| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| శా. |
ఆ దుష్యంతుఁ డనంతసత్త్వుఁడు సమస్తాశాంతమాతంగ మ ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండఁగా నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్. |
8 |
| క. |
ఆతని రాజ్యంబున ను | ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసి రుజాశో కాతంక క్షయ శంకా | పేతం బై ధర్మచరితఁ బెరుఁగుచు నుండెన్. |
9 |
| వ. | అమ్మహీపతి యొక్కనాఁడు మృగయావినోదార్థి యయి యాదిత్యహయంబులకంటె వడిగల హయంబులు పూనిన రథం బెక్కి యాజానేయతురంగారూఢు లైన యాశ్వికులు పరివేష్టించి రాఁగ ననంతకుంతశక్తిచాప కృపాణపాణు లయిన వీరభటసహస్రంబులతోఁ జని వనంబులోని మృగంబులం జుట్టుముట్టి. | 10 |
| క. |
కలయఁగ నార్పుల బొబ్బల | యులివున నవ్విపిన మను మహోదధిఁ బెలుచం గలఁచెను దుష్యంత మహా | బల మందరనగము సత్త్వభయజననం బై. |
11 |
| క. |
సరభస పరిచరిత మహా | శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద ద్విరదాది ప్రకర భయం | కరవనమధ్యమున నృపతి గడుఁ గడిమిమెయిన్. |
12 |
| క. |
ఓసరిలి పఱచు మృగముల | నేసియు, డాసిన మృగముల నెగచి భుజాసిన్ వ్రేసియుఁ, జంపెను మృగయా | వ్యాసక్తి నపారఘోరవన్యమృగాళిన్. |
13 |
| వ. | ఇట్లు పెక్కుమృగంబుల నెగిచి చంపుచు మఱియుఁ జంపెడువేడుక నతి దూరంబున కరిగిన, నాతని రథవేగంబు ననుగమింపనోపక యధిక క్షుత్పిపాసాపరవశు లయి పదాతు లయ్యయి ప్రదేశంబుల విశ్రమించి; రంత దుష్యంతుండు కతిపయామాత్య పురోహితసహితుం డై కొండొకనేల యరిగి, ముందట నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభి కుసుమఫల భారవినమ్ర తరులతాగుల్మ పరిశోభితం బయిన యొక్కవనంబు గని. | 14 |