పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
వ్యాసుఁడు ధృతరాష్ట్రాదులకు భారతరణ మృతుల రావించి చూపుట (సం. 15-40-4)
సీ. సాత్యవతేయుండు జాహ్నవీసలిలావ | గాహన మొనరించి గారవమున
నింపారు నెలుఁగున ‘నిందు రం’ డనవుడు | నీ కేమి సెప్పుదు? నీటియందు
రవ మగ్గలముగ రారాజుఁ దమ్ములుఁ దత్కు | మారవర్గము నభిమన్యుఁ డాది
యగు పాండుపౌత్త్రులు నర్కజుండును బాహ్లి | కప్రముఖాఖిల కౌరవులును
 
తే. ద్రుపదమాత్స్యులు వారి బంధులును శకుని | యును దదీయానుజులును నాతని తనూజ
రాజియును భీష్మగురులఁ బురస్కరించి | కొనుచుఁ దమదివ్యదేహముల్‌ కొమరు మిగుల.
118
ఆ. దివ్య మాల్యములును దివ్యాంబరంబులు | దివ్య భూషణములు దివ్యలేప
నములుఁ జెన్నుఁ జేయఁ దమ మిత్త్ర సుభటసం | దోహములును దారుఁ దోఁచి రధిప!
119
వ. అట్టియెడ. 120
క. తగ నా కురువృద్ధునకు నొ | సఁగె నాఁటికి నెల్లదృష్టి సాత్యవతేయుం
డగణితతపఃప్రభావం | బు గని యధిక విస్మయంబుఁ బొందఁగ జనముల్‌.
121
వ. అవ్విశేషంబు విని యద్భుత ప్రమద భరితయై నిజనయనంబుల బంధించిన పట్టం బపనయించి గాంధారి యును గనుంగొనుచుండ. 122
క. అవ్విధమునఁ దోఁచిన మఱి | నవ్వుచుఁ దెగడుచును బెరసి నరవర! పగ లే
కవ్వీరవరులు నెయ్యము | నివ్వటిలఁగ విలసనములు నెఱయ మెఱయఁగన్‌.
123
తే. చతురగంధర్వు లప్సరోజనులు గాన | ములఁ బ్రమోద మొనర్పంగఁ బొగడ వంది
సమితి నిరహంకృతులు హృదయముల గౌర | వములు తెల్లంబు సేయంగ వచ్చి రొప్పి.
124
వ. ఇట్లు వచ్చి సకలబంధుజనంబులకుం బరమప్రమోదం బావహిల్లం గలిపి సముచితాచారంబులు నడపి; రా రెండు దెఱంగులవారలు నర్హ ప్రకారంబులఁ బితామహాచార్య శిష్య మాతృ మాతామహ పితృపితామహ భ్రాతృ జామాతృ పుత్త్రపుత్త్రీభగినీ పౌత్త్ర దౌహిత్ర శ్వశుర శ్వశ్రూస్నుషా మాతుల స్యాలక ప్రియ ప్రియా మిత్ర సమాగమసుఖంబు లనుభవించుచు. 125
తే. అనఁగి పెనఁగి నాఁడెల్ల నిచ్ఛానురూప | వృత్తి వర్తిల్లుచుండి; రవ్విధము సకల
జనుల నద్భుతరసమున మునుఁగఁ జేసె; | నే మనఁగ వచ్చు నా సంయమీంద్రు మహిమ.
126
వ. మఱునాఁడు రేపకడ యప్పారాశర్యుండు ననుప నయ్యిరు దెఱంగులవారలుం బరస్పరామంత్రణంబు సేసి; రాశూరజనంబులు తమతమలోకంబులకుం జనువారై జాహ్నవీజలంబులం బ్రవేశింప, నన్నిలింపవందనీ యుండు దానును జొచ్చి యచ్చటినుండి ‘పతుల ననుగమింప వలసిన యంగనలు గంగాతోయంబులంగ్రుం కుటకు రం ‘డనిన విని విధవలగు వీరభార్య లెల్లను ధృతరాష్ట్ర గాంధారీ కుంతీ ధర్మనందనుల యనుజ్ఞల గొని రయంబునం జని భాగీరథీ సలిలమగ్నలై మానుష దేహంబులు విడిచి దేవతనువులు దాల్చి దివ్యాలంకార సమలంకృతమూర్తులై మగలం గలసి; రవ్విశేషంబు చూచి సర్వజనులు నత్యంతాశ్చర్యసంతోషాధీన మానసులై రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 127
సీ. ‘జననాథ! యీ ప్రియసంగమోత్సవ కథ | వినినఁ బఠించిన వేవిధములఁ
బరమప్రియము లిందుఁ బరలోకమున సంభ | వించు మనమ్మున కించు భంగి
బాంధవయోగశోభనము వర్తిల్లు; న | నాయాసమున నామయాపగమము
గలుగు; భూదేవనికాయంబునకు దీనిఁ | దగ వినిపించిన ధార్మికులకు
 
తే. నవ్యయానంద సంప్రాప్తి యావహిల్లుఁ; | దత్పరతఁ గొనియాడిన దైవతములు
నీచదశఁ బొందకుండంగఁ గాచి తిరిగి | మే లొనర్తురు భరతభూపాలవర్య!’
128
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనుతో ‘ధృతరాష్ట్రుం డట్లు కృష్ణద్వైపాయన ప్రసాదలబ్ధం బైన తత్కాల కలితదృష్టి విశేషంబున బంధులోకంబు నాలోకించి మఱియేమి వర్తనంబున నుండెఁ? బాండవు లెట్లు వర్తించి? రెఱింగింపవే’ యనుటయు నతనికి నతం డిట్లనియె. 129
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )