పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
నారదుఁడు పాండవులకు ధృతరాష్ట్రాదుల నిర్యాణంబు చెప్పుట. (సం. 15-45-1)
సీ. ‘భూపవరేణ్య! తపోవనంబుననుండి | వచ్చితిఁ దీర్ధసేవా పరత్వ
మున నేను బహుదేశములఁ జరించితి; నినుఁ | గని పెద్దకాలంబు గానఁ జూడఁ
దివిరి యిందులకు నేతెంచితి; ధృతరాష్ట్రు | చరితంబు జాహ్నవీపరిసరంబు
జనములచే వింటి’ ననిన నజ్జనపతి | ‘యా రాజవరుఁడు గాంధారి గొంతి
 
తే. సంజయుండు సమాధాన సహితులై శ | రీరముల వింత పుట్టకున్నారె?’ యనియె;
ననుడు నద్దేవముని ‘వారి యఖిల వర్త | నంబు వినుము సుస్థిర హృదయంబుతోడ.’
146
వ. అని పలికి యిట్లను ‘మీరు పోయి కాంతారంబున నక్కురువృద్ధుం గొలిచియుండి, యతం డనుమతి సేయ నిట వచ్చితిరి; మఱి కొన్ని దినంబులకు. 147
సీ. ఆ రాజు నియతి గాంధారియు గొంతియు | సంజయుండును దోన చనఁగ నగ్ని
హోత్రంబు గొని యాజకోత్కరం బగ్రేస | రంబయి పో నిజాశ్రమము విడిచి
యరిగె గంగాద్వార పరిసరారణ్య భా | గమునకు; నందు దుష్కరతపంబు
వాయుభక్షతఁ బూని చేయఁ దొడంగె; గాం | ధారియు నీళ్ళ నాహారకలన
 
తే. మోపి యొనరించె; గొంతి మాసోపవాస | నియమ మూఁది వర్తించె; సంజయుఁడు సప్త
భోజనాంతరితం బగు భోజనంబు | వ్రతము గాఁగఁ జరించెఁ గౌరవ్యముఖ్య!
148
తే. యాజకులు దార యక్కురురాజు భక్తి | యుక్తి నొద్దనుండఁగ నగ్నిహోత్ర హోమ
మాచరింతు రొక్కొకమరి యతఁడు పర్ణ | శాల వెడలి శూన్యాటవి సంచరించు.
149
వ. విషమ ప్రదేశంబుల నవ్విభునకు సంజయుండును | గాంధారికిఁ గుంతియుఁ గన్నై మెలంగుదు; రొక్కనాఁడు వారలందఱు గంగాద్వారంబునం గృతస్నానులై యాశ్రమంబునకు వచ్చుచుండ మహావాతోద్ధూతంబై. 150
సీ. పటుతరం బగు ఛటచ్ఛటరవ మెసఁగంగ | మ్రాఁకులుఁ బొదలును గాఁచికొనుచుఁ
గమరును నార్తనాదంబును బెల్లుగ | నఖిలమృగంబుల నాఁచికొనుచు
లాఁగలఁ బుట్టల లోఁగిన శిఖల భు | జంగమ కులముల మ్రింగికొనుచు
వెగడొంది యఱచుచు నెగయు బల్పులుఁ గులఁ | బొగ నూర్థ్వకీలలఁ బొదివి కొనుచు
 
తే. దెసల నన్నిటఁ దన సముదీర్ణగతులు | దారుణ స్ఫురణమున విస్తార మొంద
ఖేచరులకును భయముగ నేచి పరఁగె | నద్భుతోద్భవం బైన మహానలంబు.
151
వ. ఇట్లెరగలి చిచ్చు గవిసి చుట్టు ముట్టిన నమ్మనుజనాథుండును నన్నాతులు నిరాహారులై యునికిం జేసి యొక్క చోటఁ దఱియ నుఱికి తొలంగిపోవ లావులేరై; రట్టియెడ నా రాజర్షిసత్తముండు సంజయుతోడ. 152
సీ. ‘ఒక్కింత దెఱపి నీ వెక్కడ నైనను | గనుఁగొని పా మ్మగ్ని దనుకకుండ’
నని చెప్పి తలఁగిపోఁ దనకు గాంధారికిఁ | గుంతిభోజాత్మజకును నశక్య
మగుటయుఁ జెప్పిన నడలొంది యా సూత | సుతుఁడు ‘మీరును నొకచోట వెడలి
పోవుట గలిగినఁ బోదు గా కే దవా | గ్నికి మిమ్ము నెర చేసి యకట పోదు
 
ఆ. నే మహాత్మయనుడు ‘నిలువాసి యిట్లున్న | జనుల కివ్విధమున సమయు టెగ్గు
గాదు; నీకుఁ బోవఁగా వచ్చి యుండంగఁ | బోవ కునికి పాపమునకుఁ బట్టు.’
153
వ. అని పలికి యతనిం బోవ నొడంబఱిచి యప్పౌరవ సత్తముండు సమాహితచిత్తుండై ప్రాఙ్ముఖాసీనుం డయ్యె; గాంధారియుం గుంతియు నవ్విధంబునం గూర్చుండి; రప్పుడు సంజయుండు ధృతరాష్ట్రుతో ‘యోగయుక్తుం డవు గ’ మ్మనియె; నతండు నట్లు సేసెఁ; దదనంతరంబ. 154
ఆ. ఒక్కతెఱపి సంజయుఁడు సని హిమశైల | మెక్కె;నంత వారి నెల్ల నగ్ని
వొదివికొనియె; నిట్లు వోయి రమ్మువ్వురుఁ | బుణ్యలోకమునకు భూపవర్య!
155
సీ. పదపడి నృప! యేను భాగీరథీతీర | మున వచ్చుచుండి యవ్వనము దివ్య
మునులచే మీ రటు సని క్రమ్మఱంగ వ | చ్చినది యాదిగ నయ్యశేష వృత్త
మును నేర్పడఁగ వింటి, మూఁడు కళేబర | ములుఁ గంటి; నక్కురుపుంగవుండు
భార్యయుఁ బాండుని పత్నియు సద్గతి | నొందిరి; నీ వింక నుమ్మలింప
 
ఆ. కుండు’ మనిన శోక మొదవి యాతఁడు బాహు | లెత్తి యెలుఁగు సెలఁగ నేడ్వఁ దమ్ము
లడలు గదిరి యేడ్చి; రవ్వార్త నంతఃపు | రమున రోదనార్తరవము లెసఁగ!
156
వ. అవ్విశేషంబు. 157
క. విని పౌరజనసమూహము | లనయంబును వనట మునిఁగి హాహారవముల్‌
వినువీథి ముట్ట రోదన | మొనరిచె నవ్వేళఁ గరుణ ముత్కట మయ్యెన్‌.
158
క. నారదుఁ డుపశమ ఫణితులఁ | గౌరవసత్తమునిఁ దేర్పఁ గ్రమమున నాక్రం
దారవము లుడిగె బంధుజ | నారబ్ధము లైన యనునయాలాపములన్‌.
159
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )