| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్‌క్షణంబ నాగకుమారులం బిలిచి ‘మీరలు విప్రుల రయి సురభి కుసుమ స్వాదు వన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితు పాలికిం జని యిం’ డని పంచి, తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన. | 193 |
| చ. |
ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైనవారి ఋ గ్యజుషపదక్రమంబులు క్రియన్ గుణియించుచు వచ్చువారి న గ్గజపురవల్లభుండు గని, గ్రక్కున డాయఁగఁ బిల్చి మెచ్చి, భా వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్. |
194 |
| క. |
వారల నర్హప్రియ స | త్కారులఁ గావించి పుచ్చి, కాలనియోగ ప్రేరితుఁ డై, యమరేంద్రా | కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్. |
195 |
| ఉ. |
సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁ గూర్చుమిత్త్రులన్ సారబలుండు చూచి ‘మునిశాపదినంబులు వోవుదెంచె, నం భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు’ నం చొగిఁ దత్ఫలావలుల్ వారల కెల్లఁ బెట్టి, యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్. |
196 |
| క. |
కొని వ్రచ్చుడు, లోపల న | ల్లనిక్రిమి యై తోఁచి, చూడ లత్తుక వర్ణం బునఁ బామై, విషవహ్నులు | దనుకఁగఁ గురువీరుఁ గఱచి తక్షకుఁ డరిగెన్. |
197 |
| వ. | తత్పరిజనంబు లందఱు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఱచి; రయ్యేకస్తంభహర్మ్యంబును దక్షకవిషాగ్ని దగ్ధంబయ్యె; నట్లు భవజ్జనకుండు పరలోకగతుండైనం, బురోహిత పురస్సరానేకభూసురవరులు యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత. | 198 |