| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అయ్యయాతియుఁ దత్ప్రదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెఱింగినవాఁ డై యతిశయరూప లావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి, ‘మీ రెవ్వరివారలు మీకులగోత్ర నామంబు లెఱుంగ వలతుం జెప్పుం’ డనిన నారాజునకు దేవయాని యి ట్లనియె. | 158 |
| తే. |
నన్ను మున్న యెఱుంగు; దిన్నాతి నాకు | దాసి, వృషపర్వుఁ డను మహాదానవేంద్రు కన్య; నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు | ననఘ! మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు. |
159 |
| ఉ. |
నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ! కూపము వెల్వరించునాఁ డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి కాన మున్న పా ణిగ్రహణంబు సేసి; తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే. |
160 |
| ఉ. |
‘నన్ను వివాహ మై నహుషనందన! యీలలితాంగిఁ దొట్టి యీ కన్నియలందఱున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ కున్నతిఁ బ్రీతి సేయఁగ నృపోత్తమ! వాసవుఁ బోలి లీలతో నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు’ నావుడున్. |
161 |
| వ. | ‘క్షత్త్రియకన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక; యధర్మోత్తరంబుగా క్షత్త్రియులు బ్రాహ్మణకన్యకల వివాహం బగుదురే? నీపలుకులు ధర్మ విరుద్ధంబులు; మఱియు సర్వవర్ణాశ్రమధర్మంబులు సంకరంబులు గాకుండ రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితినేని జగత్ప్రవృత్తి విపరీతం బగు’ ననిన నయ్యయాతికి దేవయాని యి ట్లనియె. | 162 |
| క. |
‘వెలయఁగ ధర్మాధర్మం | బులు నడపుచు నిఖిలలోకపూజ్యుండై ని ర్మలుఁ డగు శుక్రుఁడు పంచిన | నలఘుభుజా! నను వివాహ మగుదే?’ యనినన్. |
163 |
| వ. | ‘అమ్మహాముని వచ్చి యిది ధర్మవిరుద్ధంబు గా దని చెప్పెనేని నిన్ను వివాహం బగుదు’ నని యయాతి యొడంబడిన దేవయాని యప్పుడ శుక్రు రావించిన. | 164 |
| క. |
తనదివ్యతేజమున న | వ్వన మెల్ల వెలుంగుచుండ వచ్చెను భృగునం దనుఁడు నిజనందనకుఁ బ్రియ | మొనరింపఁగఁదలఁచి దానియొద్దకుఁ బ్రీతిన్. |
165 |
| క. |
అతిసంభ్రమమున నవనీ | పతి విహితోత్థానుఁ డై తపశ్శక్తిఁ బ్రజా పతినిభుఁ డగు భార్గవునకు | నతిభక్తిం బ్రణమితోత్తమాంగుం డయ్యెన్. |
166 |
| వ. | మఱియు దేవయానియు శర్మిష్ఠయుం గన్యకాసహస్రంబును నత్యంతభక్తితోఁ గ్రమంబున నమస్కరించి; రంత దేవయాని శుక్రున కి ట్లనియె. | 167 |
| ఆ. |
ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై | యున్న నాకరంబు గ్రన్న నింక నొరున కర్హ మగునె పరిణయ విషయ మై | ధరఁ బరిగ్రహింపఁ బరమమూర్తి!. |
168 |
| వ. | ‘కావున నాకు నీ జన్మంబునఁ బతి యయాతియ; యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదు ననియె; నిందు ధర్మవిరోధంబు లేకుండు నట్లుగాఁబ్రసాదింపవలయు’ ననిన శుక్రుండు గరుణించి ‘యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడు’ మని వరం బిచ్చి యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి, శర్మిష్ఠం జూపి ‘యిది వృషపర్వుని కూఁతురు; దీనికిఁ బ్రియంబున నన్నపాన భూషణాచ్ఛాదన మాల్యానులేపనాదుల సంతోషంబు సేయునది; శయనవిషయంబునఁ బరిహరించు నది’ యని పంచి, కూఁతు నల్లునిం బూజించిన; నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను గన్యకా సహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతఃపురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి, తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్క గృహంబునందుఁ గన్యకాసహస్రంబుతో శర్మిష్ఠ నునిచి, దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్నఁ; గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసు లను కొడుకులు పుట్టి; రంత శర్మిష్ఠ సంప్రాప్తయౌవనయు ఋతుమతియు నై యాత్మగతంబున. | 169 |
| చ. |
అసదృశయౌవనం బిది యనన్యధనం బగు నొక్కొ! నాకు ని క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ కుసుమ సముద్గమం బగు నొకో! పతిలాభము లేమిఁ జేసి; యొ ప్పెసఁగఁగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో! |
170 |
| క. |
పతిఁ బడసి సుతులఁ బడయఁగ | నతివలు గోరుదురు; గోరినట్టుల తనకుం బతిఁ బడసి సుతులఁ బడసెను; | సతు లీభార్గవికి భాగ్యసంపద నెనయే. |
171 |
| తరువోజ |
ఈ రాజునంద నా హృదయంబు దవిలి యెప్పుడు నుండు; న న్నీతఁడు గరము కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ; గమలాక్షి భార్గవకన్య దా నెట్లు గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నటుల యేను గోరి లోకైక భారధురంధరుఁ బరహితు ధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు. |
172 |