంచాలియు సుభద్రయుఁజిత్రాంగదయు నులూపియు, సపుత్ర యగు నుత్తరయు మఱియుం గల యట్టి మగువలుం గురరీనిచయ నాదంబుల చందంబు దోఁప నాక్రందనంబు సేసి రయ్యవస్థ జూదంబునాఁడు పాండవులు పురంబు వెలువడునప్పటి దశం బోలియుండె నట్లు ధృతరాష్ట్రుకానన గమనంబు నిశ్చితం బగుటయు నాబాల వృద్ధంబుగాఁ బురజనంబు గనుంగొనం జనుదెంచిన. 142
ఆ. వచ్చి రెండ కన్ను వాన కన్నును నెఱుం | గనిపురంధ్రు లెల్లఁ గరము వంతఁ
దలరు నంతరంగములతోడ నక్కురు | వృద్ధుఁ జూడ నార్తి వికలగతుల.
143
క. నేలను హర్మ్యంబులపై | నోలి నిలిచి చూచు మానవోత్కరముల శో
కాలాప విలాపంబులు | నేలకు మింటికిని నడుమ నిండి చెలంగెన్‌
144
వ. ధృతరాష్ట్రుండుఁ బురద్వారంబు నిర్గమించుచుండి సకల పౌరజనంబుల నిలువం బనిచె; విదురుం డక్కురు వృద్ధునితోడ వనంబున కరుగుటకు దృఢనిశ్చయుం డై పలికె; సంజయుండు నవ్విధంబు వాఁ డయ్యెఁ; గృపాచార్యుండును యుయుత్సుఁడు నత్తెఱంగుమాట లాడిన నాంబికేయుండు వారిని వారించి ధర్మనందనున కప్పగించి నిలిపి, కోడండ్ర నెల్లను సముచిత వచనంబుల మరల నియమించిన, వార లా వైచిత్రవీర్యునకు గాంధారికిం బ్రణమిల్లి బాష్పంబులు వదనంబున వెల్లిగొనుచుండ వీడ్కొనియును బాండురాజమహిషిం జూచికొని వెనుకం జనుచుండి; రా సమయంబున నజాతశత్రుం డాగొంతి కి ట్లనియె. 145
క. ‘మా యయ్య కాననమునకుఁ | బోయెడు; నే నితనితోడఁ బోయెద శుశ్రూ
షాయత్తుఁడ నై యుండెద | నీ యువిదలఁ గొనుచు మగిడి యేఁగుము తల్లీ!’
146
చ. అనుటయు గొంతి యక్కురుకులాగ్రణి కి ట్లను ‘నీవు తోడఁ గా
ననమున కేఁగుదెంచుట జనస్తవనీయచరిత్రుఁ డివ్విభుం
డనుమతి చేయునే? యుడుగు మా పని; యియ్యమ యత్త నాకు, నీ
మనుజవిభుండు మామ; గరిమంబుగ వీరలఁ గొల్చి పోయెదన్‌.
147
తే. ఇతని కియ్యమకును విను మేన చువ్వె | వలఁతి శుశ్రూష సేయంగ వత్స! మీర
లాపనికి నేర్తురే? వీర లడవి కరుగ | నింట నుండఁగ నా మన మియ్యకొనునె?
148
వ. అనిన నా ధర్మపుత్త్రుండును దమ్ములు నుచిత వచనంబుల వేఁడికొనిన నద్దేవి యగ్రతనయుం గనుంగొని. 149
క. ‘వీరలయెడఁ గొడుకా! యప | చారంబులు పలుకుదునె? విచారము విడు; మే
నే రూపంబున నిలువన | గారవమున నిది వ్రతంబుగాఁ గైకొంటిన్‌.’
150
వ. అని పలికి నిజస్కంధంబున నున్న గాంధారి కరంబుఁ గరంబు నయంబునం బాపి, యతని దిక్కు మొగం బై. 151
క. ‘నీ వేమియు ననకుము సహ | దేవుని నేమఱక యరయు; దినకరసుతునిన్‌
భావమునఁ దలఁపు; మే నా | దేవసముని పుట్టు వడఁచితిం గపటమునన్‌.
152
క. అది పాపము దానికి నా | మది నెప్పుడు వగతు విమలమానస! యక్కీ
డు దొలంగునట్లుగా స | త్పదార్థ దానములు చేయు తాత్పర్యమునన్‌.
153
ఆ. అవ్విధమునఁ గర్ణుఁ డాఱడిఁ బోయిన | నాదు మానసంబు పోదు నూఱు
పఱియ లై తలంప బలుఱాతఁ జేసిన | వారు గాఁగ వలయు వంశవర్య!
154
క. ‘నీవును దమ్ములు భక్తి భ | రావేశముతోడఁ దలఁపుఁ డమ్మహితాత్మున్‌;
ద్రోవది నెప్పుడు దృఢ సం | భావన మన్నింపు మయ్య పౌరవముఖ్యా!
155
క. భీమార్జున నకుల మనః | కామంబులు సఫలతా ప్రకాశంబులు గా
భూమీశ! యరసి యొనరుపు | మేమిట నేమఱకు ధర్మ మిల యరయు నెడన్‌.
156
వ. అని పలికి నానిశ్చయంబు శిథిలంబు గాదు | మీరు మరలుండని పలికినఁ బాండవాగ్రజుండు విషాదం బంది యూరకుండె; భీమాదులు డెందంబులు గొందలం బంద నశ్రు లొలుకం దలలు వాంచి; రిట్ల మ్మొత్తంబుగ మనంబు గుదిపడుచు మందం బై చెల్ల ధృతరాష్ట్రుండు గొండొకయెడగలుగం జనియె; నా ధర్మతనయుండు తల్లియాననం; బాలోకించి. 157
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )