| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
చెప్పినఁ బాండవు లప్పథంబున భక్తి | నరుగుచు నెదురుగ నరుగుదెంచు నంబికానందనుఁ డాదిగాఁ గలవారిఁ | గని రప్పు డన్నలఁ గడచి శీఘ్ర గామియై చని తల్లి కాళ్ళపైఁ బడి యేడ్చె | సహదేవుఁ; డధిక బాష్పప్లుతాస్య యగుచు నబ్భామిని వగచుచు నాతని | నెత్తి తాఁ గౌఁగిట నిఱియఁ జేర్చి |
|
| తే. |
పేరుకొని చెప్పె నతని గాంధారి కంతఁ | గూడి యతఁడును దారు నక్కురుకుమారు లక్కురూద్వహు నన్నియతాత్ము దేవిఁ | గాంచి రనుజీవు లెఱిఁగింపఁ గౌరవేంద్ర! |
034 |
| చ. |
కని మఱి తల్లి పాదములఁ గ్రందుగఁ జేర్చిరి మస్తకంబు; ల వ్వనితయు నందఱం బొదివి వత్సలతన్ మన మార్ద్రభావ మొం ద నురలు నశ్రుబిందువుల దందడిఁ జిక్కఁగఁ గౌఁగిలించి వా రి నయనవారి చేఁ దుడిచి ప్రీతిగ దీవెన లిచ్చె భూవరా! |
035 |
| తే. |
అట్టియెడఁ బాండవాగ్రజ నధిక వినయ | భరితుఁడై కాంచి భీమునిఁ బార్థుఁ గవలఁ గనియె సంజయుఁ డెంతయు గారవమున | నాదరించి రయ్యేవురు నతనిఁ బ్రీతి. |
036 |
| సీ. |
ద్రోవదిఁ దొట్టి వధూజనంబులుఁ దక్కుఁ | గలయట్టి భరత భార్యలుఁ గ్రమమునఁ గాంచిరి కురువృద్ధు గాంధారి గొంతిని; | వారలు గొనివచ్చు వారి కలశ ములు పాండురాజ పుత్త్రులు పుచ్చికొని భరి | యించిరి; పురజను లెల్ల నధిక వినయత నమ్మువ్వురను గని; రవ్వేళ | నందఱు ముదమంది; రట్లు దగిన |
|
| ఆ. |
వారు బలసి యునికి వారణపురమున | నున్నయట్ల కాఁగఁ దన్నుఁ దలఁచె మదిఁ గురూద్వహుండు తదనంతరంబ ని | జాశ్రమమున కెలమి నరుగుదెంచి. |
037 |
| ఉ. |
తారక శోభితాంబర విధంబునఁ బొల్పెసఁగంగ నాశ్రమో దారతలంబు బంధుజనతాకలనంబునఁ దాను జంద్రు నొ ప్పార వహించి విస్ఫురితుఁ డై తనరెం గురుభర్త వచ్చి ర చ్చేరువఁ గల్గు తాపసులు చెచ్చెరఁ బార్థులఁ జూచు వేడుకన్. |
038 |
| వ. | వచ్చినం గని వారల నెల్లను సవినయ ప్రణామంబులం బ్రీతులం జేసి పాండవు లలరు మొగంబులతో ధృతరాష్ట్రుం బరివేష్టించి యుండిరి; వనితాజనంబులు నొక్కవలన నిలిచి; రుచితాసనంబులనున్న యమ్మునులు సంజయు నాలోకించి ‘ధృతరాష్ట్రు బంధు జనంబుల నందఱం బేరువేర నేర్పడ మా కెఱింగింపవే’ యని యడిగిన నతండు వారల కి ట్లనియె. | 039 |
| సీ. |
‘జాంబూనదచ్ఛాయ చందంబు వర్ణంబు | గలిగిన పలుచని గనప మేను, నుచిత దీర్ఘత్వ సమున్నత ఘ్రాణంబు | నిడుదలైన విశాల నేత్రములును, గంఠీరవంబు రేఖయు నొప్పఁ జూడ్కికి | నెంతయు వ్రేఁగైన యితఁడు ధర్మ తనయుఁ; డెఱ్ఱఁదనంబుఁ దనరిన మూఁపులు | నాయత స్ఫీతంబు లైన బాహు |
|
| తే. |
వులును వెడందయురంబు నై పొలుచు నితఁడు | భీముఁ; డుజ్జ్వల సుందర శ్యామ తనువు వారణేంద్రు కైవడియును, వారిజముల | యట్టి కనుదోయిఁ గల యితం డర్జునుండు. |
040 |
| తే. |
సుందరాకారమునఁ దమ కెందు సదృశు | లొరులు లేమి తెల్లం బగుచుండ గొంతి యుభయ పార్శ్వంబు లందుఁ గూర్చున్న విష్ణు | శతమఖోపముల్ వినయభూషితులు కవలు. |
041 |
| సీ. |
నీలోత్పల చ్ఛాయఁ బోలు మై చాయయు, | నవపద్మదళములఁ దెవడు మెఱుఁగుఁ గనుదోయి, మధ్యాత్వమునకుఁ బ్రవేశించు | ప్రాయంబు, నత్యభిరామ మూర్తి యలవడఁ గైకొన్న యతులిత సంపద | చందంబు దోఁపించు చారుగౌర వంబును గలుగు నివ్వనిత పాంచాలి; యి | య్యింతి పార్శ్వమునఁ గట్టెఱ్ఱ మేను |
|
| తే. |
వనజ సన్నిభ ముఖమునై యినుని మహిమ | యుజ్జ్వలాకృతి దాల్చినట్లున్న యీ ల తాంగి నారాయణుని చెలియలు సుభద్ర | నరుని వల్లభ సంయమినాథులార! |
042 |
| ఆ. |
వీరి కెలనఁ గనక గౌర మధూకాభ | తనువు లొప్పుచున్న వనిత లురగ పాండ్య సుతలు, నరుని భార్య; లులూపి చి | త్రాంగద యనఁ బరఁగ నాహ్వయములు. |
043 |
| సీ. |
ఇందీవరచ్ఛాయ కెనయైన చాయ నొ | ప్పిన మేను గలుగు నీ భీతహరిణ నయన భీముని భార్య; నవ్యచంపక దామ | గౌరాంగి యైన యిక్కమలవదన సహదేవు గృహిణి; మేచకనవకువలయ | వర్ణంబునకు సరివచ్చు కాంతిఁ జెలు వైన తనువునఁ బొలుచు నిన్నలినాయ | తాక్షి మాద్రీదేవి యగ్రతనయు |
|
| తే. |
పత్ని; వీరల కెలనఁ బాపటలు లేక | ధౌతసిత వస్త్ర పరిధానలై తనువుల నిభృతి దోఁపఁగ నున్న యిన్నెలఁత లాంబి | కేయు కోడండ్రు కరుణావిధేయులార! |
044 |
| తే. |
వీరి చందంబ యై కడు గారవమునఁ | దను సుభద్ర వొదువ నున్న తరుణి ద్రోణ కర్ణముఖ యోధవీరులఁ గలఁచి తెగిన | యట్టి యభిమన్యు ప్రియ యుత్తరాభిధాన. |
045 |
| వ. | అని చూపి చెప్పె, నప్పు డాంబికేయుండు కౌంతేయాగ్రజున కిట్లనియె. | 046 |
| సీ. |
‘కుశలివై యుండుదే కురువంశ సత్తమ! | పౌరజనులు జానపదులుఁ దెఱఁగు తో నిన్ను ననుసరింతురె? తమ్ము లందఱు | సుఖ ముందురే? నీదు సఖులు సుఖులె బంధులు సంతోషభరితులే? యిష్ట భృ | త్యులు తగవైన కోర్కులు ఫలింపఁ గ్రాలుదురే? హర్షలీలలఁ బూర్వ రా | జన్యుల నడవడి సలుపఁబడునె? |
|
| ఆ. |
నయముతోడి యప్పనముల భండారంబుఁ | బెనుతె? యగ్రహార జనులమీఁద గాలి యైన సుడియఁగా నీక యరయుదే? | యనఘ! పుణ్యకీర్తు లతిశయిల్ల. |
047 |
| క. |
మిత్ర నరపతుల శాత్రవ | ధాత్రీశుల నెమ్మిఁ బరుసఁ దనమున వశతా పాత్రములుగఁ జేయుదె? సుచ | రిత్ర! యుదాసీన నృప పరీక్ష నడచునే? |
048 |
| క. |
దేవతల కతిథులకుఁ బితృ | దేవతలకుఁ బూజనములఁ దృప్తి యొనర్తే? యీ వసుధఁ జతుర్వర్ణ జ | నావళులు నిజోచితక్రియలఁ దగ మనునే? |
049 |
| తే. |
బాలురకును దుర్బలులకు భామినులకు | వృద్ధులకును మనంబుల వెఱపు లేని యట్టి మెలఁకువ గలిగెడునట్లు గాఁగ | నడచునే యాజ్ఞ పురమునఁ బుడమియందు.’ |
050 |
| క. |
అనిన విని యా నృపతి య | జ్జనపతితో నిట్టు లనియె ‘జగదీశ్వర! నీ వినుతోపదేశమున భవ | దనుయుక్తము లెల్ల నడచు నవికలభంగిన్.’ |
051 |
| వ. | అని పలికి యిట్లనియె. | 052 |
| క. |
‘ఆయాసము సైరింపని | మీ యొడలు తపఃక్రియలకు మెయికొనియెనె? భూ నాయక! శుశ్రూష దగం | జేయునొకో గొంతి డప్పిఁ జెందక మీకున్. |
053 |
| క. |
మా పెద్దతల్లి యలజడి | కోపి తపోవృత్తి గడపుచున్నదియె? సుత వ్యాపాదనకారుల మముఁ | బాపాత్ములఁ దలఁచి యెట్లు పలుకునొ మీతోన్? |
054 |
| ఆ. |
సంజయుండు తపము జాలికిఁ జాలి వ | ర్తిల్లుచున్నవాఁడె? ధీరచిత్తుఁ డిచట లేఁడు విదురుఁ డెచటి కేఁగినవాఁడొ? | యతనిఁ జూడ వలయు నధిప! నాకు.’ |
055 |
| వ. | అనుటయు ధృతరాష్ట్రుఁడు ధర్మతనయుతోడ. | 056 |
| సీ. |
‘ఏఁ దపంబున కోర్తు నెంతయు; శుశ్రూష | యలయక గొంతి మా కాచరించు; వినుము! గాంధారియు ననఘచరిత్ర త | పోనిష్ఠ కోర్చు; నిమ్మాననీయ మిముఁ దలంచిన యప్డు మెచ్చి దీవించు; సం | జయుఁడు ప్రాజ్ఞుఁడు; తపశ్చరణమునకు విసువఁడు; మముఁ బాసి విదురుఁ డెచ్చట నేనిఁ | జరియించు మునిజనాశ్చర్యకారి |
|
| ఆ. |
యగుచు; జలము లనిల మాహారముగఁ గొను; | నవియు నదియుఁ గొనక యయిన నుండు; శూన్య విపినమున విదైన్య స్వతంత్ర సం | చారియై వసించుఁ గౌరవేంద్ర! |
057 |
| క. |
ఒక్కొకమరి డబ్బాటీ | చక్కటిఁ గాన నగు ననియె జనవర తోఁచెన్ గ్రక్కున నప్పుడ విదురుం | డక్కౌంతేయాగ్రజున కనతిదూరమునన్. |
058 |
| వ. | కాంతారధూళి మలినాంగుండును జటీభూతకేశపాశుండును దిగంబరుండును నగు విదురుం డట్లు దోఁచి యయ్యాశ్రమంబున నున్న జనంబులం గని మగుడి పోవంజూచె; ధర్మతనయుండు తన యనుచరుల నిలువుం డనుచుఁదా నొక్కరుండును సత్వరంబుగా నవ్వినుత ప్రభావుని వెనుకం జనియె; నతండు గుల్మాంత రితుం డగుచుం దోఁచుచుఁ బోవం బోవ నప్పాండ వాగ్రజుం డెలుంగెత్తి ‘యో విదుర! నిలునిలు; మేను యుధిష్ఠిరుండ; నిన్నుఁ గాన వచ్చితి ‘నని పలుకుచుం బాఱిన నమ్మహాత్ముండు మరలి కనుంగొని వివిక్త ప్రదేశంబున నొక్క పాదపంబు చేరి నిలిచిన. | 059 |